Thursday, April 25, 2024

ఎన్టీఆర్ బోళా మనిషి: వెంకయ్య నాయుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతాన్ని నమ్మి పని చేసిన ఎన్టీఆర్ రాజకీయాల్లో బోళా మనిషి అని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. అందరిని నమ్మేవారని, అందుకే ఎన్టీఆర్ వెన్నుపోటుకు గురయ్యారని ఆయన చెప్పారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌కు చాతుర్యం ఉందని తాను చెప్పలేనని, అయితే కుట్రలు, కుతంత్రాలను ఎన్టీఆర్ గమనించలేకపోయారని అన్నారు. శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు మురళీమోహన్, సీనియర్ నటి జయచిత్రకు ఎన్టీఆర్ అవార్డులను అందజేశారు.

అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోను పెను విప్లవం సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. అటు సినీరంగంలోనూ, రాజకీయ రంగంలో ఎన్టీఆర్‌కు ఎవ్వరూ సాటిలేరన్నారు. రాజకీయాల్లో నిశబ్ధ విప్లవాన్ని తీసుకొచ్చిన మహావ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు, మహిళలకు రాజకీయాల్లో పెద్దపీట వేశారన్నారు. ఎన్టీఆర్ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చారని, అవి సరిగా అమలవుతున్నాయో లేదో స్వయంగా ఆయనే తెలుసుకునేవారని చెప్పారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వం చూసి రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయనను గౌరవించేవారని అన్నారు.

ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ నాయకుడైనా ధృడమైన జాతీయవాది అని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని జాతీయవాదంతో సమ్మిళితం చేశారన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమార్తె లోకేశ్వరి, కుమారుడు రామకృష్ణ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధా రాణి, టిడిపి సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్, నక్కా ఆనంద్ బాబు, నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలను వదిలిపెట్టా..
తాను ఉపరాష్ట్రపతి అయ్యాక రాజకీయాలు వదిలిపెట్టాని వెంకయ్యనాయుడు తెలిపారు. అయితే ప్రజలను కలవడం మాత్రం మానుకోలేదని చెప్పారు. ప్రకృతితో కలిసి జీవించాలని అన్నారు. పచ్చదనం మనిషికి ప్రశాంతతను ఇస్తుందన్నారు. ఎన్టీఆర్ శతదినోత్సవంలో భాగంగా రచయిత సురేష్ రాసిన మహాత్మగాంధీ పుస్తకాన్ని జస్టిర్ రాధారాణితో కలిసి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహాత్మగాంధీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని వెంకయ్య అన్నారు. గాంధీ జీవితం గురించి నేటి తరం తెలుసుకోవల్సిన అవసరం ఉందన్నారు.

మనం పాటించే పద్దతులే నాగరికతకు, నడవడికకు చిహ్నం అని అన్నారు. గాంధీ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా కాకుండా ఆయన ఆలోచనలు అందరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. మహానుభావులు చూపించిన మార్గంలో నడవాలన్నారు. సెల్‌ఫోన్లు ఎక్కువగా వాడితే హెల్ ఫోన్లు అవుతాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News