Friday, March 29, 2024

బాలల టీకాను ప్రోత్సహించాలి

- Advertisement -
- Advertisement -

Vaccination of children should be encouraged

రెండో విడత కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ‘ఒమిక్రాన్ వేరియంట్’ విజృంభిస్తున్న తరుణం లో చిన్నారుల ఆరోగ్యం ప్రశ్నార్ధకంగా మారింది. పద్దెనిమిదేళ్లలోపు పిల్లలను వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వాములను చేయకపోవడం తల్లిదండ్రులు, ప్రభుత్వ బాధ్యతారాహిత్యంగానే భావించాలి. పిల్లలకు కరోనా టీకా వేయించడం ప్రపంచ దేశాలకిప్పుడు సవాలుగా మారింది. టీకా వేయాలంటే తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరికాగా, వారిని వొప్పించడంలో ప్రభుత్వాలు ముందుకు రాలేకపోతున్నాయి. ఇప్పటికే వివిధ దేశాల్లో నిర్వహించిన సర్వేల ప్రకారం, అమెరికాలో 50 శాతం మంది పిల్లలకు టీకా ఇవ్వడానికి ఆసక్తి చూపగా, మిగిలినవారు సందిగ్ధత, నిరాసక్తత చూపిస్తున్నారు.

కెనడాలో 60, టర్కీలో 36 శాతం మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. మన దేశానికొస్తే, ఏయివ్‌‌సు సంస్థలు, చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి, ముంబైకి చెందిన క్రాంతి మెడికల్ కాలేజీలు సంయుక్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఆన్‌లైన్ సర్వేలు నిర్వహించాయి. పిల్లలకు కరోనా టీకా వేయించే విషయంపై 45.5 శాతం మంది సందిగ్ధతలో ఉన్నట్లు వెల్లడైంది. 21 శాతం మంది తమ పిల్లలకు టీకా వేయించడానికి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. కేవలం 33.5 శాతం మాత్రం టీకా వేయించడం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. వ్యాక్సిన్ల భద్రత, సామర్థ్యంపై 85 శాతం మందికి అవగాహన లేకపోవడం వల్లనే టీకా వేయించుకోవడానికి ముందుకు రావడంలేదని తెలుస్తోంది. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, రావా అన్న దానిపై 78 శాతం మందికి అవగాహన లేకపోవడం వల్ల టీకా పట్ల నిరాసక్తతను పెంచుకుంటున్నారు. కరోనా డోస్‌ల మీద అవగాహన లేకపోవడం, టీకాతో రిస్క్ ఉంటుందని భావించడంతో 65 శాతం మంది వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ సందేహాలు, భయాలు పోగొట్టి శాస్త్రీయమైన సమాచారాన్ని తల్లిదండ్రులకు అందజేయడంలో ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేయలేకపోవడంతో అత్యధికశాతం పిల్లలకు వ్యాక్సిన్ అందకుండా పోతున్నది.

ప్రపంచం నెత్తిన కొవిడ్ 19 వచ్చిపడ్డాక అది చిన్నారుల్లో భిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని గుర్తించడానికి నిపుణులకు ఎక్కువ సమయం పట్టలేదు. ఇన్‌ఫెక్షన్ సోకిన చిన్నారుల్లో 40 50 శాతం మందిలో దగ్గు, జర్వం వచ్చినట్లు అధ్యయనంలో తేలింది. పెద్దలతో పోలిస్తే వీరిలో వ్యాధి లక్షణాలు చాలా స్వల్పంగానే ఉన్నట్లు గుర్తించారు. చిన్నారుల్లో తీవ్రస్థాయి కొవిడ్‌కు ఆస్కారం చాలా తక్కువని సేకరించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరణాల ముప్పు కూడా అరుదేనని స్పష్టమైంది. అయితే కొద్ది మంది పిల్లలు తొలుత నామమాత్రపు లక్షణాలే కలిగి ఉన్నప్పటికీ నాలుగు వారాల తర్వాత ‘ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్’కు గురవుతున్నట్లు వైద్యులు గుర్తించారు. గత ఏడాది మే నెలలో 18 మంది చిన్నారుల్లో ‘హైపర్ ఇన్‌ఫ్లమేటరీ షాక్’ ఉత్పన్నమైందని, వీరిలో ఒకరు మరణించినట్లు తొలిసారిగా గమనించారు.

వాస్తవానికి ఈ చిన్నారుల్లో చాలా మందికి కరోనా పరీక్షలో ‘నెగెటివ్’ వచ్చింది. వారిలో కొవిడ్ సంబంధ యాంటీబాడీలు మాత్రం ఉన్నాయి. దీన్ని బట్టి గతంలో వారు కొవిడ్ బారినపడినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ)తో పాటు అమెరికా, బ్రిటన్‌లోని ఆరోగ్య సంస్థలు చిన్నారుల్లో కరోనాతో ముడిపడిన మల్టీసిస్టవ్‌ు ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోవ్‌ు (ఎంఐఎస్‌సి) సమస్యను విశ్లేషించారు. ఈ సమస్యకు నిర్దిష్ట చికిత్స ఏదీ లేనప్పటికీ, దీన్ని అదుపు చేయడానికి వైద్య నిపుణులు కొన్ని సూచనలు చేశారు. కొవిడ్ టీకా ద్వారా చిన్నారుల్లో ఈ ముప్పును తగ్గించుకోవచ్చని సూచించారు. కరోనా వచ్చి తగ్గినా, టీకా తీసుకున్నా గరిష్ఠంగా ఏడాది వరకు శరీరానికి రక్షణ ఉంటుంది. కొందరిలో వ్యాధి నిరోధకత తగ్గిన వెంటనే మరోసారి కరోనా దాడి చేసే అవకాశముంటుంది. పిల్లల విషయంలో ఇంకా టీకాలు అందుబాటులోకి రాలేదు. పలు దేశాల్లో జరుపుతున్న పరిశోధనలు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి.

