Home జాతీయ వార్తలు అణగారిన వర్గాలకు న్యాయపరమైన సహాయం చేయాలి : వెంకయ్య

అణగారిన వర్గాలకు న్యాయపరమైన సహాయం చేయాలి : వెంకయ్య

Vice President Venkaiah Comments On Courtsఢిల్లీ : సమాజంలోని అణగారిన వర్గాలకు న్యాయపరమైన సహాయం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యాయవాదులను కోరారు. అన్ని స్థాయిల కోర్టుల్లో పెరిగిపోతున్న కేసులపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. అన్నిస్థాయి కోర్టుల్లో మూడు కోట్లకు పైగా కేసులు అపరిష్కృతంగా ఉండడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో కీలక కేసుల్లో తీర్పులు ఆలస్యమవుతున్నాయని, దీంతో సామాన్యులకు న్యాయమనేది ఖరీదైనదిగా మారిందని ఆయన తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ లాకాలేజీ (ఆంధ్ర యూనివర్సిటీ) 76వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన వెబినార్‌లో వెంకయ్య మాట్లాడారు. ‘జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్’ అన్న మాటను ఆయన గుర్తు చేసతూ, కొన్ని సందర్భాల్లో అనవసరంగా కేసులను పొడగించడం, వాయిదా వేయడం జరుగుతోందని, దీనిపై న్యాయవాదులు ఆలోచించాలని ఆయన స్పష్టం చేశారు. క్లిష్టమైన చట్టాలను సులభతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తేల్చి చెప్పారు. వినియోగంలో లేని 1600 చట్టాలను కేంద్రం రద్దు చేసిందన్నారు. నైతిక ప్రవర్తనతో ఉంటూ భయం లేకుండా విధులు నిర్వర్తించాలని ఆయన న్యాయవాదులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ టీ రజని, జస్టిస్ బట్టు దేవానంద్, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్  ప్రసాద్ రెడ్డి, న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ సుమిత్ర, న్యాయ విభాగం డీన్ ప్రొఫెసర్ డీఎస్ ప్రకాశ్ రావు, అంబేడ్కర్ లా కాలేజీ వ్యవస్థాపక ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే గుప్తేశ్వర్, ఖతార్ ప్రభుత్వ అటార్నీ జనరల్ కార్యాలయ ప్రత్యేక సలహాదారు డాక్టర్ పిఎస్ రావుతోపాటు తదితరులు పాల్గొన్నారు.