Home ఎడిటోరియల్ సోషల్ మీడియాలో ఎన్నికల వేడి

సోషల్ మీడియాలో ఎన్నికల వేడి

Virtual election campaigns heat up on social media

 

చరిత్రలో 2019 సార్వత్రిక ఎన్నికలు ఎలా గుర్తుంటాయిని ఆలోచిస్తే, మ్యానిఫెస్టోలు, వాగ్దానాలు, హామీలు, నాయకుల ప్రసంగాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం సాగిన తీరు చరిత్రలో తప్పక నిలిచిపోతుంది. రాజకీయ నాయకులందరికీ ఇప్పుడు సోషల్ మీడియా ముద్దుబిడ్డ అయిపోయింది. సోషల్ మీడియాలో చిత్రవిచిత్ర, ప్రచారాల ద్వారా మెజారిటీ సాధించే ప్రయత్నాలు అందరూ చేశారు. రాజకీయనేతలు ఒకరిపై ఒకరు పోటీపడ్డారు. ఎవరికి ఎంత మంది అనుయాయులున్నారన్నది చర్చనీయాంశం అయ్యింది. తమ సోషల్ మీడియా ఖాతాలో పేర్లను మార్చుతూ ప్రచారం చేసిన వారు మరికొంత మంది. ఉదాహరణకు చౌకీదార్ అనే పదాన్ని తమ పేరుకు ముందు పెట్టుకుని బీజేపీ నేతలు ప్రచారం చేశారు. చిత్రవిచిత్రమైన హ్యాష్ ట్యాగులతో హోరెత్తించారు. ఈ ఎన్నికల్లో ఇంటర్నెట్ ప్రముఖమైన ప్రచారాస్త్రం అయ్యింది. వాట్సప్ కీలకపాత్ర పోషించింది.

ఎన్నికల ప్రక్రియలో భారత ఓటర్లు ఈ సారి నిమగ్నమైనంతగా గతంలో ఎన్నడూ జరగలేదు. ఎన్నికల ప్రచారంలో నాయకుల ప్రసంగాలను షేర్ చేయడం, భారతదేశానికి తర్వాతి ప్రధాని ఎవరనే విషయమై చర్చ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో సాగింది. నిజానికి భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ ఉంది. ప్రధానిని పరోక్ష పద్ధతిలో పార్లమెంటు సభ్యులు ఎన్నుకుంటారు. ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకోవడం జరగదు. అయినా ఈ ఎన్నికల్లో స్థానిక పార్లమెంటు సభ్యుల గురించి చర్చ కన్నా ఎక్కువగా ప్రధాని ఎవరనే చర్చ జరిగింది. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ సర్వే ప్రకారం భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాట్సప్ వాడకందారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2017 తర్వాత ఈ సంఖ్య రెట్టింపయ్యింది. దేశంలో 20 కోట్ల మంది వాట్సప్ వాడేవాళ్ళున్నారు. ప్రపంచంలో వాట్సప్ వినియోగదారుల అతిపెద్ద మార్కెట్ ఇండియా.

ఎన్నికల ప్రచారం రూపురేఖలే మారిపోయాయిప్పుడు. ఇంతకు ముందు అభ్యర్థులు తమ నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం చేసేవారు. బహిరంగసభల్లో మాట్లాడేవారు. కాని సభల్లో హాజరైన వారి సంఖ్య పలచగా ఉంటే అభ్యర్థుల ప్రచారం సరిగా లేదనే విమర్శ వచ్చేది. కాని నేతలకు ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే సభలకు ఎంతమంది హాజరయ్యారనే దానికన్నా ఇప్పుడు ఆన్ లైన్లో ఎంతమంది ఫాలోవర్లున్నారు, ఎన్నిసార్లు షేర్ అవుతున్నాయన్నది చాలా కీలకం. ఆన్ లైన్ లో ప్రజాదరణ ఓట్లుగా మారుతుందని నేతలకు తెలుసు. వాట్సప్ వచ్చిన తర్వాత నాయకులకు ప్రచారంలో చాలా సౌలభ్యం లభించింది.

ఈ సారి ఎన్నికల్లో మహిళల ఓట్లకు ఎంత బలముందో రాజకీయ పార్టీలు గుర్తించాయి. రాజకీయ పార్టీలే కాదు స్వయంగా మహిళా ఓటర్లకు కూడా తమ ఓటు ఎంత బలమైందో పూర్తి అవగాహన ఉంది. ఇంటర్నెట్ రాక ముందు కాలంలో నిర్ణయాత్మక పాత్ర మహిళలు పోషించడం అనేది చాలా తక్కువ. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం ఉండేది కాదు. ఇండ్లలో నిర్ణయాలు కూడా స్వేచ్ఛగా తీసుకునే అవకాశం మహిళలకు ఉండేది కాదు. కాని ఇంటర్నెట్ వచ్చిన తర్వాత చాలా పరిస్థితులు మారిపోయాయి. డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత మహిళా సాధికారతలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఇంట్లో ఉండే గృహిణి అయినా, కార్పోరేట్ ఆఫీసుల్లో పనిచేసే మహిళ అయినా అందరూ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నారు. గతంలో కేవలం ఓటు వేయడానికి మాత్రమే పరిమితమయ్యేవారు. భర్త ఇతర కుటుంబసభ్యుల అభిప్రాయాలకు అనుగుణంగా తమ ఓటుహక్కు కూడా ఉపయోగించుకునేవారు. కాని ఇప్పుడు ఇంటర్నెట్ తర్వాత రాజకీయాలను అవగాహన చేసుకునే అవకాశం మహిళలకు లభించింది. తమ స్వంత నిర్ణయాల ప్రకారం ఇప్పుడు ఓటు వేస్తున్నారు.

