Home తాజా వార్తలు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్ర : వినోద్ కుమార్

మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్ర : వినోద్ కుమార్

Vinod Kumar Comments On GHMC Electionsహైదరాబాద్‌ : హైదరాబాద్ లో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొట్టాలని టిఆర్ఎస్ నాయకుడు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ నగర ప్రజలను కోరారు. హైకోర్టు సీనియర్‌ న్యాయవాది కల్యాణ్‌రావు వినోద్ కుమార్ సమక్షంలో శనివారం టిఆర్‌ఎస్‌ లో చేరారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడారు. కెసిఆర్ ఆరేళ్ల పాలనలో హైదరాబాద్ నగరంలో శాంతి పరిఢవిల్లుతోందని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో అల్లర్లు సృష్టించాలని కొందరు చూస్తున్నారని, అటువంటి వారికి బుద్ధి చెప్పి గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ను గెలిపించాలని ఆయన నగర ప్రజలను కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తూ, ప్రైవేటు పరం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. ఎల్ఐసితో పోటీ పడే సంస్థ ప్రపంచంలోనే లేదని, అటువంటి సంస్థలో మెజార్టీ వాటాను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని ఆయన మండిపడ్డారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఆరోపించారు. మోడీకి విశాలమైన ఛాతి ఉందే తప్ప విశాలమైన మనస్సు లేదని వినోద్ కుమార్ ఎద్దేవా చేశారు. జియో సంస్థ కోసం బిఎస్ఎన్ఎల్ ను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అఖండ విజయం సాధించడం ఖాయమని, ఈ క్రమంలోనే న్యాయవాదులు టిఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన కోరారు.