Home తాజా వార్తలు ఆ దర్శకుడితో ‘అసురన్’ రీమేక్

ఆ దర్శకుడితో ‘అసురన్’ రీమేక్

Venkatesh

 

‘ఎఫ్ 2’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్ తన తరువాత సినిమాలను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. కాగా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ సినిమాను ఈ సీనియర్ స్టార్ తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన ‘అసురన్’ సినిమాకు దర్శకుడిగా కొంతమంది పేర్లను పరిశీలించినా చివరికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా తమిళనాట సంచలన విజయం సాధించింది.

ఈ మధ్యకాలంలో కేవలం కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తున్న హీరో వెంకటేష్‌కి ఈ ‘అసురన్’ బాగా సెట్ అవుతుంది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనుంది. ఇక వెంకటేష్ ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది.

Venkatesh in Asuran remake