Home జాతీయ వార్తలు వివాహితకు ఒకే రోజు 511 సార్లు ఫోన్…

వివాహితకు ఒకే రోజు 511 సార్లు ఫోన్…

Harassment,అహ్మదాబాద్: వివాహితను ఓ ఆకతాయి పదేపదే ఫోన్ చేసి వేధింపులకు పాల్పడ్డాడు. ఒకే రోజులో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 511 సార్లు ఫోన్ చేశాడు. దాంతో బాధితురాలు భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుజరాత్ రాష్ట్రంలోని వడోదర పరధిలో గల తల్సాయికి చెందిన డిజె ఇటల్ పిళ్లైతో బాధిత వివాహితకు గతేడాది అక్టోబర్‌లో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో మీ పరిసరాల్లో ఏవైనా ఈవెంట్స్ ఉంటే చెప్పాలంటూ ఆమె నుంచి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఇక అప్పటి నుంచి వివాహితను వేధించడం మొదలెట్టాడు ఆ ఆకతాయి. అవసరం ఉన్న లేకున్న ప్రతిరోజు ఫోన్ చేసేవాడు. అతడి ఆగడాలు అంతటితో ఆగలేదు. ఆమె భర్త ఇంట్లో లేనప్పుడు కూడా వెళ్లేవాడు.

రోజురోజుకు అతని వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేక విషయం భర్తకు చెప్పింది. దీంతో ఈ నెల 12న దంపతులిద్దరూ పిళ్లైని కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. భార్యాభర్తలపై పిళ్లై దాడికి దిగడంతో పాటు ఈ విషయం ఎక్కడా చెప్పొద్దని, చెబితే చంపుతానని బెదిరించాడు. ఈ క్రమంలో ఈ నెల 23న పిళ్లై మళ్లీ రెచ్చిపోయాడు. ఆ ఒక్కరోజే ఆమెకు ఏకంగా 511సార్లు ఫోన్ చేశాడు. కానీ, వివాహిత మాత్రం ఒక్క కాల్‌కు కూడా సమాధానం ఇవ్వలేదు. దాంతో అతడి వేధింపులు తాళలేక ఆ తర్వాతి రోజు దంపతులిద్దరూ నేరుగా స్థానిక మకరపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పిళ్లైపై పోలీసులు లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేశారు. కాగా, ప్రస్తుతం పిళ్లై పరారీలో ఉండడంతో అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Vadodara DJ makes 511 calls to married woman in a day