Home దునియా వెలగ…పోషకాల సమ్మేళనం

వెలగ…పోషకాల సమ్మేళనం

 

గణపతికి ప్రీతిపాత్రమైన వెలగపండులో ఔషధ గుణాలెన్నో ఉన్నాయి. వినాయక చవితి మొదలుకుని వేసవి వరకూ ఇవి వస్తూనే ఉంటాయి. మిగిలిన పండ్ల మాదిరిగా కాకుండా కొబ్బరికాయలా దీన్ని కూడా పగులకొట్టి తినాల్సిందే. 100 గ్రా. వెలగపండు గుజ్జు లో 140 క్యాలరీలు ఉంటాయి. 31 గ్రా. పిండిపదార్థాలూ, 2 గ్రా. ప్రొటీన్లు, బీటా కెరోటిన్, థైమీన్, రిబోఫ్లోవిన్, నియాసిస్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, ఆక్సాలిక్, మాలిక్, సిట్రిక్ అమ్లాలు సమృద్ధిగా ఉంటాయి.

పెరుగు పచ్చడి

కావాల్సినవి: పండిన వెలక్కాయ 1, పెరుగు ఒక కప్పు, ఎండు మిరప కాయలు 2, పచ్చి మిరపకాయలు సన్నగా తరిగినవి 3, మినప్పప్పు ఒకఒక స్పూన్, ఆవాలు అరస్పూన్, జీల కర్ర ఒక స్పూన్, నూనె ఒక స్పూన్, కరివేపాకు, కొత్తిమీర తరుగు కొంచెం, ఉప్పు తగినంత.
ఎలా చేసుకోవాలంటే…వెలక్కాయ గుజ్జును బాగా మెదిపి పెట్టుకోవాలి. ఈ గుజ్జుని చిలక్కొట్టిని పెరుగులో కలుపుకోవాలి. మూకుట్లో నూనె వేసి ఎండుమిర్చి, మినప్పప్పు ఆవాలు, జీలకర్ర వేయించి కరివేపాకు కూడా వేయాలి. గుజ్జు కలిపిన పెరుగులో వేయించిన పోపు పచ్చిమిరపకాయల తరుగు వేసుకోవాలి. పచ్చడి పులుపు చూసుకుని తగినంత ఉప్పు వేసుకుంటే పెరుగు పచ్చడి సిద్ధం.

పచ్చడి

కావాల్సిన పదార్థాలు: వెలగపండు గుజ్జు – 200 గ్రా., చింతపండు – రెండు రెబ్బలు, ఉప్పు – రుచికి తగినంత, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు – తాలింపుకు తగినంత, పచ్చిమిర్చి – 3, నూనె / నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం: వెలగపండు గుజ్జులో చింతపండు, ఉప్పు కలిపి (నీరు చల్లకుండా) పేస్టు చేసుకోవాలి. తర్వాత నెయ్యిలో ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, పచ్చిమిర్చి తాలింపు వేసి, వెలగ మిశ్రమంలో కలపాలి. అతి సులభంగా తయారయ్యే ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకుంటే కమ్మగా ఉంటుంది.

పులిహోర

కావాల్సినవి: వెలక్కాయ గుజ్జు ఒక కప్పు, ఎండుమిర్చి ఐదు, ఆవాలు రెండు చెంచాలు, పుట్నాల పప్పు కప్పు, వేరుసెనగపప్పు కప్పు, మినపప్పు రెండు చెంచాలు, కొబ్బరి కోరు ఐదు చెంచాలు, పచ్చిమిర్చి ఐదు, నూనె అరకప్పు, ఇంగువ చెంచా, బియ్యం మూడు కప్పులు, ఉప్పు రుచికి తగినంత, పసుపు కొద్దిగా, కరివేపాకు రెమ్మలు రెండు.
తయారీ: ముందుగా బాణలిలో నూనె వేడిచేసి తాలింపు దినుసులు వేయించుకోవాలి. ఇందులో వెలక్కాయ గుజ్జును కలిపి ఐదు నిమిషాలు వేయించి పొయ్యి కట్టేయ్యాలి. బియ్యం కడిగి అందులో ఉప్పు,పసుపు వేసి ఐదు కప్పుల నీళ్లు చేర్చి పొడిపొడిగా అన్నం వండుకోవాలి. చల్లారిన అన్నంలో ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపు మిశ్రమాన్ని కలపాలి. పసందైన పులిహోర రెడీ.