Home ఆఫ్ బీట్ ఎత్తొంపుల బాట

ఎత్తొంపుల బాట

Family

రాజవ్వ చీకట్లనే లేసింది. ఆకాశంల సుక్కలు ఇంక పోనే లేదు. గొడ్ల కొట్టంల ఎడ్లు కండ్లు మూసుకోని నెమరు పెడుతున్నాయి. గుంజలకు తలలు వాల్చి. పక్కింట్ల లొల్లి అవ్వుడే ఆమెకు నిద్ర లేకుంటవ్వుడుకు కారణం. సుబద్రమ్మ ఆమె ఇంట్ల నుంచి లాసిగా వొర్రుతున్నది. సీకట్ల ఆ మాటలు మంచిగా ఇన్పిస్తున్నయి. “ఈ యింట్ల పడ్డకాంచి కష్టాలే… ఎన్నడన్న కడ్పుల కాల్లు ముడుసుకోని పండనిచ్చినావు? ఏడాదికోన్ని కన్నవు తప్పితే తప్పితే ఎవడెట్లున్నడో కనిపెట్టినవా! వాల్ల కడ్పుకు బువ్వ, కట్టుకోను గుడ్డ తెచ్చిన మొకమేనానీది!” గట్టిగ అరుస్తున్నది సుబద్రమ్మ. “నేంతేందే కట్టినవా కోక రైకలు… సంసారం కోసరం ఎద్దులెక్క కష్టపడ్డ… ఎంగిలి గంజి గతికిన రోజులున్నై… ఆయవన్నంగ తినుమని పెట్టనావ్?” లింగారెడ్డి ఆమెకంటే గట్టింగా రెట్టిస్తున్నడు. “ఆం … ఇన్నెండ్ల సంది తిండి లేకనే నక్కనక్కయినట్టున్నవు.” వెక్కిరింపు.
“అవు… నీ అవ్వగారింట్ల నుండి తెచ్చిందంత తిని గిట్లున్న.”
ఆక్రోశం. “రెండు మూడు దినాల సంది ఏవిట్కి అయితాందో తెలుస్తలేదు. ఈ లొల్లి పాడుగాను,’ రాజవ్వ ఆకిట్ల యాప చెట్టు కిందికొచ్చి కూసుంట గొనుక్కున్నది. ఎదురుంగ భూతం లెక్క పేద్ద పేద్ద బండరాళ్ళతో రాళ్ళ గుట్ట! అగలు బొగలు మీదున్న రక్కసి లెక్క! ఆ గుట్ట మీద చెట్లు తక్కువ. పెద్ద పెద్ద రాళ్ళతోని, దుబ్బ చెట్లతోని పైకి పోరాకుంట కింది నుంచే బండ మొలిచినట్టున్నది. ఆమె ఆలోచన తెగుతూ మల్ల మాటలు వినొచ్చినయి.
“అంటే తినలేదా! మా నాయిన వెట్టిన బంగారమంత నీ దినాలకే వెట్టిన. ఎన్నడన్నగా బంగారం వంటిమీద వుంచినావు? నువ్వు చెయ్యవట్టి మావ్వగారోల్ల సారెకు సంసారానికి దూరమైన. పైస పైస కూడవెట్టి నీ యింటన్లే పోసిన. ఎంత చేసినా నీ మంద తిననీకెనే సరిపోలే! చారణా కూరకు బారానా మసాల ఏస్క
తిన్నరు.” సుభద్రమ్మ మాటలు పూర్తి కాకతలికే లింగారెడ్డి చెయ్యి చేసుకున్నట్టున్నది, బోల్లు బొచ్చెలు బొలబొల కింద పడుతున్నయి. కనకయ్య చికాకుగా ఆవలించుకుంట ఇంట్ల నుంచి బైటకచ్చి రాజవ్వను చూసి.“లొల్లి బొందల మన్నువొయ్య తెల్లందాంక ఏంలొల్లే… వీల్లకు చెప్పెటోడు లేకనా!” అన్నడు వాల్లింటికెయ్యి పోవడానికి రెండడుగులు ఏస్తు. “ఊకోరాదు నీకెందుకు మద్యల..అందులకు పోతే నోదో లొల్లి అయితది.” ఆమె అతని ఊరుకోమని చెప్పుకుంట ఎదురుంగున్న చిన్న రాయి చూయించింది కూర్చోమని.
