Friday, April 26, 2024

వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాల్సిందే: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: సామాజికంగా ఎంతో వెనుకబడిన వాల్మీకి బోయలను ఎస్టి జాబితాలో చేర్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాల పట్ల మొదటి నుంచి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పక్షపాతం చూపుతూనే ఉందని ఆయన విమర్శించారు. వాల్మీకి బోయలను ఎస్టిలలో చేర్చాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ టిటిడి కళ్యాణ మండపం వద్ద చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి సందర్శించి వాల్మీకి నాయకుల దీక్షకు మద్దతు తెలిపి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.

వాల్మీకీ బోయలను ఎస్టిల్లో చేర్చే అంశం కేంద్రం పరిధిలోని అంశమని అయినప్పటికీ తెలంగాణ ఈ అంశానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని మంత్రి వెల్లడించారు. వాల్మీకి బోయల స్థితిగతులపై చెల్లప్ప కమిటీ వేయగా కమిటీ నివేదిక సైతం అందిందని తెలిపారు. వాల్మీకులను ఎస్టిల్లో చేర్చే అంశంపై మరోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని ఇప్పటికే సిఎం కెసిఆర్ ప్రకటించిన అంశాన్ని మంత్రి గుర్తు చేశారు. వాల్మీకీల కోసం హైదరాబాద్ లో ఆత్మగౌరవ భవనానికి ఎంతో విలువైన స్థలం నిధులను ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు కేవలం 100 గురుకులాలు ఉంటే ప్రస్తుతం 1000 గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. బడుగు బలహీన వర్గాల పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు.

దేశవ్యాప్తంగా వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించాలని, తెలంగాణ ఏర్పడిన తర్వాతే వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. రామాయణం రచించి ప్రపంచానికి రామరాజ్యం గురించి వెల్లడించిన వాల్మీకి మహర్షి జయంతిని దేశవ్యాప్తంగా కూడా అధికారికంగా నిర్వహించాలని మంత్రి డిమాండ్ చేశారు. ఒక కులవృత్తి అంటూ లేని వాల్మీకి బోయలకు ఏ రంగంలో ప్రావీణ్యం ఉంటే ఆ రంగంలో వారికి అండగా ఉండి అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వాల్మీకి బోయల సమస్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ తో మరోసారి వ్యక్తిగతంగా చర్చించి అన్ని సమస్యల పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు.

ఒబిసి మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయలేదని, ఒబిసిలకు కనీసం ఒక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయకుండా కేంద్రం అణగారిన వర్గాల పట్ల పూర్తి వివక్ష ప్రదర్శిస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ, బిసి జన గణన విషయంలో కేంద్రం తీరును ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. పైసా ఖర్చు లేని బిసి జనగణన విషయంలో కేంద్రం పూర్తిగా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తుందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ కెసి నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, కౌన్సిలర్ రామ్ లక్ష్మణ్, వాల్మీకి బోయ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News