సాగు చట్టాలపై భారత్‌కు అమెరికా మద్దతు
సంస్కరణలను స్వాగతిస్తున్నాం.. సమస్యలను చర్చలు ద్వారా పరిష్కరించుకోండి
అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన
వాషింగ్టన్: భారత్‌లో తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు ట్విట్టర్ ద్వారా అంతర్జాతీయ సెలబ్రిటీలు మద్దతు పలుకుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా భారత్‌కు అండగా నిలిచింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు భారత్ చేపడుతున్న చర్యలకు బైడెన్ ప్రభుత్వం మద్దతిస్తుందని తెలిపింది. శాంతియుత ఆందోళనలు ప్రజాస్వామ్య దేశాల లక్షణమే అని, చర్చల దారా ఆ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. భారత్‌లో జరుగుతున్న ఆందోళనలపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందిస్తూ ‘సాధారణంగా భారత మార్కెట్ల సామర్థాన్ని పెంచేలా, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేలా ఆ దేశ ప్రభుత్వం చేపట్టే చర్యలను అమెరికా ప్రభుత్వం స్వాగతిస్తోంది. వ్యవసాయ రంగంలో భారత్ తీసుకొస్తున్న సంస్కరణల వల్ల అక్కడి రైతులకు మార్కెట్ పరిధి పెరుగుతుంది.
అయితే, అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య దేశాలకు శాంతియుత నిరసనలు అలవాటే. భారత సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పింది. కానీ ఎలాంటి విభేదాలనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా ప్రోత్సహిస్తుంది’ అని ఆ ప్రతినిధి తెలిపారు. విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అమెరికా విదేశాంగ శాఖ తొలుత ఈ ప్రకటన చేయగా ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం ప్రతినిధి గురువారం పునరుద్ఘాటించారు. ఇంటర్నెట్ ఆంక్షలపై ఆ ప్రతినిధి స్పందిస్తూ ‘శాంతియుత నిరసనలు, దాపరికంలేని సమాచార మార్పిడి అనేవి ప్రజాస్వామ్యానికి హాల్‌మార్క్ వంటివని మా అభిప్రాయం’ అని అన్నారు. అమెరికా ప్రభుత ప్రకటనపై భారత ప్రభుత్వంనుంచి వెంటనే ఎలాంటి స్పందనా రాలేదు.
US Supports to Indian New Farm Laws