Home ఆఫ్ బీట్ కమ్మనైన రుచికి @ వజ్ర

కమ్మనైన రుచికి @ వజ్ర

Food on Wheels: Vajra Tiffins in Karimnagarప్రభుత్వ ఉద్యోగం కోసం వారు ఎంతో శ్రమ పడుతున్నారు. ఉన్నత చదువులు చదువుకుంటూ సివిల్స్‌కి ప్రిపేర్ అవుతూ, కోచింగ్ సెంటర్‌లో చేరి ఉదయం సమయంలో చదువుకుంటున్నారు. ఇంట్లో వారికి అదనపు భారం కాకూడదని ఒకరిపై ఆధారపడకుండా వ్యక్తిగతంగా వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నారు. అంతే అనుకున్నదే తడవుగా సొంతంగా ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. కరీంనగర్‌లో హైదరాబాద్ రుచులను పరిచయం చేసి వినియోగదారులను ఆకర్షించారు. వారు కోరుకున్న విధంగానే ఉదయం సమయంలో చదువుకుంటూ సాయంత్రం సమయంలో టిఫిన్ సెంటర్‌ని కొనసాగిస్తున్నారు. మంచి ఆదాయం రావ డంతో మరో ఆరుగురికి ఉపాధి కూడా కల్పిస్తున్న  వజ్ర టిఫిన్ సెంటర్ వవస్థాపకులు మానస, శ్రీకాంత్‌లతో  యువ ముచ్చట్లు.  

పెళ్లిచూపులు సినిమాలో హీరోహీరోయిన్‌లు ఒక చిన్న ఫుడ్ ట్రక్ తయారు చేసి దాంట్లో కొన్ని వంటలను చేస్తూ, తర్వాతి కాలంలో కుటుంబసభ్యులు సైతం ఊహించని విధంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అచ్చం అలాంటి సన్నివేశమే జరిగింది హైదరాబాద్‌కి చెందిన మానస, శ్రీకాంత్ దంపతుల జీవితంలో. రామంతపూర్‌కి చెందిన మానస, శ్రీకాంత్‌లు ఇద్దరు చదువుకునే సమయం నుంచి మంచి స్నేహితులుగా ఉండేవారు. తర్వాత పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటున్నారు. మానస తల్లిదండ్రులు వ్యాపారవేత్తలు. మామ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. శ్రీకాంత్‌కు వజ్ర గార్మెంట్స్ కరీంనగర్‌లో ఉండేది.

పెళ్లి తరువాత కూడా శ్రీకాంత్ మానసతో కలిసి కరీంనగర్‌లో స్థిరపడ్డాడు. మానస హైదరాబాద్‌లో చదువుకునే సమయంలో రాత్రి పూట రోడ్డు పక్కల ఉండే బండిపై టిఫిన్ తినేవారు. అప్పుడు వారికి ఒక ఐడియా వచ్చింది. మనకు నచ్చిన టిఫిన్స్ హైదరాబాద్‌లో ఎక్కడైనా దొరుకుతాయి. కరీంనగర్‌లో కూడా మనం ఒక టిఫిన్ సెంటర్‌ని ఏర్పాటు చేసి, ఇక్కడి వారికి హైదరాబాద్ రుచులని పరిచయం చేద్దాం అని అనుకుని 2015లో చిన్నగా ఫుడ్ సెంటర్‌ను మొదలుపెట్టారు. అలా వారు మొదలు పెట్టిన టిఫిన్ సెంటర్ నేడు వందలాది మందికి నోరూరించే రుచికరమైన ఆహార పదార్థాల్ని అందిస్తోంది. హైదరాబాద్‌లో లభించే విభిన్న రకాల దోసెలు, ఇడ్లీలు సహా అన్ని రకాల అల్పాహారాల్ని కరీంనగర్ ప్రజలకు చేరువ చేస్తున్నారు. నోరూరించే రుచులతో ఆకట్టుకుంటున్నారు.

