Saturday, April 20, 2024

అమెరికా వీసాదారులకు శుభవార్త..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: విద్యార్థులు, వృత్తి నిపుణులకు ఊరట కల్పిస్తూ అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీసా దరఖాస్తుదారులకు కొన్ని వలసేతర కేటగిరీల్లో ఇంటర్వూల విషయంలో ఇస్తున్న మినహాయింపును పొడిగించింది. 2022 సంవత్సరం మొత్తానికి ఈ నిర్ణయం వర్తించేలా ఇప్పటికే ఒకసారి నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు దాన్ని 2023 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్తగా లేదా పునరుద్ధరణ వీసా దరఖాస్తుల్లో ఎవరిని ఇంటర్వూకు పిలవాలో నిర్ణయించే అధికారాన్ని కాన్సులర్ అధికారులకు అప్పగించినట్లు తెలిపింది. విదేశీ విద్యార్థులు, తాత్కాలిక వర్కర్లు అమెరికాకు రావడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న మేలును గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటన పేర్కొంది. తాజా నిర్ణయం వల్ల భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులు, వృత్తి నిపుణులకు మేలు జరగనుంది.

సాధారణంగా అమెరికాలో ఏ వీసాకైనా వ్యక్తిగత ఇంటర్వూ తప్పనిసరి. అందులో ఎంపికయితేనే వీసా మంజూరవుతుంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈ విధానాన్ని పక్కన పెట్టిన అమెరికా.. చైనా సహా పలు దేశాల్లో మరోసారి కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ విధానాన్ని మరోసారి పొడిగించింది. ఇంటర్వూ మినహాయింపు వల్ల వీసా వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా తగ్గిందని ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా కొన్ని కేసుల్లో వ్యక్తిగత ఇంటర్వూలు నిర్వహించే అధికారం రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ అధికారులకు ఉంటుందని తెలిపింది.

అమెరికా పేర్కొన్న వీసా కేటగిరీల్లో తాత్కాలిక అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ వర్కర్లు( హెచ్2 వీసాలు), విద్యార్థులు (ఎఫ్, ఎం వీసాలు), అకడమిక్ ఎక్స్‌చేంజి విజిటర్స్(అకడమిక్ జె వీసాలు), ప్రత్యేక వృత్తి నిపుణులు (హెచ్1బి వీసాలు), శిక్షణ, ప్రత్యేక విద్య సందర్శకులు (హెచ్3), ఒక కంపెనీనుంచి మరో కంపెనీకి బదిలీ అయ్యే వారు( ఎల్ వీసాలు), విశేష ప్రతిభావంతులు( ఒ వీసాలు), క్రీడాకారులు, కళాకారులు వినోదరంగం వారు(పి), అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే వారు (క్యు వీసాలు)ఇంటర్వూనుంచి మినహాయింపు పొందవచ్చు. వీరితో పాటుగా ఇప్పటికే ఒకసారి వీసా పొంది దాని కాలపరిమితి ముగిసే 48 నెలల్లోగా పునరుద్ధరించుకోవాలని భావించే వారు కూడా వ్యక్తిగత ఇంటర్వూలనుంచి మినహాయింపునకు అర్హులని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News