Home ఎడిటోరియల్ ఈశాన్య ఢిల్లీ హింస

ఈశాన్య ఢిల్లీ హింస

Sampadakiyam

 

దేశాన్ని ఎన్నడూ లేనంతగా మత విద్వేషాల మందు పాతరగా మార్చేసిన తర్వాత ఏ చిన్న నిప్పు రవ్వ తాకిడికైనా అది భగ్గున రగులుతుందని అప్పుడే పుట్టిన పసిపాపనడిగినా చెబుతుంది. దేశాధికార అగ్ర పీఠాలన్నింటికీ కూత వేటు దూరంలో, అతి చేరువలో గల ఈశాన్య ఢిల్లీలో 3 రోజులకు పైగా సాగుతున్న ఘర్షణలకు ఈ విద్వేష వాతావరణమే కారణం. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 27 మంది మరణించినట్టు 200 మందికి పైగా గాయపడినట్టు అధికారిక సమాచారం. ఢిల్లీ ఎన్నికల్లోనూ, అంతకు ముందు, ఆ తర్వాత నాయకులు చేసిన వైషమ్యపూరిత ప్రకటనలే ఈ హింసకు దారి తీశాయనడం ఎంత మాత్రం అబద్ధం కాదు. స్వయంగా దేశ పాలకులు, వారి అనుచరులే విద్వేష ప్రసంగాలకు పాల్పడడం ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ జరగలేదు. పౌరసత్వ సవరణ (సిఎఎ) చట్టానికి వ్యతిరేకంగా రెండున్నర మాసాలుగా దేశమంతటా నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి.

ఢిల్లీ షహీన్ బాగ్‌లో ముస్లిం మహిళలు నిరంతరాయమైన, చరిత్రాత్మకమైన శాంతియుత ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామియా మిలియా, జెఎన్‌యు యూనివర్శిటీల్లో సంభవించిన సిగ్గు పడవలసిన ఘటనలు తెలిసినవే. తాము తీసుకొచ్చిన చట్టం ఇంత అలజడికి అపూర్వ ఘటనలకు దారి తీస్తున్న దశలో ఆయా వర్గాల్లో తలెత్తిన భయాలను పారద్రోలేందుకు ప్రయత్నించడం, ఆందోళనకారుల ప్రతినిధులతో చర్చలు జరపడం దేశ పాలకుల ప్రధానమైన బాధ్యత.

అది జరగకపోగా, సిఎఎను వెనుకకు తీసుకునే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు బిజెపి పెద్దలు ప్రకటనలు చేయడం పరిస్థితి చక్కబడడానికి బదులు మరింత ఉద్రిక్తం కావడానికే దోహదం చేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ మోడల్ టౌన్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బిజెపి అభ్యర్థి కపిల్ మిశ్రా గత ఆదివారం నాడు జఫ్రాబాద్ ప్రాంతంలోని మౌజ్‌పూర్ చౌక్‌లో సిఎఎ అనుకూల ఊరేగింపు తీసి పోలీసులను హెచ్చరిస్తూ చేసిన ప్రకటన మరునాడు ప్రత్యర్థి వర్గాల ఘర్షణకు దారితీసి ఊహించని స్థాయికి ప్రబలిపోడానికి ప్రధాన కారణమని స్పష్టపడుతున్నది.

‘ఢిల్లీ రోడ్ల మీది సిఎఎ వ్యతిరేక ప్రదర్శనలకు మూడు రోజుల్లో తెర దించకపోతే తాము వీధుల్లోకి రావలసి వస్తుందని కపిల్ మిశ్రా ఆదివారం నాడు చేసిన ప్రకటన పరిస్థితిని వేడెక్కించి ఘర్షణలకు కారణమయింది. తూర్పు ఢిల్లీ బిజెపి ఎంపి, క్రికెటర్ గౌతమ్ గంభీర్ మాటల్లోనే ఈ విషయం స్పష్టమయింది. కపిల్ మిశ్రా సహా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన పార్టీ సభ్యులు ఎవరైనా వారిపై చర్య తీసుకోవాలని గంభీర్ డిమాండ్ చేశారు. ఈ ఘర్షణలకు మరో ముఖ్యమైన కారణం ఢిల్లీ పోలీసుల క్రియాశూన్యత అని కూడా స్పష్టపడుతున్నది. ఢిల్లీలో పోలీసు విభాగం ఆ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉండదు. కేంద్ర హోం శాఖ అదుపాజ్ఞల్లో ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విశేష పర్యటనలో ప్రధాని మోడీ తల మునకలై ఉన్న మాట వాస్తవం, అమిత్ షాకు ఏమైంది అనే ప్రశ్న సహజం. ఆయన జరిపిన సమీక్షల్లో సమస్య మూలాన్ని తెలుసుకొని ఉంటే దాని నిర్మూలన కూడా సునాయాసమ య్యేది.

ఘర్షించిన శక్తులు తమ ముందే రెచ్చిపోతుంటే పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. 1984లో జరిగిన సిక్కుల ఊచకోత మాదిరి పరిస్థితి మళ్లీ తలెత్తడాన్ని సహించబోమని ఢిల్లీ హైకోర్టు బుధవారం నాడు హెచ్చరించిందంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో ఊహించవచ్చు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బిజెపి ఎంపి పర్వేష్ వర్మ కూడా మత విద్వేషపూరితమైన ప్రసంగాలు పదేపదే చేశారని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి ఒకరు కోర్టు గదిలోనే చెప్పినట్టు వచ్చిన వార్త గమనించదగినది. బాధితులకు భారీ భద్రత ఏర్పాటు చేయాలని క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రుల్లో చేర్చాలని ఘర్షణల్లో చిక్కుకొని స్వస్థలాలకు వెళ్లలేకపోతున్న వారికి సకల సౌకర్యాలు కల్పించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బాధితులను స్వయంగా పరామర్శించాలని హైకోర్టు వివరంగా ఆదేశించవలసి వచ్చిందంటే అటు కేంద్రం, ఇటు ఢిల్లీ ప్రభుత్వం కూడా కర్తవ్య పాలనలో ఎంతగా వెనుకబడ్డాయో అర్థం చేసుకోవచ్చు.

ట్రంప్ స్వదేశానికి బయల్దేరిన వెంటనే ప్రధాని మోడీ ఢిల్లీ పరిస్థితిపై దృష్టి సారించినట్టు బోధపడుతున్నది. దేశ రాజధానిలో జరుగుతున్న అల్లర్లపై విస్తారంగా సమీక్షించానని పోలీసులు, ఇతర సంస్థలు శాంతిని పునరుద్ధరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించడం హర్షించవలసిన విషయం. శాంతి సామరస్యాలు మన సంస్కృతిలో ప్రధానమైన అంశాలని కూడా ఆయన చెప్పడం బాగుంది. కాని బిజెపి పెద్దలు ఇకనుంచైనా ద్వేష భాషకు స్వస్తి చెప్పేలా చూడవలసిన బాధ్యత ఆయన మీద అమితంగా ఉంది.

Violence in Northeast Delhi