Home వార్తలు చెన్నపట్నం చూడర బాబు..

చెన్నపట్నం చూడర బాబు..

chennai1మద్రాసుగా పిలువబడే చెన్నై నగరాన్ని ఒకప్పుడు చెన్నపట్నం అని కూడా పిలిచేవారు. తమిళ రాష్ట్ర రాజధాని చెన్నై దేశంలో నేడు నాలుగవ అతిపెద్ద నగరం. చెన్నై నగరానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా నివసిస్తున్న నగరాల్లో ఇది 36వ నగరం. విదేశీ టూరిస్టులు అధికంగా సందర్శించే నగరాల్లో చెన్నై ప్రపంచంలో 47వ నగరం. భారతదేశానికి వచ్చే హెల్త్ టూరిస్టుల్లో 45 శాతం చెన్నైకే వస్తారు. భారతదేశంలో కూడా వైద్యసేవలకు 30 నుంచి 40 శాతం ప్రజలు చెన్నై నగరానికే వెళతారు. చెన్నై నగర చరిత్ర చాలా ఆసక్తికరమైనది.
పెదవెంకట రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న కాలంలో దామర్ల వెంకటపతి నాయకుడు ఈ ప్రాంతం పాలకుడు. విజయనగర సామ్రాజ్యంలో ఆయన సైన్యాధ్యక్షుడు కూడా. 1639 ఆగష్టు 8వ తేదీ నాటి అమ్మకపు పత్రాల ప్రకారం విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఇక్కడి భూమిని బ్రిటీషు ఈస్ట్ ఇండియా కంపెనీ కొనుగోలు చేసింది. దామర్ల వెంకటపతి నాయకుడి తండ్రి దామర్ల చెన్నప్ప నాయకుడి పేరుమీద ఈ ప్రాంతానికి చెన్నపట్నంగా పేరు పెట్టడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్ డే కు ఈ భూమిని నిజానికి దామర్ల వెంకటపతి నాయకుడు బహుమతిగా ఇచ్చాడని కూడా అంటారు. ఏమైనా ఆయన తండ్రి పేరుతో ఈ ప్రాంతానికి చెన్నపట్నం అన్న పేరు వచ్చింది. దామర్ల చెన్నప్ప నాయకుడు తెలుగువాడు. విజయనగర సామ్రాజ్యం తెలుగు సామ్రాజ్యం. చెన్నై అన్న పేరు తెలుగు నుంచి వచ్చింది. మద్రాసు అన్న పేరు తమిళం నుంచి వచ్చిన పేరుగా చాలా మంది విశ్లేషించారు. సెయింట్ జార్జి ఫోర్ట్ కు ఉత్తరాన మద్రాస్ పట్టినం అనే పల్లె పేరు తర్వాత మద్రాసుగా మారిందని కొందరంటారు.
అప్పట్లో వెంకటపతి నాయకుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్ డేకు ఇచ్చిన భూమి ఒక ఇసుక పర్ర మాత్రమే. ఫ్రాన్సిస్ డే ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి భూమి కోసం చూస్తున్నప్పుడు వెంకటపతి నాయకుడు ఈ భూమి ఇచ్చాడు. ఫ్రాన్సిస్ పెట్టాలనుకున్న ఫ్యాక్టరీ చవుకగా కాటన్ వస్త్రాలు తయారు చేసే ఫ్యాక్టరీ. అప్పుడక్కడ కొన్ని బేస్త పల్లెలు ఉండేవి. నేడు తొంభై లక్షల జనాభాతో అతిపెద్ద నగరంగా మారింది. వెంకటపతి నాయకుడు ఇచ్చిన ఐదు బేస్త పల్లెలు నేడు అతిపెద్ద నగరంగా మారాయి.
చెన్నై నగరం ఎంత ఆధునికమైనదో అంతే ప్రాచీనచరిత్ర కూడా కలిగిన నగరం. పల్లవరంలో రాతియుగం నాటి పనిముట్లు దొరికాయి. మైలాపుర్ లో ప్రముఖ కవి తిరువళ్లూరు జీవించాడు. బంగాళాఖాతం అలలు చెన్నై నగరాన్ని ఇతర ఖండాలతో కలుపుతున్నాయి. విభిన్న దేశాల ప్రజలు, భిన్న మతాల వారు ఇక్కడ కలగలిసిపోయారు. ప్రారంభంలో చెన్నై నగరం విస్తరణకు ముఖ్య కారణం వాణిజ్యం. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వచ్చారు. బ్రిటీషు, పోర్చుగ్రీసు ఇతర యూరోపియన్లకు కూడలిగా ఈ ప్రాంతం మారింది. ఆర్మేనియా వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చేవారు. భిన్న పూలవనంలా ఈ ప్రాంతం కళకళలాడడం ప్రారంభమైంది. మత సుహృద్భావానికి చిహ్నంగా చెన్నై మారింది. ఆలయాలకు నిలయమైన మైలాపూరుకు దగ్గరలోనే సెయింట్ థామస్ చర్చి ఉంది. క్రీస్తు శిష్యులకు చెందిన చిహ్నాలు ఇక్కడ ఉన్నాయని నమ్ముతారు. కపిలేశ్వర ఆలయ చెరువుకు చెందిన భూమిని అర్కాటు నవాబు బహూకరించాడు. విభిన్న మతసముదాయాల మధ్య సుహృద్భావాన్ని తెలిపే ఇలాంటి ఎన్నో నిదర్శనాలు మనకు చెన్నైలో కనిపిస్తాయి.
