Home వార్తలు గొల్లెక్కిరి ఎడ్డెక్కిరి

గొల్లెక్కిరి ఎడ్డెక్కిరి

village1గిది మా లస్మయ్య తాత సెప్పిన కత. లస్మయ్య తాత నాకు సొంత తాతే అయితడు. గయినె ఐదేండ్ల వయసుకెల్లి, ముసలోడయి సచ్చిపోయెదాక గొర్ల గాసుకుంటనే బతికిండు. మా తాత పెయ్యిమీన నేనెప్పుడు అంగేసుకోంగ సూల్లేదు. కుప్పున పంచుధోతిని మీదికి మలిసి గొల్లబట్ట గట్టెటోడు. పండ్ల పుల్ల నోట్లేసుకున్నడంటె గది అరిగెదాక ఊరంత తిరుక్కుంట తిరిగెటోడు. నన్ను భుజాల మీదెక్కిచ్చుకొని తిరిగెటోడు. మా అమీన్‌సాబ్, మా తాసీల్దార్ అనుకుంట నన్ను జూసి సంబురపడెటోడు. కని గా తాతనందరు గొల్లెక్కిరి ఎడ్డెక్కిరందురు. గట్లెందుకంటరని నాకర్థం గాకపోవు. గదే మాటోపారి మా తాత నడిగిన. తాతా తాతా! గొల్లెక్కిరి ఎడ్డెక్కిరంటేంది. నిన్నెందుకు గట్లంటరు అని. గప్పుడు తాత గొల్లోల్ల సంగతులు, ఎడ్డి బతుకుల గురించి కతోలె జెప్పిండు. గండ్ల యాదికున్న కాడికి మీకు జెప్పుత.
నీయక్క గొల్లొల్లంటె అందరికి సులుకనే మనువడ. మనలను ఎడ్డి గొల్లోల్లందురు, గొల్లెక్కిరందురు. గొల్లోల్లంటె గొర్రెలసోంటి అమాయకులు గద! ఊల్లె దొరలు, గా పెద్ద కులపోల్లు గొల్లోల్లను, పనిపాటల కులపోల్లను తక్కువజేత్తురు. గిట్ల తిట్టు పదాలతోని పిలుత్తురు. సాలె సంకుటం గోచిలిరుకుటం అని బెస్త పెద్దిరికమని, మాలపంకిడని గిట్ల అరొక్క తీరుగ మనల పేర్నాల వెడ్దురు. నేను పెద్ద గొల్లను గద. అంటె గొల్లోల్లకు పెద్ద కులస్తున్ని అన్న మాట. అయినా నన్ను గూడ ఇడ్సిపెట్టకపోదురు. గొల్లోల్లు దొరలకు ఎట్టి గొర్లియ్యాలె. మందలు ఉత్తగనే పెట్టాలె. దొరలిండ్లల్ల లగ్గాలు గిట్టయితె వట్టిగనే గొర్లియ్యాలె. ఎట్టిసాకిరోలె పనులు జెయ్యాలె. దండుగలు గట్టాలె. ఊల్లె పోసమ్మలు, మైసమ్మలు జేసుకుంటె గొర్లు వట్టిగనే ఇయ్యాలె. మన ఇండ్లల్ల మూఢనమ్మకాలెక్కువే. ఇంటి నిండ దేవుళ్ళే. మల్లన్న, బీరన్న, పోచమ్మ, మైసమ్మ, లచ్చిందేవి, పొలువ రాజులు గిసోంటి దేవతలందరు ఉండె. మన జాతికి మూల పురుషుడు శ్రీకిష్ణుడంటరు. గా శ్రీ కిష్ణుడు అందరికి దేవుడే. కని గా కిష్ణుని సంతతోల్లు మాత్రం అందరికి లోకులే. మన గొల్లబట్ట గట్టుడు జూసి నవ్వుతరు. మన మాటతీరు జూసి దెప్పుతరు. గొల్లోల్లు సదువుకుంటె గొల్లని సాహిత్యవిద్య అని తక్కువ జేత్తరు. గివ్వన్ని గీ కులాలతో నచ్చినయి బిడ్డ. మనలను అందరన్ని తీర్లు పేర్నాలు వెడుతరు. అయితె నవ్విన నాప చేదే పడుతుందంటరు సూడు. గా ఎడ్డిగొల్లోల్లే మనూల్లె దొరలకు తిరుగవడ్డరు. యాదవ సంగమని పెట్టిండ్రు. యాదవ అజ్ఞానవిజ్ఞాన ఒగ్గు కతని రాసిండ్రు. జిల్లా అంతట తిరిగి ప్రచారం జేసిండ్రు. దొరలకు ఎట్టి గొర్లను బందు జేసిండ్రు. ఎట్టి మందలు బందు జేసిండ్రు. సికింద్రాబాద్ నుంచి సదువుకున్నోల్లను పిలిపిచ్చిండ్రు. సంఘంను బలంగ జేసిండ్రు. మరి గా గొల్లెక్కిరి ఎడ్డెక్కిరిరన్న కులం నుంచచ్చిన కిష్ణుడే భగవద్గీత చెప్పిండని గా సంగపోల్లు జెప్పిండ్రు. గా భగవద్గీత మన దేశంల అందరికి బాగ సదివే వయ్యట కద. గొల్లోడు దేశానికేం తక్వ జేసిండని? గొర్ల పెంపకం మనమే జేత్తము, ఆవుల పెంపకం, పశువుల పెంపకం మనడే జేత్తిమి. పాలు పెరుగు దేశానికి కందిత్తిమి. మాంసం జేశానికిత్తిమి. ఎవుసం జేత్తిమి. పశువులకు