Home జాతీయ వార్తలు చిన్న వ్యాపారుల వల్లే అధిక ఉపాధి

చిన్న వ్యాపారుల వల్లే అధిక ఉపాధి

ముద్ర యోజన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు
VENKAIAHమన తెలంగాణ / హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ కలల పథకమైన‘ ప్రధాన మంత్రి ముద్ర యోజన’ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పేద వర్గాలకు బ్యాంకులు రుణ సౌకర్యం కల్పించాల్సిందే నని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ప్రకటించారు. శుక్రవారం నగరంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ఆయన రాష్ట్రంలో తొలిసారిగా ‘ప్రధాన మంత్రి ముద్ర యోజన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పలువురికి రుణ పత్రాలు అందించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మ శతాబ్ది ఉత్సవాల రోజైన సెప్టెంబర్ 25 నుంచి మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ క్యాంపెన్‌లో అనుకున్న మేర లక్ష్యాన్ని పూర్తి చేయాలని, నెల రోజుల్లో తిరిగి వచ్చి సమీక్షిస్తానని తెలిపారు. సమావేశానికి ఎస్‌బిహెచ్ ఎండి శాంతను ముఖర్జీ అధ్యక్షత వహించారు. ఇప్పటి వరకు చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సరైన రుణ సదుపాయం అందక ప్రైవేటు వ్యక్తులు, సంస్థల వద్ద అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటున్న పేదవర్గాలోని వ్యాపారులకు రుణాలు అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ పథకానికి ప్రధాని అంకురార్పణ చేశారన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద పరిశ్రమల ద్వారా 1.25 కోట్ల మంది మాత్రమే ఉపాధి పొందగలుగుతున్నారని అదే చిన్న చిన్న పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, ఇడ్లీ బండ్లు, కూరగాయల వ్యాపారులు లాంటి వారివద్ద 12 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో లేవని ప్రభుత్వాలు అందిస్తున్న రుణ సౌకర్యాల ద్వారా తమ కాళ్లపై తాము నిలబడే విధంగా వ్యాపారాలు లేదా ఇతరత్రా స్వయం ఉపాధి పథకాలు ఎంచుకోవాలని వెంకయ్య యువజనులకు సూచించారు. ఈ పథక అమలుపై ప్రధాని పట్టుదలతో ఉన్నారని దీన్ని బ్యాంకర్లు సఫలీకృతం చేయాలని కోరారు. గతంలో ఏర్పాటు చేసిన రుణ మేళా కార్యక్రమాల్లో రాజకీయ నాయకుల ఒత్తిడి పెరగడం మూలంగా చిన్న వ్యాపారులకు, సంస్థలకు రుణ సౌకర్యం అందకుండా పోయిందన్నారు. చిన్న వ్యాపారులకు రుణాలు ఇస్తే తిరిగి చెల్లించరన్న అపవాదు ఉందని, నిజానికి బ్యాంకులకు ఎగనామం పెడుతున్న వారంతా బడా పారిశ్రామిక వేత్తలేనని చెప్పారు. డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలు పొందుతున్న రుణాలు నూటికి 98 శాతం చెల్లిస్తున్నారని తెలిపారు. బ్యాంకుల్లో ఉన్నది ప్రజల సొమ్మని అది వారికే రుణంగా ఇచ్చి తిరిగి వసూలు చేసుకోవడం ద్వారా పేద ప్రజానీకానికి అండగా ఉండడమే కాకుండా బ్యాంకులు దివాలా తీసే స్థితి రాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ బ్యాంకులకు చెందిన 4645 బ్రాంచీలు ఉన్నాయని ప్రతి ఒక్క శాఖ లక్ష చిరువ్యాపార యూనిట్లకు రుణ సదుపాయం కల్పించాలని వెంకయ్య కోరారు. ఇప్పటికే కేంద్రం ఈ పథకానికి బడ్జెట్‌లో 20 వేల కోట్లు సమకూర్చిందని చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ పథకానికి మరో 3 వేల కోట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారని తెలిపారు. బ్యాంకర్లు తమ విధిగా భావించి రుణాలు అందజేయాలని కోరారు. ప్రస్తుతం కిందిస్థాయి నుంచి పైకి ఎదిగేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తున్నదన్నారు. ఈ క్రమం తప్పడం వల్లే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 60 సంవత్సరాలు పైబడినా పేదరికం తగ్గలేదన్నారు. దేశం అభివృద్ధి దిశలో ముందుకు సాగుతున్నదని మరో రెండు మూడు సంవత్సరాల్లో చైనా కంటే భారత్ ముందు వరుసలో ఉండబోతున్నదన్నారు. ఫైవ్ స్టార్ హోటళ్లు, పెరుగుతున్న కార్లు అభివృద్ధికి సంకేతం కాదని పేదలు ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లని అన్నారు. పేద ప్రజలకు మేలు చేసేందుకే మోడీ దేవదూతలా వచ్చాడని పలువురు భావిస్తున్నారని వెంకయ్య అన్నారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రసంగిస్తూ పేదలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందాలన్నారు. కార్యక్రమంలో ఎంపి మల్లారెడ్డి, బిజెపి శాసనసభ్యులు జి. కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్ రావు, బ్యాంకు అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉదయం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాల్లో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి అభివృద్ధిపై ప్రసంగించారు. మంత్రి వెంకయ్య మాట్లాడుతూ దీనదయాళ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.