“ఏం ఊకుండుడే పొద్దు గూట్లె పడే వరకు లొల్లి మొదలు పెడ్తరు. తెల్లందాంక మన పానాలు తీస్తాండ్రు, లింగారెడ్డన్నతోని చెప్పాలే ఏందీ లొల్లని…” అతనంటున్నంతల్నే మళ్ళి కేకలు తిట్లు ఏడ్పు…
“ఎహె నీ..” కనకయ్య ఎదురింటి తలుపు దబదబ బాదిండు. సుభద్రమ్మ ఉర్కొచ్చి తలుపు తీసింది. “ ఏందమ్మ మీ లొల్లి! మీ లొల్లితోని మాకు నిద్ర లేకుంటున్నది ఐదారు రోజుల్నించి. పగలంత ఏం చేస్తురు పనుగడ… రాత్తిరవుడు సాలు, అసలేంది మీ గోల!” చికాకు ఆసక్తి కలిసింది కనుకయ గొంతుల. తలుపు పూర్తిగా తీసి లోపటికి రమ్మన్నట్టు కుర్చీ జరిపింది. కూసున్నడు కనకయ్య. ఆమె నెత్తంత చిర్ర చిర్రగ లేసి వున్నది. కండ్లల్ల నీల్లు బుగ్గల మీదికి జారి తడితడిగ మెరుస్తున్నది. చెంపల మీంచి కొట్టిన గుర్తులు కానొస్తున్నయి. లింగారెడ్డి ఈవలికొచ్చిండు. “ఏందే లింగన్నా.. ఏవిలొల్లి?”
అనునయంగా అడిగిండు కనకయ్య. ఆ మాటకు పెండ్లాంకెయ్యి గుర్రుగ చూసిండు. “రాత్తిరపుడు పాపం ఒక్కటే ఒరిత్తది. బారా బజీకు బాగోతం సురూ జేత్తది. అది లేదోంటది, ఇది లేదోంటది… పోరగాండ్లకు ఏవి ఇయ్యలేదోంటది..వాల్లు ఎట్ల బత్తున్నరో ఎందుకు చూడవంటది.. ఏడ చస్తనే అన్నా దీంతోనీ … ఎవుసం చెయ్యాల్నంటె ఎన్ని తిప్పలు పడ్తె నాలుగిత్తులు పండుతయి… నీకెర్కలేదా… నేను ఎద్దు కష్టం చేస్తున్న ఒక్క పోరడు ఇటుకెయ్యి తొంగి సూడరయ్యే.. ఆ మాట అనొద్దు.. వాల్లు నౌకర్లు చేసుకుంట బిజీగున్నరు అంటది.”
లింగారెడ్డి యాష్టకచ్చిండు సుభద్రను చూసుకుంట. “పిలగాళ్ళిద్దరు చెరో తావున నౌకర్లు చేస్తున్నరు.. నీ ఎవుసం నువ్వు చేస్తున్నవు.. మరి ఏవిట్కి వాల్లను పిలువనంప మంటది మా సెల్లె! అయినా ఇప్పటికిప్పుడు అంతగనం దండి కష్టాలేం వచ్చినయి మీకిప్పుడు?”
