Home ఎడిటోరియల్ చైనాపై అమెరికా అస్త్రాలు

చైనాపై అమెరికా అస్త్రాలు

US-Chine

 

చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికా అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. దానికి దీటుగా చైనా తాను చేయాల్సింది తాను చేసుకుపోతోంది. ఒక వైపు హాంకాంగ్‌లో అల్లర్లను రెచ్చగొట్టి ఏదో ఒక పెద్ద వుదంతం జరిగేలా చూసేందుకు అమెరికా చేయాల్సిందంతా చేస్తోం ది. మరోవైపున తైవాన్‌కు తాజాగా 220 కోట్ల డాలర్ల మేర ఆయుధాలను విక్రయించేందుకు నిర్ణయించి చైనాను రెచ్చగొడుతోంది. చైనా నుంచి 300 బిలియన్ డాలర్ల దిగుమతులపై పది శాతం సుంకాన్ని పెంచనున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. దానికి ప్రతిగా చైనా యువాన్ విలువను తగ్గించటం లేదా పతనాన్ని నిరోధించకుండా చైనా వుపేక్షించిందని వార్తలు వచ్చాయి.

హాంకాంగ్ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా నేరాలు చేసిన వారిని విచారించేందుకు ప్రధాన భూ భాగానికి అప్పగించేందుకు వుద్దేశించిన బిల్లును ఆమోదించరాదనే డిమాండ్‌తో అక్కడ తొమ్మిది వారాల క్రితం ఆందోళన ప్రారంభమైంది. ఆ ప్రతిపాదనను వెనక్కు తీసుకున్నామని, అది రద్దయినట్లే అని పాలక మండలి ప్రకటించిన తరువాత కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. అలాంటి బిల్లును ఎన్నడూ పెట్టకూడదు అంటూ ఆందోళనకారులు పాలనా మండలి భవనం మీద దాడి చేశారు. రోజుకో పేరుతో ఆందోళనకు వీధుల్లోకి వస్తూ పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది మీద దాడులు చేసి రెచ్చగొట్టటం, తద్వారా శాంతి భద్రతల పరిస్ధితిని సృష్టించేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. అంతే కాదు, తమకు మరింత ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం కావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దానికి బ్రిటన్, అమెరికా తదితర దేశాలు వంతపాడుతున్నాయి.

తాజాగా ఐదు రోజుల నిరవధిక ఆందోళన పిలుపులో భాగంగా సోమవారం నుంచి మెట్రో స్టేషన్లలో ప్రవేశించి ప్రయాణీకులను దించి వేయటం, తలుపులను మూసుకోకుండా చేసి రైళ్లను కదలనివ్వకుండా అడ్డుకుంటున్నారు. దానిలో భాగంగానే విమానాశ్రయాల్లో ప్రవేశించి తిష్టవేయటం, విధి నిర్వహణలో వున్న సిబ్బందిని అడ్డుకోవటం, ప్రయాణీకులను భయభ్రాంతులకు గురి చేయటం వంటి చర్యలనూ ప్రారంభించారు. ఇంతగా రెచ్చగొట్టినప్పటికీ పాలనా యంత్రాంగం, స్ధానిక పోలీసులు ఎంతో సంయమనం పాటిస్తున్నారు. ఇదే మరొక చోట అయివుంటే ఏమి జరిగి వుండేదో అర్ధం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా మిలిటరీ దళాలను రంగంలోకి దించేందుకు పాలక మండలికి అవకాశం వున్నప్పటికీ వాటిని వుపయోగించ లేదు. ఆందోళనకారుల వెనుక అమెరికా ఇతర దేశాల హస్తం వుందని గ్రహిస్తున్న వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. మరోవైపు శాంతి భద్రతల సమస్యను సృష్టించే విధంగా ఆందోళనకారుల చర్యలు వున్నాయి. ఈ పూర్వరంగంలో చైనా ప్రభుత్వం ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పూనుకున్నట్లు ముఖ్యంగా పశ్చిమ దేశాల మీడియాలో వీటి గురించి చిలవలు పలవలుగా కథనాలు వండి వార్చుతున్నది. మిలిటరీని దించబోతున్నారన్నది వాటిలో ఒకటి.