సురుకువెట్టే వైద్యం జేత్తిమి. చెట్ల మందులు పోసి ఎన్నో రోగాలు నయం జేత్తిమి. అడివంత రోజు తిరుగుతం గద. అన్ని పసర్లు, చెట్లు, ఆకులలములు మనకే ఎరుక. గిన్ని జేత్తె గొల్లోల్లకేం మిగిలింది పిలగ! గొంగడే మిగిలింది. ధోతి పేగులే మిగిల్నయి. పెయ్యిమీద బట్టుండదు. చేతిల కట్టున్నా భయం భయమే. దొరలంటె భయం, సర్కారోల్లంటె భయం. పట్వారంటె భయం. ఇంటి నిండ దేవుళ్ళున్నా ఎవ్వలు కాపాడేటోల్లు లేరు. మల్ల మనల ఎర్రిగొల్లోడని ఎర్గెల వెడుతరు. పెద్దగొల్లను నన్నుగూడ ఎవ్వలు లెక్క జెయ్యరు అన్నడు తాత. నేను నడుమ తగిలిచ్చుకొని పెద్దగొల్లంటేందే తాత అన్న. గిది నాకు పెద్దపెల్లి దేశ్‌ముఖ్ ఇచ్చిండు. నన్ను పెద్ద గొల్లని గౌరవించిండు. ప్రతి ఊల్లె కులపెద్దలు ఉంటరు. గా కులపెద్ద కుల పంచాయితీలు జేత్తడు. ఏమన్న తగాదైతే తీరుత్తడు. గొర్ల పంచాయితీలు, ఇడుపు కాయిదాలు, పండుగలు గివ్వన్ని కులపెద్దతోనే ఐతయి. మల్లన్న పట్నాలు, ఏమన్న కులానికి సంబంధించిన కార్యలయితె ముందుగాల కులపెద్దకే కుడుక, పలారం పంపుతరు. గొర్రెను గోసుకుంటె సప్క పంపుతరు. పండుగనాడు కులపెద్ద కొంతమంది కులపోల్ల పిల్సి భోజనం పెడుతడు. మందమీద గొర్రె గోసుకుంటె పస్క పిల్లను జేసుకుంటె సప్క మాంసం కులపెద్దకు పంపుతరు. గొర్లకు డాకులేసేటోల్లచ్చినా, ఇంజెక్లనిచ్చే పశువుల డాక్టరచ్చినా కులపెద్దను కలుత్తరు. కులపెద్ద ఇంట్లనే తింటరు. నాకు గీ కులపెద్దతనం దేశ్‌ముఖ్ పెద్దపెల్లికి పిలిసి సన్నత్ రాసిచ్చిండు. కొత్త రుమాలు జుట్టి నన్ను గవురవిచ్చిండు. ఎన్ని జేసినా ఊళ్ళె దొరలయితె అన్నదమ్ముల నడుమ కొట్లాటలు వెట్టిత్తరు. మేం గూడ మస్తు కొట్లాడినం. గిదంత మంచిగ లేదని నేను గొర్లు గాసుకుంట మీ నాయిన్నను ముత్తెమంత సదివిచ్చిన. నాలుగో తరగతి దాక సదివిండాడు. ఇంకో మూడు జదువెతే బడిపంతులయ్యెటోడు. కని బందు జెయ్యవల్సిచ్చింది. గా సదువుతోనే మీ నాయిన్న రామాండాలు, భారతాలు, పురాణాలు అన్ని జదువుతడు. సదివి అందరికి జెప్పుతడు. గట్ల గాయింత అచ్చెర పొడ ఉండెపటికెనే యాదవ సంఘం బెట్టిండు. గిప్పుడది నడుత్తంది గద! గోకులష్టమి నాడు మన గొల్లోల్లే గోపాల కాల్వలు దీత్తరు. కష్ణుని పుట్టినరోజు మస్తు జేత్తరు, మీనాయిన్న గా వెంకటయ్య పంతులు గలిసి యాదవుల కోసురం ఒగ్గుకత రాసిండ్రు. అందరు తెలివి గలిగుండాలెనని బోధన జేసిండ్రు. గిప్పుడు గూడ ఊళ్ళళ్ళ తిరిగి అందర్ని తెలివికి దెత్తండ్రు. గా యాదవసంగం జెయ్యవట్టి మనోల్లు తెలివి కచ్చిండ్రు. కత్తర్ల భూమయ్య సరుపంచయిండు. దొరలది మస్తు నడుత్తున్న గిప్పుడు ఓ గొల్లయినె సరుపంచయిడంటె గండ్లెంత నట్టముందో ఎరికేనా? గదంత సదవుతో వచ్చిన తెలివి. మా తీరుగ సదువు లేకుంటే ఎప్పటికి గట్లనే ఎడ్డిగొల్లోల్ల లెక్కనే ఉంటం. అందు కోసురం అందరు సదువుకోవాలె బిడ్డ. సదువుతోని తెలివికి రావాలె. మీ నాయిన్న ముత్తెమంత సదివి గంత తెలివికచ్చె. నువ్వు మస్తు సదువుకొని ఇర్గ తెలివికి రావాలె. మన కులపోల్లకు, ఊరోల్లకు, అందరికి మద్దతుగుండాలె అన్నడు.
అంటె ఎడ్డి గొల్లోల్లు తెలివికి రావాలంటవా తాత అన్న. అవు మనువడ మీ కాలం వరకయినా ఎడ్డిగొల్లోల్లనే గొల్లోల్లు మస్తు తెలివికి రావాలె. గా తెలివి సదువుతోనే అత్తది అన్నడు తాత.