Home ఎడిటోరియల్ కూటమిని చీల్చే కులాస్త్రం

కూటమిని చీల్చే కులాస్త్రం

edt

భారతదేశంలోనే జనాభా పరంగా.. భౌగోళికంగా చూసినా ఉత్తర్‌ప్రదేశ్ అత్యంత పెద్ద రాష్ట్రం. హస్తిన పీఠాన్ని అధిరోహించాలంటే రాజకీయంగా ఎన్నికల గోదాలో దిగే ప్రతి రాజకీయ పార్టీకి ఈ రాష్ట్రమే అత్యంత కీలకమైనది. ఎందుకంటే అత్యధిక లోక్‌సభ స్థానాలు (80) ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీయే కేంద్రంలో జెండా ఎగురవేయడమో, లేకపోతే ప్రభుత్వం ఏర్పాటులో చక్రం తిప్పడమో ఖాయం.
రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా అవతరించిన బిజెపిని ఎదుర్కొవాలంటే జట్టుకట్టక తప్పదని ఎస్‌పి, బిఎస్‌పిలు కూటమి కట్టాయి. కమలం పార్టీని ఎలాగైనా కకావికలు చేయాలని అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పి), మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్‌వాదీ పార్టీలు (బిఎస్‌పి) జట్టుకట్టి ఇటీవల జరిగిన రెండు లోక్‌సభ ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటడంతో పాటు బిజెపికి వెన్నులో వణుకు పుట్టించాయి. ఇరుపార్టీలు కలిస్తే కమలం కమిలిపోవాల్సిందేనన్న గట్టి హెచ్చరిక సంకేతాలు పంపాయి. దీంతో బిజెపి పెద్దలు ఆలోచనలో పడ్డారు. ఎలాగైనా ఎస్‌పి, బిఎస్‌పిలతో కూడిన బలమైన జోడిని విడగొట్ట్టాలని కంకణం కట్టుకున్నారు. మొత్తానికి ‘బ్రహ్మాస్తం’ను బయటకు తీయాలని నిర్ణయించుకున్నారు. అదే ‘కులం’ అనే అస్త్రం. యుపిలోని ఒబిసిలలో 82 కులాలు ఉన్నాయి. ఇప్పుడు వీరిని మూడు భాగాలుగా విభజించాలని యోగి సర్కార్ యోచిస్తోంది. మండల్ కమిషన్ చెప్పినట్టుగా ఈ కులాలకు అమలవుతున్న 27శాతం రిజర్వేషన్‌ను విభజించి పంచాలని భావిస్తోంది. సుహుల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బిఎస్‌పి) అధినేత, బిజెపి మిత్రుడు, యోగి మంత్రివర్గంలో సీనియర్‌గా పేరున్న ఓపీ రాజ్‌భర్ దీన్ని ధ్రువీకరించారు.
‘రాజకీయ బ్రహాస్త్రాన్ని వదలబోతున్నాం. 82 ఒబిసి కులాలను మూడు కేటగిరీలుగా విభజించి 27 శాతం రిజర్వేషన్‌ను పంచి ఆయా వర్గాల్లో ఇప్పటి వరకు నష్టపోయిన వారికి లబ్ధి చేకూర్చబోతున్నాం. 2019 ఎన్నికలకు ఆరు మాసాల ముందు దీన్ని మొదలు పెడతాం’ అని బల్లియాలోని రాసారలో ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. మా బ్రహ్మాస్త్రం నవజాత ఎస్‌పి—, బిఎస్‌పి కూటమిని కుప్పకూల్చుతుందని జోస్యం కూడా చెప్పారు.

