Home IPL 2019 వామ్మో! ఏం బ్యాటింగ్.. భయమేసింది భయ్యా!!

వామ్మో! ఏం బ్యాటింగ్.. భయమేసింది భయ్యా!!

Dhoni and Virat Kohliబెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో చెన్నై, బెంగళూరు జట్ల మధ్య ఆదివారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా కొనసాగిన సంగతి తెలిసిందే. అటు అభిమానులతో పాటు ఆటగాళ్లను కూడా తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. చివరకు కోహ్లీసేన ఒక్కపరుగు తేడాతో గెలిచి ఊపిరిపీల్చుకుంది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ…  ఇప్పటికే తాము కొన్ని మ్యాచ్‌లను తక్కువ పరుగుల తేడాతో ఓడిపోయామని, ఇక చివరి ఓవర్ లో ధోనీ ఆటతీరుతో తామంతా ఒకింత భయపడ్డామని చెప్పుకొచ్చాడు. ధోనీని ఆపేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాని, ఈ మ్యాచ్ తమను అత్యంత భావోద్వేగానికి గురిచేసిందన్నాడు. ఎందుకంటే మేము కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ ఇది. అయితే, 19వ ఓవర్‌ వరకూ మ్యాచ్‌పై పట్టు ఉందనిపించింది.
కానీ, ఆఖరి ఓవర్‌లో ధోనీ బ్యాటింగ్‌తో మమ్మల్ని భయపెట్టాడు. మహీ తన ఐపిఎల్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడాడని కోహ్లీ కొనియాడాడు. ఒక్క రన్ తేడాతో బెంగళూరు వశమైన ఈ మ్యాచ్‌లో చెన్నైను విజయతీరాలకు చేర్చేందుకు ధోనీ చివరి వరకూ ప్రయత్నించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం ఖాయం అనే ఆశను చివరి ఓవర్ వరకూ కలిగించాడు మహేంద్రుడు. చెన్నై విజయానికి చివరి ఓవర్ లో 26 పరుగులు అవసరమయ్యాయి. అయితే, ఉమేష్ యాదవ్‌ వేసిన ఆఖరి ఓవర్ లో 24 పరుగులు రాబట్టిన ధోనీ మొత్తం 48 బంతుల్లో 7సిక్స్‌లు, 5 బౌండరీలతో అజేయంగా 84 పరుగులు చేశాడు. చివరి బంతికి 2 పరుగులు అవసరం… వికెట్లకు దూరంగా విసిరిన చివరి బంతి మిస్ కావడంతో పరుగు తీసే సమయంలో నాన్ స్ట్రైక్ లో ఉన్న శార్దుల్‌ ఠాకూర్‌ రనౌట్‌ అయ్యాడు. దీంతో బెంగళూరు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఇక కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబి ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచుల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.
Virat Kohli says MS Dhoni give us Massive Scare