Home తాజా వార్తలు విజయ డెయిరీలో అక్రమాలు!

విజయ డెయిరీలో అక్రమాలు!

Vijaya Milk సొమ్ముల చెల్లింపుల్లో చేతివాటం
ప్రభుత్వం దృష్టికి ఉద్యోగుల అవినీతి
వరంగల్‌లో రూ.46 లక్షలు, నిజామాబాద్‌లో రూ. 26లక్షలు స్వాహా

మన తెలంగాణ/హైదరాబాద్: విజయ డెయిరీని లాభాల బాట పట్టించాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతూ నష్టాలు తెస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన, పాలు విక్రయించగా వచ్చే మొత్తాన్ని విజయ డెయిరీ అధికారులే మాయం చేసి జేబులు నింపుకున్నారు. గత రెండేళ్లుగా వరంగల్ జిల్లాలో రూ. 46 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో రూ. 26 లక్షలు స్వాహా చేసినట్లు ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీల్లో తేలింది. ఇదిలా ఉంటే నల్లగొండ జిల్లా ఇందుగులలోని విజయ బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ ప్లాంట్‌ను ఓ ప్రైవేటు వ్యక్తి మిర్యాలగూడకు తరలించకుపోయారు. రైతుల నుంచి పాలు కొనకుండా అతనే పాలు సరఫరా చేస్తూ, బోగస్ పేర్లతో బిల్లులను నొక్కేసినట్లు గుర్తించారు.

రెండున్నరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడిపించడానికి జిల్లా అధికారులు అతనికి సహకరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. జిల్లాల్లో ఎన్ని పాలు విక్రయిస్తున్నాం….వాటిపై ఎంత ఆదాయం వస్తుందనే అంశంపై అన్ని జిల్లాల అకౌంటింగ్ అధికారులతో డెయిరీ ఎం.డి శ్రీనివాస్‌రావు ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని జిల్లాల్లో అకౌంట్లలో తేడాలున్నట్లు గుర్తించి….ప్రత్యేక బృందాలతో అకస్మిక తనిఖీలు చేయించారు. రెండు జిల్లాల్లో రూ. 72 లక్షల మేర డెయిరీకి రావాల్సిన సొమ్మును స్థానిక అధికారులు జేబుల్లో వేసుకున్నట్లు గుర్తించారు.

నల్లగొండ జిల్లాలో స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురు అధికారుల బృందాన్ని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపించారు. ప్లాంటును తరలించడంతో పాటు, బోగస్ పేర్లతో పాలు సరఫరా చేస్తూ బిల్లులను నొక్కేస్తున్నట్లు గుర్తించి ..ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. మిర్యాలగూడలో ప్రైవేటు వ్యక్తి ఆధీనంలో ఉన్న 2 వేల లీటర్లు, 3 వేల లీటర్లు, ఐదు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన డెయిరీ మిషనరీని స్వాధీనం చేసుకునేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడి నుంచి వచ్చే పాలను గురువారం నుంచి నిలిపివేశారు. సదరు వ్యక్తికి చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేయనున్నారు. ఇందుగులలో ప్లాంట్ తరలింపు సమయంలో డిడిగా పనిచేసిన అధికారిని, పాల సొమ్ము స్వాహా చేసిన రెండు జిల్లాల డిడిలను, ఇద్దరు మార్కెటింగ్ సూపరిండెంట్‌లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సంస్థ ఎం.డి శ్రీనివాసరావు సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు విజయ డెయిరీ ప్రధానకార్యాలయంలో అకౌంట్ విభాగంలోని డిడి, నల్లగొండ జిల్లాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న డిడిలపై బదిలీ వేటు పడింది.

అక్రమాలను సహించం

డెయిరీలో రూపాయి అవినీతి జరిగినా సహించేది లేదని విజయ డెయిరీ కార్పొరేషన్ ఎం.డి శ్రీనివాసరావులు తెలిపారు. వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో బాధ్యులైన అధికారుల నుంచి నెలరోజుల్లో సొమ్మును రీఫండ్ చేయిస్తామని చెప్పారు. లేని పక్షంలో క్రిమినల్ కేసులు పెడతామన్నారు. విజయ డెయిరీ ప్రతిష్టను దెబ్బతీసే ఏ చర్యనైనా ఉపేక్షించమని వారు హెచ్చరించారు.

Vijaya Milk Dairy Staff Illegal Activities