Home రాష్ట్ర వార్తలు గ్రామాల వారీగా పక్కాగా రెవెన్యూ రికార్డులు

గ్రామాల వారీగా పక్కాగా రెవెన్యూ రికార్డులు

అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఆదేశాలు

                Land-Survey

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభమైన నేపధ్యంలో అన్ని శాఖల అధికారులు గ్రామాల వారీగా తమ శాఖలకు సంబంధించిన భూముల వివరాలు రెవెన్యూ రికార్డులలో చేర్చడానికి తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో గ్రామాల వారీగా వివిధ శాఖల ఆధీనంలో ఉన్న భూముల వివరాలపై సిఎస్ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిఆర్ మీనా, మునిసిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిత్తల్, హెచ్‌ఎండిఎ కమిషనర్ చిరంజీవులు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నీతుప్రసాద్, విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్, భూ ప్రక్షాళన మిషన్ డైరెక్టర్ కరుణ, పిసిసిఎఫ్ పికె ఝాలతో పాటు రోడ్లు, భవనాలు, పరిశ్రమలు, ఇరిగేషన్, ట్రాన్స్‌కో తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

గ్రామాల వారీగా తమ శాఖ ఆధీనంలో ఉన్న భూముల వివరాలు తయారు చేసేలా జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేయాలని సిఎస్ ఆదేశించారు. ఈ వివరాలు కలెక్టర్లకు అందజేయాలన్నారు. ప్రతి శాఖ ఆస్తుల వివరాలు రెవెన్యూ రికార్డులలో ఉండాలన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులు గుర్తించాలని సిఎం ఆదేశించారని, ఈ వివరాలన్నీ గ్రామాల్లో పర్యటించే బృందాల ద్వారా భూ రికార్డులలో నమోదయ్యేలా చూడాలన్నారు. గతంలో ప్రభుత్వ శాఖల ఆస్తుల వివరాలు రెవెన్యూ రికార్డులలో నమోదు కాలేదని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా జిల్లాలు, గ్రామాల వారీగా సర్వే నంబర్ల ప్రకారం ప్రభుత్వ ఆస్తుల వివరాలు నమోదు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రైల్వే, జాతీయ రహదారులు, టెలికాం, పవర్ గ్రిడ్ లాంటి సంస్థల పరిధుల్లో ఉన్న భూముల వివరాలు కూడా నమోదు చేయాలన్నారు. గ్రామాల్లో ఉన్న స్మశాన వాటికలకు రైతులు భూదానం చేసినప్పటికీ, పాత పేర్లతోనే కొనసాగుతున్నాయని, వీటిని సరిచేయాలని సూచించారు. పాఠశాలలు, మార్కెట్ యార్డులు, గోదాములు, రోడ్ల లాంటి ప్రతి వివరాలు రెవెన్యూ రికార్డులలో నమోదు కావాలన్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల వివరాలు తెలుస్తాయని, వివిధ శాఖల అధికారులు గ్రామస్థాయి బృందాలకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఆదేశించారు.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు : నాంపల్లిలోని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఎ) కార్యాలయంలో 040-23201347 నెంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భూ రికార్డుల ప్రక్షాళన కోసం మొత్తం 1394 బృందాలు ఏర్పాటు చేయగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 1389 బృందాలు గ్రామాలలో పర్యటించాయి.