ఒబిసి రిజర్వేషన్‌ను వర్గీకరిస్తే ఎస్‌పికి కీలక మద్దతుదారులుగా ఉంటూ వస్తున్న యాదవుల ఆధిపత్యానికి తీవ్ర సవాల్ ఎదురుకానుంది. ప్రస్తుతం ఒబిసి రిజర్వే షన్లలో గణనీయమైన ప్రయోజనాలు పొం దుతున్నది యాదవులే. రిజర్వేషన్ ఫలాల ను వారే అధికంగా పొందుతున్నారనే అసంతృప్తి ఇతర బి వర్గాల్లో ఉంది. ఈ అసంతృప్తి 2014 లోక్‌సభ, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో  బిజెపి విజయానికి    తోడ్పడింది. ఈ నేపథ్యంలో ఆ వర్గాలకు మరింత చేరువై ఎస్‌పి, బిఎస్‌పి కూటమి సామాజిక సమీకరణాన్ని దెబ్బతీయాల న్నది బిజెపి వ్యూహం. 

82 ఒబిసి కులాల్లోని 04 వెనక బడిన కులాలను ‘పిచ్‌డా’ అని, 19 అతి వెనకబడిన తరగతులను ఒక చోట చేర్చి ‘అతి పిచ్‌డా’గా, 59 అత్యంత వెనకబడిన కులాలను ఒక గూడు కింద కు తెచ్చి ‘సర్వాధిక్ పిచ్‌డా’ గా పేర్కొంటూ మూడు కేటగిరీలుగా విభజిస్తామని రాజ్‌భర్ వివరించారు. ఇది గనుక సీరియస్‌గా అమల్లోకి వస్తే ఇప్పటి వరకు ఒబిసిలలో ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్న యాదవ్‌లకు ఇది సవాలేనని, ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీని రాజకీయంగా తమ నిర్ణయం ఇరకాటంలోకి నెట్టివేసినట్టు అవుతుందని ఆయన పేర్కొన్నారు.
యుపిలోని ఒబిసి వర్గాల్లో సాధికారత సాధించిన వారు ఎంతో కొంత ఉన్నారంటే అది యాదవ్‌లేనని అక్కడ చెప్పుకుంటూ ఉంటారు. మిగతా వర్గాలకు వారి వాటాను ఆశగా చూపెట్టి వెనకబడిన తరగతుల్లోని ఇతర కులాలను తమవైపు ఆకర్షించుకోవచ్చన్నది బిజెపి ఉపాయంగా తోస్తున్నది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర వరుస పరాజయాల తర్వాత బిజెపిని ఎలాగైనా రాష్ట్రం నుంచి తరిమికొట్టకపోతే రెండు పార్టీల ఉనికికే ప్రమాదం వస్తుందని, అందులో భాగంగానే ఒబిసిల్లోని నాన్ యాదవ కులాలన్నింటిని ఒక్కతాటిపై నడపాలంటే ఎస్‌పి, బిఎస్‌పి కూట మి కట్టక తప్పదని నిర్ణయానికి వచ్చి దాన్ని ఆచరణలో పెట్టాయి. వారి వ్యూహం ఇటీవల జరిగిన ఫూల్‌పూర్, గోరఖ్‌పూర్ ఉప ఎన్నికల్లో నిజంగానే ఫలించింది.
బిఎస్‌పికి అండగా ఉంటూ వస్తున్న దళితులు, యాదవ్‌లు, నాన్ యాదవ్‌లు అంతా ‘సామాజిక సమన్వయం’తో నడిచి బిజెపి అభ్యర్థులకు పరాజయాన్ని మూటగట్టి పెట్టారు. ఈ ఓటమి భారంతో రగిలిపోత్నున బిజెపి ముల్లును ముల్లుతోనే తీయాలన్నంటుగా కుల వ్యూహానికి పదును పెట్టింది. అయితే దానికి కులాలను విభజించి లబ్ధి పొందే పంథాను ఎంచుకున్నట్టు స్పష్టమవుతోంది. దీని ద్వారా తర్వాత వచ్చే ఎన్నికల్లో విజయం వంతు తమదే అవుతుందని రాజ్‌భర్ పేర్కొంటున్నారు. మొన్నటి వరకు ఈ కులాలన్నింటిని ఎస్‌పి, బిఎస్‌పి, కాంగ్రెస్ పార్టీలు వారి సీట్ల కోసం ఇష్టారీతిన వాడుకున్నాయని ఆరోపించారు.