కనకయ్య ఆశ్చర్యంగ అడిగిండు. “దీని బొందల కష్టాలు.. తిని కూసుంటె ఊరా పేరా … పిలగాండ్లు చేసే నౌకర్లల్ల జీతాలు సరిపోత లెవ్వట… వాల్లు దరిద్రం ఎల్ల బోస్తాండ్రు ఎదురు డబ్బులు పంపోంటది. నీకు తెలవ్వదాన్న ఎవు సం చేస్తే ఏపాటి మిగుల్తయ్యో! అసలు ఏదారేండ్ల నించి కరువేనాయే.. సెర్ల రాగటి బుర్ధ తిన్న రోజులున్నయి… ఇప్పుడిప్పుడే జరంత మంచి బట్ట కడ్తున్నం.. కడుపుకింత తింటున్నం. రవుతం నీరు చేసుకోని కష్టపడితేనే గీమాసరున్నం. అది వాండ్లకు కూడ తెల్సు.. కొద్ది రోజులు ఆగరాదే నాకు శాతగాని రోజున భూవే పంచిత్తనంటె ఇనది… రోజు పంచాది చేస్తది…”
నెత్తి గుడ్డ దుల్పి మల్ల నెత్తికి కట్ట చుట్టాకు నుసి దుల్పి నిప్పు ముట్టించిండు.
గీ విషయానికే పెండ్లాంతోని తెల్లందాంక పంచాది పెట్టుకోని ఈపంత సున్నం సున్నం చేత్తున్నడా ఈనె అనుకున్నడు కనకయ్య. “ష్.. గిదీనికి ఇంతమందికి రాత్తిరి దాంక నిద్ర చెడగొట్టి మీరిద్దరు కొట్లాడుకుంటాండ్రా! నలుగురైదుగురు సుట్టాలకు చెప్పుకొని పెద్దమన్షితనం చెయ్యమంటే వాండ్లే చెరో చెక్క చేసిద్దురు గదా భూమిని…దెహే….”
లేవబోయిండు కనకయ్య.
“అన్నా ఒక్క నిముషం వుండే గీ ఆడిదానికి సుట్టాలొద్దు, పెద్ద మడ్సులొద్దు తింటేందుకు నా పాణాలు గావాలె ఇన్నవా! అరే ఎందుకొచ్చిన లొల్లి ఊకోవే అంటే ఇనది… నా తరంగాదు గని మా పోరగాల్ల పాల్పిచ్చు వాల్లే ఏదోటి పైసలా చేసిపోతరు.”అనుకుంట దండం బెట్టి రెండొందలు కనకయ్య చేతులబెట్టి –
“ శార్సీకుంచు.” అన్నడు. తెల్లార్తనే హైద్రాదు పోయిండు కనుకయ్య. పొద్దు గూకేవర్కి లింగారెడ్డి యిద్దరు కొడుకుల్ని ఎంబడి పెట్టుకోని బస్సు దిగిండు. ఇంట్ల కాల్లు సేతులు కడుక్కోని బల్లెపేటమీద కూసున్నరు కొడుకులిద్దరు. తండ్రితోని మాట్లాడుతుంటే సుబద్రమ్మ పళ్ళాలల్ల అన్నమేస్కచ్చింది. కోడికూర, గారెలు, తమాటపప్ప పెట్టింది. మన్సుల ఆశ్చర్యపోయిండు లింగారెడ్డి ఆమె ప్రేమకు. ఇంట్ల రోజు కూరో పచ్చిపులుసో వండుతది.ఎన్నడన్న కూర తినాలన్న కాయిసును చెప్తే-
“మాంసం తినాల్నంటె మూడొందలు కావాలె.. ఏడ తెస్తం.. మూడొందలుంటె నెల రోజులు తోటకూర తినొచ్చు” అనేది. కొడుకులు రాంగనేడినుంచొచ్చిందో కోడికూర అనుకున్నడు. తెల్లార్తనే లింగారెడ్డింట్ల మందుసీసలు, చికెన్ మటన్ ముక్కలు గిలాసలు లాంటి సరుకు సరంజామ అంత రడీ అయ్యింది. పెద్దమన్షులు ఇంట్ల కూసున్నరు. సుభద్రమ్మ వాల్ల మాటలు వినెటందుకని వంటవు గలువ ముంగట కూసున్నది, వాల్ల కవుపడకుంట. “మీ నాయన ఎవుసం చేస్తనంటున్నడు… కరువునుంచెల్లి ఇప్పుడిప్పుడే అందరం తేరుకుంటున్నం. మీకు గూడ ఎర్కెగదా నాలుగేండ్ల కరువు గురించి! ఈ సమ్మచరం కాస్త పంట కన్పడుతున్నది వానలు చెయ్యవట్టి” అన్నరు పెద్ద మనుషులు లింగారెడ్డి కొడుకులతోని.