జూన్ తొమ్మిది నుంచి ఇప్పటి వరకు చట్టవిరుద్ధంగా సమావేశాలు జరపటం, పోలీసుల మీద దాడి, కొట్లాటలకు దిగటం వంటి చర్యల్లో పాల్గొన్నందుకుగాను 420 మందిని అదుపులోకి తీసుకోగా వారిలో ఒక్క సోమవారం నాడు అరెస్టు చేసిన వారే 82 మంది వున్నారు. కొందరు సిబ్బంది సమ్మె కారణంగా 170 విమానాలు నిలిచిపోయాయి. వారాల తరబడి జరుగుతున్న ఆందోళనల కారణంగా ఆర్ధికంగా కొన్ని రంగాలు దెబ్బతిన్నాయి. టూరిజం, దాని సంబంధిత కార్యకలాపాలు, దుకాణాల్లో అమ్మకాలు, స్టాక్ మార్కెట్లో సూచీలు పడిపోయాయి. హాంకాంగ్ పాలనా మండలి అధ్యక్షురాలు లావ్‌ు రాజీనామా చేయాలన్నది ఆందోళనా కారుల డిమాండ్లలో ఒకటి. అయితే తాను పదవి నుంచి తప్పుకోబోవటం లేదని, నగరంలో పరిస్ధితి ప్రమాదకరంగా మారుతోందని చెప్పారు.

నిరసన తెలిపే హక్కును గౌరవిస్తామని అదే సమయంలో నిరసనకు దూరంగా వున్న వారి హక్కులను నిరసనకారులు కూడా గౌరవించాలని అన్నారు. ఆందోళన ప్రారంభంలో చేసిన డిమాండ్లకు బదులు ఇప్పుడు కొత్తవాటిని ముందుకు తెస్తున్నారని, ప్రాణాలకు సైతం తెగించి అమీతుమీ తేల్చుకుంటామని చెబుతున్నారని ఆమె చెప్పారు. మరోవైపున ఆందోళన నిర్వహిస్తున్న వివిధ బృందాలలో అంతర్గత విభేదాలు కూడా వెల్లడయ్యాయి. శాంతియుత నిరసన స్ధానంలో హింసాపూరితమైన వేర్పాటు వాదశక్తులు ప్రవేశించారని సామాజిక మాధ్యమంలో కొందరు విమర్శించారు. 2016 జూలై ఒకటిన ఇచ్చిన నిరసన పిలుపు విఫలం కావటంతో తీవ్రవాద బృందాల మధ్య మీరంటే మీరు కారకులనే ఆరోపణలు చివరకు దెబ్బలాటలకు దారితీశాయని పరిశీలకులు గుర్తు చేశారు.

ఆందోళనకారులపై మిలిటరీ చర్య తీసుకుంటే చైనా ఆర్థిక వ్యవస్ధకే నష్టమని అమెరికా టివి సిఎన్‌ఎస్ బెదిరించింది. హాంకాంగ్ వీధుల్లో చైనా మిలిటరీ కవాతు గురించి కొద్ది వారాల క్రితం వూహించ లేదని ఇప్పుడు ఆ అవకాశం కనిపిస్తోందని వ్యాఖ్యాత పేర్కొన్నారు. నిరసనకారుల హింసాకాండను సహించరాదని హాంకాంగ్‌లోని కమాండర్ గత వారంలో చేసిన వ్యాఖ్యను వుటంకిస్తూ మిలిటరీ రంగంలోకి దిగే అవకాశం వుందని అమెరికా మీడియా చెబుతోంది.1989లో తియన్మెన్ మాదిరి జరగవచ్చని వూహాగానాలను కుమ్మరిస్తోంది. హాంకాంగ్‌లో పరిస్థితి చేయి దాటిపోయినపుడు అక్కడ వున్న ఆరు వేల మంది సైన్య సహాయం కోరేందుకు అక్కడి పాలనా వ్యవస్ధకు చట్టబద్ధమైన అవకాశం వుంది.

