Home జాతీయ వార్తలు ప్రత్యేక సమర్థుల దినోత్సవం

ప్రత్యేక సమర్థుల దినోత్సవం

World Disability Day

 

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పేరు మార్చాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య సూచన
మండి హౌస్ వద్ద దివ్యాంగుల నిరసన

న్యూఢిల్లీ: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ‘అంతర్జాతీయ ప్రత్యేక సమర్థుల దినోత్సవం’గా మార్చాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు మంగళవారం సూచించారు. వారు సమాజానికి అపారమైన సేవలందించారని, తమ లక్ష్యాల సాధనలో వారిని ఏ శక్తీ ఆపలేదని కొనియాడారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా…అసాధారణ విజయాలు సాధించిన అంగవికలురు, అలాంటివారికి సాధికారికత కల్పించే దిశగా జరిగిన కృషికి ఇచ్చే జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్య చేశారు.

తన సూచనను పరిశీలించవలసిందిగా వెంకయ్యనాయుడు భారతదేశం, ప్రపంచ ప్రజల్ని కోరారు. ప్రత్యే సమర్థతలున్న వారు ఇతరులకు ఆదర్శంగా నిలిచారని, తాము ఎవరికీ తీసిపోమని నిరూపించుకున్నారని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ‘మన మధ్యలోనే ప్రత్యేక ప్రావీణ్యాలున్న, ఎన్నదగిన ప్రతిభ ఉన్న దివ్యాంగులైన పురుషులు, మహిళలు ఎందరో ఉన్నారు. వివిధరంగాల్లో వారు నైపుణ్యాలను ప్రదర్శించిన వారున్నారు. సరైన వాతావరణం, ప్రోత్సాహం, అవకాశం ఉంటే వారు జాతి నిర్మాణానికి అద్భుతాలు చేయగలరు’ అని ప్రస్తుతించారు. అవార్డులందుకున్న ధైర్య సాహసాల్ని వెంకయ్యనాయుడు మెచ్చుకున్నారు.

ప్రమాదాలు తగ్గాలి
రోడ్డు ప్రమాదాలవల్ల చాలామంది అంగవికలురవుతున్నారని, 1990తో పోలిస్తే 2016 నాటికి రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి సంఖ్య 65 శాతానికి పెరిగిందని వెంకయ్యనాయుడు అన్నారు. రోడ్ల పరిస్థితి మెరుగుపడాలని, పనిచేసే చోట భద్రత ఉండాలని సూచించారు. భారతదేశంలో అధిక సంఖ్యలో అంగవికలురు ఉన్నారని చెబుతూ ఉపరాష్ట్రపతి 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో 2.68కోట్లు అంటే 2.21శాతం మంది దివ్యాం గులున్నారన్నారని, వారు తీవ్రమైన సామాజిక, ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారితో కలిపితే వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని ఉపరాష్ట్రపతి తెలిపారు.

మండి హౌస్ వద్ద దివ్యాంగుల నిరసన
భారత రైల్వేలు తమ డిమాండ్లను తిరస్కరించిన కొన్ని రోజుల తర్వాత కొం దరు దివ్యాంగులు రైల్వేలో తమకు ఉద్యోగాలు కావాలని కోరుతూ ఢిల్లీలో మండి హౌస్ వద్ద నిరసన ప్రదర్శన జరిపారు. రద్దీవేళలో వారు జరిపిన ఆం దోళన వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. నిబంధనల ప్రకారం నియామక ప్రక్రియలో దివ్యాంగులకు ఉన్న అన్ని అవకాశాల్ని రైల్వేలు అమలు చేశాయని, మండి హౌస్ దగ్గర ఆందోళనకు దిగిన అంగవికలురకు ఉద్యోగాలు కల్పించే అవకాశాల్ని పరిశీలిస్తున్నామని రైల్వేలు చెప్పాయి. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం దివ్యాంగులకున్న నాలుగు కేటగిరీలలో ఒక్కొక్క కేటగిరీలో 1% రిజర్వేషన్ ఉందని రైల్వే అధికారులు తెలిపారు.

Venkayya suggested renaming World Disability Day