Home తాజా వార్తలు ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొడుతున్న బిజెపి నాయకులు : వినోద్ కుమార్

ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొడుతున్న బిజెపి నాయకులు : వినోద్ కుమార్

Vinod Kumar Elections Campaign In Warangal Cityవరంగల్‌ : ఓట్ల కోసం బిజెపి నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. బిజెపి నాయకుల మాయమాటలకు వరంగల్ పట్టణ ప్రజలు మోసపోవద్దని ఆయన కోరారు. సోమవారం ఆయన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంఎల్ఎ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిపి వరంగల్ పట్టణంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడారు. రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, మరే రాష్ట్రంలో అమలు కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం తెలంగాణలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. ఆరు నెలల్లో కాకతీయ టెక్స్ టైల్ పార్కులో ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. అధికార దాహంతో ఓట్ల కోసం వచ్చే బిజెపి నాయకులకు పట్టణ ప్రజలు గట్టిగుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంటింటికి తాగు నీరు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధులనే గెలిపించి అభివృద్ధికి పట్టం గట్టాలని ఆయన కోరారు.