Home IPL 2019 ద్వితీయార్ధంలో బాగానే ఆడాం: కోహ్లీ

ద్వితీయార్ధంలో బాగానే ఆడాం: కోహ్లీ

virat-kohliబెంగళూరు: ఐపిఎల్ రెండో అర్ధభాగంలో తమ జట్టు బాగానే ఆడిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఇదే దృష్టి మొదటి అర్ధభాగంలో పెట్టి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని అభిప్రాయపడ్డాడు. శనివారం రాత్ని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీ విలేఖరులతో మాట్లాడాడు.

‘ ఈ సీజన్‌నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ఐపిఎల్ లాంటి టోర్నమెంట్లలో వరసగా ఆరు మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత తిరిగి పుంజుకోవడం చాలా కష్టమైన పని. అయితే ఈ విషయంలో గొప్పతనం అంతా కూడా జట్టు యాజమాన్యందే. ఓటములు ఎదురవుతున్నా యాజమాన్యం మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించింది. అనుకున్న స్థాయిలో టోర్నమెంట్‌ను ముగించలేకపోయినా రెండో అర్ధభాగాన్ని చూసినట్లయితే మాత్రం టోర్నమెంట్‌లో మా ప్రదర్శన బాగానే ఉందనే భావన కలిగింది. చివరి 7 మ్యాచ్‌లలో మేము అయిదు మ్యాచ్‌లు గెలిచాం. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయింది. ఈ విషయంలో ఒక జట్టుగా మేము గర్వపడుతున్నాం’ అని కోహ్లీ అన్నాడు.

virat Kohli says It Doesn’t Feel Like a Bad Season