“ఎమ్మో మామా… ఏమెవసాయమో ఏమో మా చిన్నప్పటి సంది సూస్తనే వున్నం ఎన్నడు ఈ భూమిల పుట్లు పండించి ఎన్నెసింది లేదు. నాయిన ఎద్దు కట్టం చేసుడే మిగుల్తున్నది… మా సదువులకు పైసలు పాపం మా అమ్మ బంగారం అమ్మిండు . ఈ భూమికి ఎంత పెట్టినా ఏట్ల పచ్చిపుల్సు కల్పిన తీరైతున్నది.” లింగారెడ్డి పెద్దకొడుకు పెదవిర్సిండు. అతనికి ఇక్కడ భూమి అమ్మి ఉద్యోగం చేసే చోట ఇల్ల కట్టుకోవాల్నని వున్నది. “ అమ్మ నాయిన ఒక్కమాటనుకోని జర పెట్టుబడి విషమంలో ఆలోచన చేస్కోని యవుసాయం చేత్తే ఏదైన ఇంటకొత్తయి ఇత్తులు. వాల్ల మందం వాల్లు బత్తేసాలు అన్నకు నాకు ఉద్యోగాలు వున్నయి. నాయిన మాకేవీ పంపకున్నా ఎదురు సూడకుంట వుంటే అదే పదివేలు” చిన్న కొడుకు భాస్కరే అన్నడు.
“ఎవల పరిస్థితైన అంతె వున్నది గీ పల్లెటూళ్ళ.. ఇంక మీరన్న జర హైద్రాదుల వున్నరు… ఒగలొగలైతే దుబాయిల మస్కట్ల నౌకర్లకని పోయి అజపజ లేకుంటైండ్రు అయినా… గవాండ్ల అమ్మయ్యలు ఏం జేత్తుండ్రు వుంటలేరా, తింటలేరా!” పెద్ద మనిషొకాయన నోరు సప్పరించిండ్రు. “ఈత రానోడు లోతెంతున్నదో సూత్తనన్నడట నీ అసుంటోడు. కాలమే మంచిగ లేదు…వానల్లేవు ఏం పండిత్తరు… అప్పు దెచ్చి ఇత్తునా లేస్తె గొడ్లకు సొప్పనన్న రాకపాయె.. రొట్టె… కట్టె… లేని దేశంల పుట్టగోసోడే బాగ్యమంతుడంట. ఎవుసం సేసి లాభం లేదు.. మీరే నయం నౌకర్లు చేసుకుంట ఉన్నదో లేందో తింటున్నరు.” కనకయ్య భాస్కర్‌తోని అన్నడు.‘ ‘అందుకే అంటున్న గద మామ… నాయిన మాకేం పంపకుంట భూమి అమ్మకుంట ఎవుసం చేసుకుంటె సాలు..” “మీరు చెరో మాట చెప్తిరి… మరి మీ అమ్మనేమో మీకు పంపాల్నని, పంచాల్నని మీ నాయినని అంటున్నదంట…మరి పంచాల్నా…” “వాల్లు మాకు పంచుతే వాల్లెట్ల బత్తరు? వాల్లకు అప్పుడే కాల్లు చేతులు ఒక్క దగ్గర్కి రాలె గద! ఏదో వకటి చేస్కోని ఎకడోక్కడ అమన్ చమన్ బత్కుతున్నరు మా మీద ఆదారం లేకుంట… వుండనీయండి ఒక్క జాగల.” చిన్న కొడుకు భాస్కరే తేల్చిండు. “మరి రోజు లొల్లి అయితున్నదని ఏదో ఒకటి తేల్చి పొమ్మని మీ నాయిన అంటనే మిమ్ముల పిల్చినం గాదు నాయిన!” అన్నడు కనకయ్య.