ఒకే దేశం రెండు వ్యవస్ధలు అనే విధానాన్ని అమలు జరిపి 2050 వరకు చైనాలో విలీనమైన హాంకాంగ్, మకావో దీవుల్లో విలీనానికి ముందున్న వ్యవస్ధలనే కొనసాగిస్తామని చైనా వాటి అప్పగింతల సమయంలో బ్రిటన్, పోర్చుగీసులతో ఒక ఒప్పందం చేసుకుంది. అందువలన అనేక బహుళ జాతి కంపెనీలకు ఇప్పటికీ హాంకాంగ్ ఒక కేంద్రంగా కొనసాగుతోంది. దీని వలన చైనాకు ఎంతో లబ్ధి కలుగుతోంది. ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం పేరుతో ఆందోళన నిర్వహిస్తున్నవారి వెనుక ఆమెరికా హస్తం వుందని ఇప్పటికే చైనా విమర్శించింది. ఆందోళనలతో హాంకాంగ్ ఆర్ధిక వ్యవస్ధను చిన్నాభిన్నం చేయటం ద్వారా చైనాకు నష్టం కలిగించాలన్న దుష్టాలోచన కూడా అమెరికాకు వుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

తన మార్కెట్‌ను అంతర్జాతీయ కంపెనీలకు పూర్తిగా తెరవకుండానే హాంకాంగ్ ద్వారా చైనా లబ్ధి పొందుతోంది. 2016లో చైనాకు వచ్చిన ఎఫ్‌డిఐలో 61శాతం హాంకాంగ్ నుంచే వుందని సిఎన్‌ఎన్ పేర్కొన్నది. చైనా సైన్యం కనుక ఆందోళనకారులను అణచివేస్తే ప్రపంచ స్టాక్ మార్కెట్లో హాంకాంగ్‌కు వున్న ఐదవ స్దానం తీవ్రంగా పడిపోతుందని, కంపెనీలు సింగపూర్‌కు తరలిపోతాయని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. హాంకాంగ్‌కు వున్న సానుకూల వాణిజ్య హోదాను రద్దు చేయాల్సి వుంటుందని కొంత మంది అమెరికా ఎంపిలు బెదిరించారు. ఒక వేళ సైన్యాన్ని దించి మరో తియానన్మెన్ వుదంతం పునరావృతమైతే దాన్ని ప్రపంచానికంతటికీ ప్రత్యక్ష ప్రసారం చేస్తారని ఆస్ట్రేలియాకు చెందిన బెన్ బ్లాండ్ హెచ్చరించాడు.

తైవాన్ ఒక దేశం కాదు. ఐక్యరాజ్యసమితి వేదికలపై దాన్ని చైనాలో అంతర్భాగంగా గుర్తిస్తున్న అమెరికా శాంతియుత పద్ధతుల్లో విలీనం కాకుండా చేయాల్సిందంతా చేస్తోంది. తమ కౌలు గడువు ముగిసిన తరువాత హాంకాంగ్‌ను బ్రిటీష్ వారు తిరిగి చైనాకు అప్పగించారు. తైవాన్ గత ఏడు దశాబ్దాలుగా తిరుగుబాటు రాష్ర్టంగా వుంది. దానిని స్వాధీనం చేసుకోవటానికి చైనాకు కొద్ది గంటలు చాలు, అయినా అక్కడి జనం అంగీకారంతో జరగాలి గనుక ఎలాంటి దుస్సాహసానికి పాల్పడటం లేదు. హాంకాంగ్ విలీనమైనా అక్కడి పరిస్ధితుల కారణంగా వెంటనే ప్రధాన భూభాగంతో మమేకం చేయకుండా ఒకే దేశం, రెండు వ్యవస్ధల పేరుతో 2050 వరకు అక్కడ వున్న పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని, ప్రత్యేక పాలనా వ్యవస్ధను ఏర్పాటు చేస్తామని విలీన సమయంలో ఒక హామీ పత్రం రాసి ఇచ్చింది. ఇదే సూత్రాన్ని తైవాన్‌కు కూడా వర్తింప చేసేందుకు చైనా ఆ విధానాన్ని ఎంచుకుంది. పోర్చుగీసు కౌలు నుంచి విలీనమైన మకావో దీవులకు కూడా ఇదే సూత్రాన్ని వర్తింప చేసింది.

