Home తాజా వార్తలు ప్రజల కోసం రాజీనామా చేయలేదు… ఈటెలకు ఎందుకు ఓటెయ్యాలి: వినోద్ కుమార్

ప్రజల కోసం రాజీనామా చేయలేదు… ఈటెలకు ఎందుకు ఓటెయ్యాలి: వినోద్ కుమార్

ప్రజల కోసం కాకుండా సొంత అజెండాతో రాజీనామా చేసిన ఈటలకు ఎందుకు ఓటేయాలి?

ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికి ఈటెల చెప్పనేలేదు

ఐదు నెలలు నుంచి ఒక్కరోజు కూడా ప్రజల సమస్యలు ప్రస్తావించని ఈటెల

అలాంటప్పుడు ప్రజలు ఎందుకు స్పందించాలి..?

Vinod kumar comments on Etela rajender

కరీంనగర్: ప్రజల కోసం కానీ, హుజురాబాద్ నియోజకవర్గం పనుల కోసం కానీ కాకుండా సొంత అజెండాతో ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. అలాంటప్పుడు ఈటలకు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు.  గురువారం హుజురాబాద్ పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ను గత ఐదు నెలలుగా గమనిస్తున్నామని, ఒక్క రోజు కూడా అందుకు కారణం మాత్రం ఇప్పటి వరకు చెప్పడంలేదని ఎద్దేవా చేశారు.  ఈటల తన బాధను, ప్రజల బాధగా మార్చేందుకు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని, తప్ప అసలు అజెండా మాత్రం చెప్పడం లేదని మండిపడ్డారు. ప్రజలకు అన్యాయం జరిగింది అని కానీ, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగడం లేదని కానీ, పెన్షన్లు రావడం లేదని కానీ, రైతు బంధు, రైతు బీమా రావడం లేదని కానీ, ఫలానా పనులు కావాలని కోరితే రాలేదని కానీ ఎన్నడూ ఈటెల చెప్పలేదన్నారు. ఏ కారణం చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో చెప్పాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

సరైన కారణాలు చెప్పకుండా, సొంత అజెండాతో పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ కు ప్రజలు ఎందుకు ఓటెయ్యాలని అడిగారు. ఓట్లు అడిగే నైతిక హక్కు ఈటల రాజేందర్ కోల్పోయారని, అతని పట్ల ప్రజలు కూడా స్పందించాల్సిన అవసరం లేదన్నారు.  తల్లిలాంటి టిఆర్ఎస్ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ పట్ల వ్యతిరేక భావనతో, బహిరంగంగా విమర్శలు చేసిన ఈటల రాజేందర్ కు ప్రజలే తగిన రీతిలో గుణపాఠం చెబుతారని విమర్శించారు.

కాజీపేట-హుజురాబాద్-మానకొండూరు-కరీంనగర్ రైల్వే లైన్ పనులు తిరస్కరించిన ఎంపి బండి సంజయ్ పట్టించుకోవడంలేదని వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కరీంనగర్ ఎంపిగా గెలిచి రెండున్నర సంవత్సరాల కాలం గడిచినా బండి సంజయ్ జిల్లాకు ఒక్క రూపాయి కూడా కొత్తగా తీసుకుని రాలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. బండి సంజయ్ జిల్లా అభివృద్ధి కోసం పట్టుబట్టి పనులు చేయాలని సూచించారు. గతంలో హైదరాబాద్-మనోహరాబాద్-గజ్వేల్-సిద్దిపేట-సిరిసిల్ల-వేములవాడ-కరీంనగర్ రైల్వే లైన్ పనులను రైల్వే శాఖ తిరస్కరణకు గురైన తాను కరీంనగర్ ఎంపిగా ఉండి పట్టుబట్టి పనులను చేయించానని వినోద్ తెలియజేశారు. ఇప్పటికైనా ఈ రైల్వే లైన్ పనులను సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని బండి సంజయ్ కు ఆయన సూచించారు.