చిన్నారులకు కొవిడ్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుండడంతో దేశ వ్యాప్తంగా ఉన్న 42 కోట్ల (18 ఏళ్లలోపు) పిల్లల ఆరోగ్యానికి భరోసా లభిస్తుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. వీరిలో రెండేళ్లలోపు పిల్లలు రెండు కోట్ల మంది ఉన్నారు. మన దేశంలో పిల్లల టీకాకు సంబంధించి రెండు కంపెనీ వ్యాక్సిన్‌లకు అత్యవసర అనుమతులు లభించాయి. వాటిలో భారత్ బయోటెక్‌కు సంబంధించిన కొవాగ్జిన్ కాగా, రెండోది జైడస్ క్యాడిలా వారి జైడస్. కొవాగ్జిన్ 218 వయసు వారికైతే, జైడస్ 12 18 ఏళ్ల వారి కోసం తయారు చేస్తున్నారు. 28 రోజుల వ్యవధిలో కొవాగ్జిన్ రెండు డోసులు వేయవచ్చు. జైడస్ మాత్రం ప్రతి 30 రోజులకోమారు మూడు డోసులు తీసుకోవలసి ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా సీరం ఇన్‌స్టిట్యూట్ వారి కొవావాక్స్ కూడా క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది.

దీన్ని 711 ఏళ్ల పిల్లల కోసం తయారు చేస్తున్నారు. ఇక బయోలాజికల్ ఈ సంస్థ ఐదేళ్ల పైబడిన వారి కోసం టీకాను తయారీకి సిద్ధంగా ఉన్నది. చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. అత్యుత్తమస్థాయి సలహా సంఘం త్వరలోనే సమావేశమై చిన్నారుల వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నది. వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు 2022 జనవరి, మిగిలిన చిన్నారులందరికీ మార్చి నుంచి వ్యాక్సిన్ ఇవ్వాలన్నది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది. ఇక ఇతర దేశాల విషయానికొస్తే, పైజర్ సంస్థ 5 11 ఏళ్ల చిన్నారులకు అందించేందుకు యూరోపియన్ యూనియన్ ఔషధ నియంత్రణ సంస్థ ‘యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ) అనుమతించింది. దీంతో ప్రాథమిక విద్యను అభ్యసించే లక్షల మంది చిన్నారులకు ఈ టీకా చేరువకానుంది. యూనియన్ సభ్య దేశాల్లో ఈ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయాలంటే యూరోపియన్ కమిషన్ కూడా ఆమోదముద్ర వేయవలసి ఉంటుంది. యూరప్ కేంద్రంగా మహమ్మారీ మళ్లీ విజృంభిస్తుండగా, కట్టడి చర్యలు చేపట్టకుంటే సుమారు 20 లక్షల మంది మృతి చెందే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. ఈ క్రమంలోనే చిన్నారులకు వ్యాక్సిన్ అందించేందుకు ఇఎంఎ ఆమోదం తెలపడం జరిగింది.

ఆస్ట్రియా సర్కారు అనుమతుల కోసం నిరీక్షించకుండానే, రాజధాని వియోన్నాలోని 511 ఏళ్ల చిన్నారులకు ఇప్పటికే టీకాను అందిస్తున్నది. అమెరికాలోని పిల్లలకు కొవాగ్జిన్ టీకా ఇచ్చేందుకు అత్యవసర వినియోగ అనుమతి (ఇయుఎ) కోరుతూ అమెరికాలోని భారత్ బయోటెక్ వ్యాపార భాగస్వామ్య సంస్థ అక్కుజెన్ ఇంక్ దరఖాస్తు చేసుకుంది. భారత్‌లో దాదాపు 526 మంది పిల్లలపై ఈ టీకా ఎలా పనిచేస్తుందనే విషయమై నిర్వహించిన 23 దశల క్లినికల్ పరీక్షల సమాచారం ఆధారంగా ఈ దరఖాస్తు చేసుకుంది. ఇవేకాకుండా పలు ఔషధ సంస్థలు టీకా తయారీలో ముమ్మరంగా కృషి చేస్తున్నాయి. వ్యాక్సినేషన్‌కు ఆయా దేశాల ప్రభుత్వాల అనుమతి రాగానే టీకాలు వేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ సిద్ధమయ్యాయి. ఈమేరకు ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ పిల్లలకు టీకాలు ఇప్పించేందుకు తల్లిదండ్రులను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

కోడం పవన్‌కుమార్- 9848992825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News