Home దునియా ఊరి కతలు ఎన్ని చెప్పినా ఒడవని ముచ్చట్లు

ఊరి కతలు ఎన్ని చెప్పినా ఒడవని ముచ్చట్లు

Old-Man

ఊరి కతలు ఎన్ని చెప్పినా అవ్వి ఇగ అయిపోతయి ఇగ లెవ్వు అనే ముచ్చటే లేదు. ఊరిల పుట్టి పట్నలల్ల ఉంటున్న మనసు ఊర్లెకే ఇగ్గుతది. ఊరంటే పచ్చని చెట్లు ఊరంటే స్వచ్ఛమైన మనుషులు (ఇప్పుడు పురాగ మారిపోయిండ్రు లేదనుకో) ఊరంటె గొడ్డు గోదా కోడి మ్యాక కొంగలు ఊరవిష్కలు పిల్లబాటలు ఇట్లా అందరి మదిల మెదలుతయి. ఇప్పటికి ఊరుమీద వంద వారాలుగా రాస్తున్నా, ఇంకా మల్లో వారంకు ఏం రాయాలనే మనుసుల పురుగుమెసులుతది. అట్లనే నడుస్తంది.

చిన్నతనాన సదువుకున్న బడులు బడిదోస్తులు పంతుల్లు, మల్లా ఎప్పుడైనా పండుగలకు పోవుడు అందరిని కల్సి ముచ్చట్లు పెట్టుకునుడు అదా గమ్మతి. సద్దుల బతుకమ్మ పండుక్కు ఎక్కడెక్కడో ఉన్నవాల్లు అంత ఊల్లెకు వస్తరు వాల్లను సూస్తే గమ్మతి అనిపిస్తది. ఎన్కట సూసినప్పుడు ఇప్పటికి వాల్లకు బట్టగుండు అవుడు. బొర్రలు పెరుగుడు లేకుంటే బక్కపడుడు పురాగ ఏర్పడి ఏర్పడనట్టు ఉండుట కన్పిస్తది. కొందరు ఈ కాలంల సూసి సూడనట్టు నటిచ్చుడు కూడా నేరుస్తరు. రాను రాను కొందరు ఊరు ఇడిశి పెట్టి పురాగ పోతరు పట్నంలనే బిడ్డలు కొడుకులు లేదంటే అమ్రికపోవుడు ఇగ అటే అయితరు. సద్దుల బతుకమ్మ కాకుంటే ఈ సందుల బోనాలు అందరిని కలుపుతన్నయి. తెలంగాణ సాంస్కృతిక పనర్‌వైభవం వల్ల ఎనుకట మాములుగా ఉన్న బోనాలు ఇప్పుడు ఊరూరు మంచిగ జరుపుకుంటున్నరు.

బోనాలకు అందరు కల్సుకునే సందర్భం వస్తంది. ఇగబోతె పెండ్లిల్లు కూడా కల్సుకోవచ్చుగని అవి కూడా మల్ల దగ్గరి పట్నంల అయితన్నయి. ఫంక్షన్‌హాల్లల అయితన్నాయి. తినే టైంకు వచ్చి లైన్ కట్టి అక్షింతలు ఏసి అన్నంకాడ లైన్ కట్టి తినిపోయే సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. అయితె ఇన్నేండ్లుగ ఉన్న ఊరు. ఊరి తాత్వికత ఇప్పుడు లేకపోవచ్చు ఊర్లలోకి ఇప్పుడు బ్రాండీ సీసాలు డాంబర్ రోడ్లు మోటార్‌సైకిల్లు ‘థమ్స్ అప్ బాటిల్లు కుర్‌కురేలు గుట్కలు ఇసొంటివి చేరినయి. వీటికి తోడు రాజకీయ పార్టీల గుంపులు మనుషులు చేరిండ్రు ఎవలు ఎవల పార్టీ ఎవలు ఎవలకు ఓటు ఏసిండు అనే ఆరాలలో మనిషిని వేరు చేస్తున్నరు.

ఊరు మనుషులపరంగా, పార్టీలపరంగా, కులాలపరంగా గోడల నిర్మాణం అయితన్నయి. ఇదివరకు కులాలు ఉండే మతాలు ఉండే గాని ఇప్పటివి వేరు అప్పటివి వేరువేరు. అట్లనే ఊర్లల్ల భూములకు రేట్లు పెరిగినయి. దాంతో బ్రోకర్లు పుట్టుకచ్చిండ్రు, దళార్లు పాతభూముల కొన్నవాటిని తిరిగి ముందుకు తెచ్చుడు గెట్ల పంచాయితీలు తాగిపిచ్చుడు తినిపిచ్చుడు పెద్ద మనుషులను మలుపుకునుడు ఇలాంటి జరుగుతున్నయి. ఊరు ఒక్క కట్ట మీద లేకుండా పది తీర్ల ఆలోచనలకు తావు ఇస్తంది. అంటే ఒక్క కట్టు మీద ఉండాలని ఏం లేదు. ఎన్కట ఒక్క కట్టు మీద అంటే ఊరి పెద్ద చెప్పినట్టు ఇనుడు ఉండేది.

అందులో ప్యూడిలజపు వాసన ఉండేది. ఇప్పుడంతా ఆధునిక ప్రజాస్వామిక యుగంలో ఉన్నాం కాని ఊరంటే ఇదొక తృప్తి. అయితె ఊర్లల్ల ఇదివరలా పంతుల్లు అంటే టీచర్ల పాత్ర అధికంగా ఉండేది. ఇప్పుడు అంతగా కన్పిస్తలేదు ఇదివరకు ఊర్లల్ల నవలల చదివేవాల్లు పుస్తకాలు చదివేల్లు లైబ్రరీల సభ్యులైనవాల్లు ఉండేది ఇప్పుడు చదవడం ఆగిపోయింది. ఆ పని టెలివిజన్ చేసింది టివీల సుట్టు తలకాయలు కండ్లు అతుక్కపోయి ఆడోల్లను మొగోల్లను వికాసం లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు ఊరుకు పట్నం బీమారి అంటుకుంటుదనిపిస్తంది. ఎంతైనా ఊరు ఊరే పట్నం పట్నమే ఊరుముచ్చట్లు ఎంత రాసినా ఒడవయి.

-అన్నవరం దేవేందర్, సెల్ :9440763479