కాబట్టి ఇప్పుడు ఓటు వేయడం అనేది కుటుంబం అందరు తీసుకునే నిర్ణయం కాదు. ఎవరి వ్యక్తిగత నిర్ణయం వారిదే. అందువల్ల ఒకే కుటుంబంలో వివిధ పార్టీలకు సమర్థకులు ఇప్పుడున్నారు. ఈ పరిణామాలు రాజకీయ నాయకులపై కూడా ప్రభావం వేస్తున్నాయి. ఉదాహరణకు మహిళలను దృష్టిలో పెట్టుకుని మోడీ ప్రవేశపెట్టిన స్కీములనే చూద్దాం. ఉజ్వల యోజన, బేటీ బచావ్ వగైరా స్కీముల వల్ల ఎంత ప్రయోజనం మహిళలకు కలిగింది? ఎంతవరకు సక్సెస్ అయ్యాయి వంటి ప్రశ్నల కన్నా కీలకమైన విషయం ఈ స్కీముల వల్ల కొంత ప్రయోజనం కొందరికి దక్కింది. ఈ స్కీములన్నీ మహిళలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినవే. అలాగే ఒక పార్టీలో మహిళలను అగ్రనాయకత్వం ఎలా చూస్తుందన్నది కూడా మహిళలు గమనిస్తూనే ఉంటారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక చతుర్వేది కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు చేసి పార్టీ నుంచి తప్పుకున్నారు. ఈ పరిణామం వల్ల కాంగ్రెస్ ఓట్లపై ప్రభావం పడుతుందని చాలా మంది భావిస్తున్నారు.

సోషల్ మీడియా వచ్చిన తర్వాత అభ్యర్థుల ప్రచారంలో సౌలభ్యం ఎంత లభించిందో, ప్రచారం నిర్వహించేవారిపై ఒత్తిడి కూడా అంత పెరిగింది. ఎందుకటే ప్రతిమాట కొత్త కొత్తగా చెప్పాలి. క్రియేటివ్ కంటెంట్ అందించాలి. ఈ క్రమంలో చాలా వినోదాత్మకమైన పోస్టులు, మెమెలు వచ్చాయి. ఈ క్రమంలో ర్యాప్ పాటలు కూడా వచ్చాయి. ఒకవైపు పాతతరం సమర్థకులను కాపాడుకుంటూ, మరోవైపు కొత్తతరం సమర్థకులను కూడగట్టుకోడానికి సోషల్ మీడియాలో కంటెంట్ రైటర్ల నిజంగానే చాలా శ్రమించవలసి వచ్చింది. రాజకీయ సృజనాత్మక ప్రచారంలో భాగంగానే కొత్త కొత్త పేర్లు సృష్టించడం మొదలైంది. ఫేకూ, పప్పూ, చాయ్ వాలా, చౌకీదార్ చోర్ లాంటి పదాలన్నీ ఈ క్రమంలో పుట్టినవే. చివరకు నిత్యజీవితంలో మాట్లాడే భాషలో కూడా ఇవి భాగాలవుతాయి. వాట్సప్ ఇలాటి వ్యంగ్యాస్త్రాలు కూడా మెమెల రూపంలో పంపిణీ అవుతున్నాయి. అయితే ప్రభుత్వాలు కన్నెర్రజేస్తే అరెస్టయి జైలు పాలు కావలసి వస్తుంది. ఇటీవల పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై దాడి చేస్తూ వ్యంగ్యంగా, హాస్యంగా ఒక మెమె ప్రచారంలో పెట్టినందుకు బీజేపీ కార్యకర్తలు అరెస్టయ్యారు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి.

ఏది ఏమైనా ఈ సారి ఎన్నికల్లో వాట్సప్, ఫేస్బుక్, ట్విటర్ లలో జరిగినంత ప్రచారం బహిరంగ సభల్లో కూడా జరగలేదు. భారతదేశంలో రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల ప్రభావం మరింత పెరగవచ్చని పలువరు విశ్లేషిస్తున్నారు. కాని అబద్దపు వార్తలు, ఫేక్ వార్తలు ప్రచారంలో పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్న సామాజికమాధ్యమాల ప్రభావం పెరగడం వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం కూడా పెరుగుతుందని కొందరు విమర్శిస్తున్నారు.

Virtual election campaigns heat up on social media