Home తాజా వార్తలు టైమ్ వస్తుంది… కానీ ఇప్పుడే కాదు

టైమ్ వస్తుంది… కానీ ఇప్పుడే కాదు

Vijay Deverakonda

 

గత కొంతకాలంగా యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ బాలీవుడ్‌కు వెళ్తున్నారని ప్రచారం సాగుతోంది. అందుకోసం ముంబయ్‌లో సీరియస్‌గా చర్చలు సాగిస్తున్నారని ప్రచారమవుతోంది. టాలీవుడ్‌తో పాటు ఇరుగు పొరుగు భాషల్లో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్న విజయ్ దేవరకొండ ముందుగా తమిళ్, కన్నడ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ తర్వాత హిందీ మార్కెట్ పైనా కన్నేశారు. అన్ని పరిశ్రమలకు సుపరిచితుడైన స్టార్‌గా తన మార్కెట్ రేంజ్‌ను పెంచాలనుకుంటున్నారని ప్రచారమవుతోంది. ప్రస్తుతం తెలుగు సినిమాల కంటే హిందీ సినిమాల గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారని అంటున్నారు. అయితే ఇది నిజమా? అంటే… అబ్బే అలాంటిదేమీ లేదని విజయ్ దేవరకొండ సమాధానమివ్వడం ఆశ్చర్యపరుస్తోంది.

“హిందీ చిత్రసీమలో వెంటనే పెద్ద స్టార్ అయిపోవాలని భావించడం లేదు.. ఇప్పుడే కంగారు పడేదేం లేదు” అంటూ ఓ ఇంటర్వ్యూలో ఈ యంగ్ స్టార్ క్లారిటీనిచ్చారు. “మీకు ఎంత ఆసక్తి ఉందో నాకు కూడా అంతే ఆసక్తి ఉంది. టైమ్ వస్తుంది… కానీ ఇప్పుడే కాదు” అని స్పష్టం చేశారు. ఇక విజయ్ నటించాలే కానీ ఇప్పటికిప్పుడు బాలీవుడ్‌లో ముగ్గురు బిగ్ ఫిల్మ్‌మేకర్స్ అతని కోసం ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజాలు కరణ్ జోహార్, సాజిద్ నడియావాలా, సిద్ధార్థ్‌రాయ్ కపూర్ ఈ యంగ్‌స్టార్ ఓకే అంటే సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

అయితే దేవరకొండకు సరిపడే కథ కోసం వేచి చూస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. మరి తాజాగా ఈ యంగ్‌స్టార్ చెప్పిన దానిని బట్టి ఇప్పుడే బాలీవుడ్ ఎంట్రీ లేదని అర్థమవుతోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో ‘హీరో’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు.

Vijay Deverakonda is going to Bollywood