“కూటి కొచ్చేదా, గుడ్డ కొచ్చేదానే ఈ ఎవుసం పాటు…మంచిగ భూవి అమ్ముకోని పైసలు మేం చెరిన్ని దీస్కోని, నాయనకు ఇల్లున్నది కనుక గిన్ని పైసలు ఆయనకు దీస్తె మిత్తిలకు తిప్పుకోని తింటరు. శాతగాన్నాడు వున్నం గద యిద్దరం సాది అవతల పారేత్తం… రోజు ఏవిటికి లొల్లి…నలుగుట్లె నాదాను..” పెద్దోడు ప్రభాకర్ చికాకు పడ్డడు. ఎంత నిఖచ్చిగ పచ్చి మాట్లాడుతున్నరు అనుకున్నడు కనకయ్య. లింగారెడ్డి వైపు సూస్తే అతను బాదగనే వున్నడు కొడుకుల మాటలకు. కాసేపు ఎవలు మాట్లాడలే. నిమ్మలంగ లింగారెడ్డి నోరిప్పిండు. “నా సేతనైన కాడికి సదువులు చెప్పించిన…పెండ్లీలు చేసిన, నాకున్న భూమేందో బుట్టేందో మీ అందర్కి ఎరికే.. అరే భాస్కరీ మీ అమ్మ నా సంసారంలలోనే తన బంగారం అంత ఏసిందంట. సరే అది సుత నిజమే ఆమె తల్లిగారి బంగారం గది. ఎంతసేపు నీ బంగారం నీకు సపరేటు వుండాలె..ఇక్కడ అన్ని ఖర్చులు ఎల్లాలె… ఎట్లెళ్లుతై… ఇప్పుడిప్పుడే గదా మీరిద్దరు సెటిలైండ్రు..మీ అమ్మతోనన్న పంటల మీద కొద్దో గొప్పో బంగారం చేయిస్తనన్న… అట్ల కాదట… తనకు బంగారం కావాలె… మీ అక్కర సక్కర్లకు డబ్బులు పంపాల్నట.. మీ జీతాలు పెట్టి ఇండ్లు మీరు కొనుక్కోవాల్నంట… మరి గీదంత నా వక్కంతోని అయితదా! గాలొచ్చినప్పుడే తూర్పారా పట్టాల్ననే రకం ఆమె. దాంతోనే ఇంట్ల లొల్లులు అయితున్నయి. మరి మీరేం చెప్తరో మీ అమ్మకు చెప్పుర్రి… ఎవుసం వద్దంటరా భూమి చెరింత తీసుకోని నాదేందో నాకు చూయించుండ్రి.”
నిష్టురంగనైనా కొడుకులతోని నిఖచ్చిగ చెప్పిండు లింగారెడ్డి. కనకయ్య ఆ మాటతోని మనసుల నిమ్మల పడ్డడు. కొద్దిగ చిన్న కొడుకే ఎటమటం చేస్తున్నడు అనుకున్నడు. భూమి అమ్మొద్దని కొడుకులు అంటె పంచాది నడువది. ఎక్కడోల్లక్కడ లేసిపోతరు. లింగారెడ్డి పొలం అమ్ముతే కొనాల్నని మనసుల కనకయ్యకు, రాజవ్వకు వున్నది. కని ఎవ్వరిముందల ఆ మాట బైట పెట్టలే. చూద్దం ఏం జరుగుతదో అన్నట్లే వున్నడు. ప్రభాకర్ తమ్మున్ని బైటికి పట్కపోయిండు నలుగుట్లె నుంచి. దాంతోని అందరు మందు మీద పడ్డరు. నీసు కవుసు మీద కాయిసున్నోలు తినుట్ల పడ్డరు. మందు తాగుతున్న కన్కయ్య కండ్లు మటుకు గల్మకెయ్యే వున్నయి. “నీ భూవి నీకయినా గీ బట్ట తడుపు వానలతోటి పొట్ట ఎల్లదీసుకోవుడు మటుకు కట్టమేనే లింగన్నా.” చిన్నగ కదిపిండు లింగారెడ్డిని.