తాజాగా తైవాన్ ప్రభుత్వానికి 220 కోట్ల డాలర్ల విలువ గల ఆయుధాలను విక్రయించాలని అమెరికా నిర్ణయించుకుంది. తైవాన్ స్వాతంత్య్రానికి మద్దతు ఇస్తున్నాం కనుక తాము ఆయుధాలు విక్రయిస్తాం అంటూ అమెరికా అడ్డగోలు వాదనలు చేస్తోంది. అమెరికా చర్యకు ప్రతిగా చైనా మిలిటరీ విన్యాసాలు నిర్వహించింది. ఇంకేముంది చూడండి తైవాన్ స్వాతంత్య్రం కోరే వారిని భయపెట్టేందుకే అమెరికా నానాయాగీ చేస్తోంది. సాధారణ కార్యకలాపాల్లో భాగంగానే మిలిటరీ విన్యాసాలు నిర్వహించాలని చైనా నిర్ణయించింది. అయితే ఈ చర్య తైవాన్ స్వాతంత్య్రం కోరుకొనే వారిని బెదిరించటమే అని అమెరికా మీడియా వక్రీకరిస్తోంది. తైవాన్‌ను చైనా స్వాధీనం చేసుకోకుండా వుండేందుకే తాము ఆయుధాలు అందచేస్తున్నామని, ఆ ప్రాంతానికి మిలిటరీని తరలిస్తున్నామని అమెరికా ఎప్పటి నుంచో చెబుతోంది.

అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధాన్ని దెబ్బతీసేందుకు, తన ప్రయోజనాలను కాపాడుకొనేందుకు చైనా ప్రయత్నిస్తోంది. సోమవారం నాడు యువాన్ విలువ అనూహ్యంగా పతనమైంది. చైనా తలచుకుంటే దాన్ని నివారించవచ్చని అయితే కావాలనే వుపేక్షించిందని వార్తలు వచ్చాయి. యువాన్ పతనమైతే చైనా నుంచి సరకులను దిగుమతి చేసుకొనే వారికి లబ్ధి కలుగుతుంది. ట్రంప్ కనుక దిగుమతులపై ఇంకా సుంకాలను పెంచితే యువాన్ విలువ ఇంకా పతనం అవుతుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు ఇంకా పెరిగి అమెరికా నష్టపోనుంది. వాస్తవానికి అమెరికా వాణిజ్య బెదిరింపులను తట్టుకొనేందుకు ఒక్క చైనాయే కాదు అనేక దేశాలు తమ కరెన్సీల విలువల పతనాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మరోవైపున తన ఎగుమతులను పెంచుకొనేందుకు డాలరు విలువను తగ్గించాలని అమెరికా కూడా ప్రయత్నిస్తోంది. ఈ పూర్వరంగంలో పరిస్ధితులు ఎటువైపు దారితీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

నిరసనకారులు ఎంతగా రెచ్చగొడుతున్నా వారి మీద స్ధానికుల్లో వ్యతిరేకత మరింత పెరిగే వరకు మౌనంగా వున్నవారు నిరసనకు వ్యతిరేకంగా గళం విప్పే వరకు హంకాంగ్ విషయంలో చైనా వేచి చూసే అవకాశం వుంది. తైవాన్‌కు ఆయుధాలు విక్రయించటం అమెరికాకు ఇదే కొత్త కాదు. ఇక వాణిజ్య యుద్ధ్దం మరింత ముదురనున్నదనే వార్తల పూర్వరంగంలో చైనా కరెన్సీ యుద్ధ రంగాన్ని తెరిచేందుకు నిర్ణయించిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. రానున్న రోజుల్లో యువాన్ విలువ కదలికలను బట్టి ఒక అంచనాకు రావాలి తప్ప ప్రస్తుత పతనాన్ని బట్టి నిర్ధారణలకు రాలేము.

US raised 10% tariffs on Chinese goods