Home తాజా వార్తలు వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలి : హరీశ్ రావు

వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలి : హరీశ్ రావు

Vanidevi Should Win By Huge Majority : Harish Raoరంగారెడ్డి : టిఆర్ఎస్ ఎంఎల్ సి అభ్యర్థి సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కోరారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నంలో జరిగిన టిఆర్‌ఎస్‌  కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. బిజెపి, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు ఓట్లేస్తే లాభం లేదని, వారు అధికారంలో లేరని, అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కే ఓటేస్తే పట్టభద్రులకు మేలు జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. సమైక్య పాలనలో తెలంగాణ పేరును ఉచ్ఛరించేందుకు కూడా బిజెపి, కాంగ్రెస్ నాయులకు ఇష్టపడలేదని, ఎన్నికల సమయంలోనే వారు తెలంగాణ పేరును ఉచ్ఛరించేవారని మంత్రి మండిపడ్డారు. 80 శాతం పోలింగ్ జరిగేలా టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చూడాలని ఆయన సూచించారు. కాంగ్రెస్, టిడిపి పాలనలో ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేదని, టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు తాగు నీరు నిరంతరం అందుతుందని, పెట్టుబడి కింద రైతులకు ఎకరానికి పది వేలు ఇస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణలో 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పట్టభద్రుల్లో చైతన్యం తెచ్చి, వాణీదేవి గెలిచేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన సూచించారు.