పి.జి, సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ: ఉదయం క్లాసులు, సాయంత్రం టిఫిన్ సెంటర్ ఇలా టైమ్ ని సరిగ్గా ఉపయోగించుకుంటే అద్భుతాలు చేయొచ్చని చెప్పడానికి వీరు ఒక మంచి ఉదాహరణ. మానస, శ్రీకాంత్‌లు ఎం.బి.ఏ పూర్తిచేశారు. మానస తమ్ముడు అజయ్ ఎం.కామ్ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి అమ్మచేసే వంటల రుచులు చూసి తాను కూడా రకరకాలైన రుచికరమైన వంటలను చేద్దాం అని ఒక చిన్న కోరిక ఉండేది మానసకు. అదే కోరిక నేడు కొండంత అండగా నిలిచి మార్కెట్లో ఒక బ్రాండ్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఫుడ్‌ట్రక్‌తో బిజినెస్ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఒక మార్గంగా నిలిచింది. మిగిలిన వాటికి డిమాండ్ తక్కువ, మార్కెటింగ్ స్ట్రాటజిస్ లాంటి చాలా ఇబ్బందులుంటాయి కాని ఫుడ్ విషయంలో మాత్రం వీటికి మినహాయింపు ఉంటుంది.

రుచికరమైన ఆరోగ్యకరమైన ఫుడ్ పెడితే చాలు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందుకే తక్కువ రిస్క్ ఉన్న టిఫిన్ సెంటర్ పై మొగ్గుచూపారు. కరీంనగర్ కమాన్ ప్రాంతంలో ఉన్న ఈ వజ్ర టిఫిన్స్ సాయంత్రం 5 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఉదయం ఐదు గంటలకు లేచి పిండి గ్రైండింగ్ పట్టడం, చట్నీ ప్రిపేర్ చెయ్యడం, కూరగాయలు తెచ్చుకోవడం మొదలైన ఏర్పాట్లు చేసుకుని క్లాసులకు వెళ్ళిపోతారు. పార్ట్ టైమ్ గా చేస్తున్నారు. ఏదో ఒకటి రెండు రకాల ఐటమ్స్ మాత్రమే ఉంటాయని అనుకోకండి. హైదరాబాద్‌లో దొరికే వెరైటీస్ తో పాటు 15 రకాల దోశలు, 7 రకాల ఇడ్లీలు, 7 రకాల బజ్జీలను రుచి చూపిస్తున్నారు. కరీంనగర్ అంతటా ఫేమస్ ఐన వజ్ర టిఫిన్స్‌లో పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే అమ్ముతారు. వజ్ర టిఫిన్స్ కు నాయకులు, అధికారుల దగ్గరి నుండి స్టూడెంట్స్ సామాన్యుల వరకూ అభిమానులున్నారు. అన్ని వర్గాలకు చెందిన అభిమానులుండడం వల్ల ఫుడ్ కాస్ట్ తక్కువగానే ఉంటుందని మనం భావించవచ్చు. ఇంకొకరి మీద ఆధారపడకూడదనే ఉద్దేశ్యంతో నడుస్తున్న ఈ ముగ్గురు మరో ఆరుగురికి కూడా ఉపాధినిస్తున్నారు.

ఒక వేళ ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే ఈ రంగంలోనే ముందుకు వెళ్తామం టున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి కొంత మందికి ఉపాధి కల్పిస్తామంటున్నారు. మొట్టమొదటిసారిగా వీరు మొదలు పెట్టినప్పుడు రూ.3000/ వచ్చాయి. దాంతో ఇప్పుడు ప్రతిరోజు రూ. 15,000 నుంచి రూ. 18,000 వరకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు మానస శ్రీకాంత్. అలాగే కరీంనగర్‌లో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వినాయక చవితి పండుగ సమయంలో వెయ్యి మందికి ఉచితంగా భోజనాలు పంపిణి చేస్తారు. జీవితంలో ఒక వయసు వచ్చిన తర్వాత ఒకరిపై ఒకరు ఆధారపడకుండా సొంత ఆలోచనలతో ఏదైనా ఒక వృత్తిని ఎన్నుకొని దాంట్లో విజయం సాధించడం ద్వారా సమాజంలో మీ కంటూ ఒక గుర్తింపు లభిస్తుందని చెబుతున్నారు వీరు.

– విష్ణు