“మరేం చెయ్యాలె..నాకేం పనొస్తది ఎవుసం దప్ప?” నిస్సహాయంగ అన్నడు.
“ఖర్చులు కరామత్తులు లేని నాబోటోనికే ఈ ఎవుసాయం చెయ్యాల్నంటె చేత కాకుండున్నది. ఎవరికన్న నాల్గు పైసలు మిత్తికిచ్చుకోని కాల్మీద కాలేసుకోని తింటే మంచిగుండనిపిస్తున్నది.” అన్నడు కనకయ్య నిదానంగా. “ ఏం చెప్తవే అన్నా నీకు ఉన్నొక్క కొడుకూ బాంకుల పంజేత్తున్నడు… ఇంకేంది రందారవుసా! జీతగాడు నాతగాడు లేకుంటనే నువ్వు, రాజవ్వ బాగనే ఎవసం జేత్తుండిరి… అందర్కుండొద్ధానే మంచి రాత..” అన్నడు లింగారెడ్డి. చిన్న నవ్వుకున్నడామాటకు కనకయ్య.
“నా కొడుక్కు బూవుల మీద ఎక్కడ లేని ఆపేక్షన.. వద్దురా కొడుకా ఎందుకొచ్చిన భూవులు అంటనే వుంట ఆకాడికి.” కొద్దిగ గర్వంగ అన్నడు. “దిమాకి పాడైతాంది ఇంట్లలొల్లులతోని…బైట ఖర్చులతోని… ఒకొలొకలైతే గీ కరువుకు ఉప్పిడి ఉపాసాలుండలేక బివాండికి పోతున్నరు.” లింగారెడ్డి గల్వ కాడికి పోయి సూచొచ్చి మల్ల కూసున్నడు కొడుకులు ఏం చేస్తున్నరోనని.
“ లింగారెడ్డన్నా గీ భూమిని కడుపు నాయగట్టుకోని సంపాయించినవు నాకెర్కలేదా! సౌడు మట్టితోని నువ్వూ నీ నాయినా బవంతి గట్టిండ్రు. ఎన్నందాలనో పిల్లల కోసం కష్టపడ్డవు. అయినా గిప్పుడు ఫాయిదా లేకుంట వున్నవు. యిద్దరు కొడుకులల్ల ఒకడు ఎవుసం వద్దంటడు, ఇంకొకడు భూవి వుండనీయ మంటడు.. ప్చ్…ఈ ఎవుసం చేస్తాంటే లోపటికీ గని ఆందాని రాదు. రాన్రాను ఖర్చులకు పిలగాల్లని పైసలడుగుతే ఇయ్యరు సరిగదా నువ్వెంత నీ బిసాదెంత అంటరు… అన్ని ఆలోసించుకో…
వాల్లు లోపటి కొచ్చే వరకు.” చెప్పి గిలాసల ఇంకింత మందు పోసుకున్నడు. “పొల్లగాల్లకు భూవి ఇచ్చి ఏ ఆదెరువు లేకుంట ఎట్ల వుండాల్నే… వాల్లు తిన్న తట్ట తియ్యకుంట తిరిగేటోల్లు… నన్ను కూసండ వెట్టి సాత్తరా!” అన్నడు భయంగ.
“నిజమే మన కడుపున పుట్టినోళ్లైనా అయ్యే పాపం అంటే ఆర్నెల గాచారం సుట్టుకుంటన్నది.” మాట విసిరేసి మౌనంగ కూసున్నడు కనకయ్య. “అవును ఇయ్యాల రేపు ఏవున్నది ఎక్కినోనిది గుర్రం, ఏలినోనిది రాజ్యం.”

తమ్మెర రాధిక

94406 26702