Home తాజా వార్తలు అభిమానిని కాపాడిన కోహ్లీ

అభిమానిని కాపాడిన కోహ్లీ

Virat-Kohli

ఇండోర్: భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారన్న విషయం తెలిసిందే. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతనికోసం అభిమానులు పోలీసు భద్రతా వలయాలు, బారికేడ్లను దాటుకుని మరీ మైదానంలోకి పరుగెత్తుకు వస్తుంటారు. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ఇండోర్‌లో జరిగిన తొలి టెసుట సందర్భంగా శనివారం కూడా సూరజ్ అనే ఓ వీరాభిమాని కోహ్లీ కోసం ఇలాగే మైదానంలోకి దూసుకొచ్చాడు.సెక్యూరిటీనుంచి తప్పించుకొని కోహ్లీ వద్దకు వచ్చాడు.అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా అతడిని మైదానంనుంచి పంపించి వేయడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన కోహ్లీ అలా చేయవ్దని వారికి సంకేతం ఇచ్చాడు.

కొద్ది సేపు అతడి భుజంపై చేయి వేసి మాట్లాడాడు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది అతడిని మైదానంనుంచి అవతలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.సెక్యూరిటీ సిబ్బందినుంచి అభిమానిని కోహ్లీ రక్షించిన తీరును నెటిజన్లు కొనియాడుతున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన సూరజ్ వంటపని చేస్తుంటాడని ఓ పోలీసు అధికారి తెలిపాడు. అతను కోహ్లీకి వీరాభిమాని అని చెప్పాడు. కోహ్లీ పేరును తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. అంతేకాకుండా శరీరంపై రంగులతో ‘ వికె’ అని రాసుకున్నాడు. బంగ్లాపై భారత్ ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం కోహ్లీ విలేఖరులతో మాట్లాడుతూ అభిమానులు ప్స్రోహించడంతో రెట్టింపు ఉత్సాహంతో ఆడి విజయం సాధించామన్నాడు.

Virat Kohli Saves a Fan From Security