Home వార్తలు మన మాట మన ముచ్చట

మన మాట మన ముచ్చట

Villageపువ్వుపుట్టంగనే వాసన వచ్చినట్టు, మనిషి పుట్టి పెరుగుతాంటనే వాని గుణగుణాలు తెలుస్తనే ఉంటయి. ఊర్లర్ల మనుషులంత ఒక్కటే తీరుగ ఉంటరు కాబట్టి ఒగల మీద ఒగల ప్రేమ ఉంటది. అందర్ని అందరు పట్టిచ్చుకుంటరు. మంచి చేస్తే మంచి అంటరు, చెడ్డ పని చేస్తే కోప్పడుతరు. అట్లనే గుణాలను బట్టి ఆయా మనుషులకు రకరకాల పేర్లు పెడుతరు. ఇవి ఒక్కలు పెట్టినవి అని కాదు ఎట్లనో ఆ మనిషికి స్థిరపడిపోతది.
వాడు ఆయకొంచపువాడు అంటరు. అంటే కొంచపోడు అన్నట్టు ఉత్తగనే ఎల్తి పడుతడు అని. ఆయకొంచపుతనం అంటే అతికొంచెపుతనం అని అర్థం. మాటమాటకు ఎల్తిపడేటోన్ని ఆయకొంచపోడు అంటరు. వాడు నడమంత్రపోడు అంటరు. అంటే కొసెల్ల బతకడు అని అర్థంలో వాడుతరు ఏదై సాహసపు పనులు చేసేవాల్లు అని అర్థం. కోంటె పోరడు అంటే కొంటెమాటలు సరస సంబంధమైన మాటల పనుల పట్ల ఎక్కువ ఇంటరెస్ట్ ఉన్నాడని అర్థం. నల్లికుట్లోడు అంటే వాని మర్మం ఇంకొకనికి తెల్వది అన్నట్టు. ఎవ్వనితోని మాట్లాడడు , మనుసుల మాట బయటపెట్టడు కాని చేసే పని చేస్తడు. ఊకే ఏదో ఒకటి ఒర్లడు అన్నట్టు. అట్లనే ఇదే గుణం తీవ్రంగా ఉన్నవాల్లని న్యాలముచ్చుగాల్లు అంటరు. పాయదేర్లోడు అంటే వివక్ష చూపేట్టేవాడు అని అర్థం ఇద్దరికి సమానం అనకుండా తనకు నచ్చినవాల్లకు ఎక్కువ, ఇంకొకరికి తక్కువ ఇచ్చేవాడు అట్లా మాట్లాడే వాల్లను పాయదేర్లతనం అంటరు.
మాడ్ప్పు మొకంవాడు అంటే ఎప్పుడు మొకం నవ్వకుంట ఏదో కోల్పోయినట్టు ఏమో ఎత్తుకపోయినట్లు ఉండేవాల్లు ఉండేరు. వాల్లను మాడ్పు మొకల లేదా మాడ్పు మొకంది అని అంటరు. వీల్లనే నిద్ర మొకం అని కూడా అంటారు. ఎప్పుడు ‘డిమ్’గా ఉండేవాల్లు అన్నట్టు. ఎడ్డితనం అంటె ఏం తెల్వని వాల్లను ఎడ్డోడు అంటారు. నిజంగా ఎడ్డోడు అంటే మూగవాల్లను అని అర్దంగాని ఇదేపేరు వాల్లకు పెడుతారు. ఇగపోతే పిసినారి వాల్లు అంటే పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. ఎవలకు ఏం ఇయ్యరు. ఏం బదులు ఇయ్యరు. గింత సహాయం కూడా చెయ్యరు. వాల్లను పిసినాశి లేదా పీనాశి అని అంటారు. ఇగ కైత్కాలోడు అని కూడా అంటారు. చమత్కారంగ మాట్లాడే వాల్లను మాటలతో కోటలు కట్టేవాల్లను రాగయుక్తంగా యతిప్రాసలతో సమయసూర్తిగా మాట్లాడే వాల్లను కైత్కాలు చేసుడు అంటరు. జట్ట గాడిద అంటరు. అదొక తిట్టు అన్నట్టు. వీడు జర కోపగొండి అంటరు. అంటే కోపం బాగున్న మనిషి అన్నట్టు లఫంగి, లంగ అంటే అందరిని మోసల చేసేవాడు అన్నట్టు. చిన్నప్పుడు ఈ పేర్లు నమోదు అయినవాల్లు ఇప్పుడు రాజకీయ నాయకులై ఉంటరు. బద్మాష్ తనం కూడా ఇదే. వాడు తెగాంచినోడు అంటరు. అంటే భయం అనేది లేదు ఎంతటికైనా పోయేందుకు ముందు ఉండేవాడు అని అర్థం తెగింపే తెగాయించినోడు అన్నట్టు. అట్లనే మొండిఘటం అని కూడా అంటరు. నల్లమొకం వాడు అంటరు. ఏదైనా తప్పు చేస్తే నల్గురిలోకి పోయే వీలు కాని వాడు అనే అర్థంలో నల్లమొకం వాడు అని పిలుచుకుంటరు లేదా వానికి మొకం లేదు రావడానికి అంటరు. అట్లనే వాడు నవ్వుమొకపోడు అని ఎప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడే వాల్లను అంటురు. వాడు వట్టివాడుగు కాయ అంటే ఊకే ఒర్లుతడు అన్నట్టు. వాడు బుల్లి అంటే, బంకపీసు పిసినాసిలో పెద్దరకం అన్నట్టు. వాడు పుల్లగండోడు అంటే అన్ని మోహమాటం లేకుంట తింటనే ఉంటడు. అన్నట్టు మందిల్లోలకు పోయి సుత ఏది పడితే అది పెడుతాంటే వద్దు అని కూడా తినేవాడు అని అర్థం. వాడు వట్టి మొహమాటం అంటే ఏదీ తీసికోడు, తినడు అన్ని వద్దు అనేవాడు అని అర్థం. వాడు కొజ్జోడు అంటే థర్డ్‌జెండర్ అనే అర్థంలో వాడుతరు. పొడుగు ఎక్కువ పెరిగినవాల్లను కూడా కొజ్జెకు కొజ్జ పెరిగిండు అని అంటరు. వారితోని పెట్టుకుంటె పరికెకంప అంటే కంపలెక్క మనకే తగులుతుంది అని అర్థం. ఇవే గుణాల పేర్లు ఆడోల్లకు కూడా పెట్టు అంటుంటారు. ఇవి తిట్లు కాదు. గుణాలను తెలిపే ఉపమానాలు మాత్రమే. ఇదొక ఊరి సొగసైన పిలుపులు.