చెన్నై నగరానికి ప్రపంచదేశాలతో ఉన్న సంబంధాలు నేడు కూడా కనిపిస్తాయి. ఫోర్డ్ కంపెనీలో అమెరికన్లు, హ్యుండాయ్ కంపెనీలో కొరియన్లు, హోండాలో జపనీయులు చెన్నై ఆటోమొబైల్ పరిశ్రమకు మారుపేరుగా మారింది. వైద్య సేవలకు చెన్నై పేరే ప్రపంచంలో వినిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది వైద్యసేవల కోసం ముఖ్యంగా మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాల నుంచి అనేకమంది చెన్నై వస్తుంటారు.
పల్లవ రాజు మహేంద్రవర్మ కాలంలో మహాబలిపురం కట్టారు. క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నాటి నాణేలు కూడా చుట్టుపక్కలా దొరికాయి. మధ్యయుగాల కాలంలో విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. పోర్చుగ్రీసువారు 1522లోనే ఇక్కడికి వచ్చారు. క్రీస్తు శకం 52 నుంచి 70 వరకు సెయింట్ థామస్ ఇక్కడ మతప్రచారం చేశారని చెబుతారు. పోర్చుగ్రీసు వారు ఇక్కడ సావో టోమ్ పోర్టు కట్టారు. 1612లో డచ్ వారు వచ్చారు. చెన్నైకి ఉత్తరాన పులికాట్ వద్ద డచ్ వారు నివసించారు. ఆగష్టు 22, 1639లో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్ డే కోరమండల్ తీరాన మూడు మైళ్ళ పొడవైన భూభాగాన్ని కొనుగోలు చేశాడు. ఈ తేదీ మద్రాసు డేగా పిలువబడుతుంది. ఇక్కడ కోట కట్టుకోడానికి ఫ్యాక్టరీ, గోడౌన్లు కంపెనీ అనుమతులు పొందింది. అప్పుడు కంపెనీ కట్టిన కోటే సెయింట్ జార్జి ఫోర్ట్. భారతదేశంలో మొట్టమొదటి అతిపెద్ద ఇంగ్లీషు సెటిల్ మెంట్ అదే. 1640 ఏప్రిల్ 23 నాటికి ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆ కోటకు చుట్టు క్రమేణా చెన్నై పట్టణం విస్తరించింది. అప్పట్లో దీన్ని జార్జి టౌన్ అనేవారు. స్వతంత్రానికి ముందు తమిళనాడు అసెంబ్లీ ఈ కోటలోనే పనిచేసేది. 2010లో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించారు. కాని ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీని కోటకే తరలించారు. 1746లో ఫ్రెంచ్ వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. 1749లో మళ్ళీ బ్రిటీషువారు ఈ ప్రాంతం తమ అధీనంలోకి తెచ్చుకోగలిగారు. మైసూరుకు చెందిన హైదర్ అలీ నుంచి కూడా బ్రిటీషు వారు పెద్ద సవాలును ఎదుర్కోవలసి వచ్చింది. చివరకు 18వ శతాబ్ధం చివరి నాటికి బ్రిటీషువారు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఆంధ్ర, కర్నాటక ప్రాంతాలన్నీ వశపరచుకున్న బ్రిటీషు పాలకులు మద్రాస్ ప్రెసిడెన్సీ ఏర్పాటు చేశారు. క్రమేణా చెన్నై నగరం అతిముఖ్యమైన నౌకాకేంద్రమైంది. దక్షిణభారతదేశంలో బ్రిటీషువారి కీలక నగరమైంది. 19వ శతాబ్ధంలో రైల్వే ప్రవేశపెట్టిన తర్వాత ముంబయి, కలకత్తా తదితర నగరాలతో రాకపోకలు పెరగడంతో పాటు చెన్నై నగరం అతిత్వరగా విస్తరించడం కూడా ఎక్కువైంది. మొదటి ప్రపంచయుద్ధంలో దాడికి గురైన ఒకే ఒక్క భారత నగరం చెన్నై. 1914 సెప్టెంబరు 22వ తేదీన జర్మనీ నౌకాదళం దాడి చేసింది. 1947లో భారత స్వతంత్రం తర్వాత మద్రాసు రాష్ట్రానికి రాజధానిగా మారింది. 1969లో ఈ రాష్ట్రం పేరు తమిళనాడుగా మార్చారు.
చెన్నై నగరానికి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజల రాకపోకలు సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్నాయి. ప్రాచీన చరిత్రతో పాటు ఆధునిక నాగరికత చెన్నై నగరానికి ప్రత్యేకతను కట్టబెట్టింది.
సెయింట్ జార్జి కోటకు చుట్టు 100 ఎకరాలకు ఆవల నగరం విస్తరించడంలో అనేక ఊళ్ళను పల్లెలను తనలో కలుపుకుంది. ఈ ఊళ్ళు, పల్లెల చరిత్ర అనేక శతాబ్ధాల పురాతన చరిత్ర. అందువల్లనే చెన్నైలో ఆధునికత, ప్రాచీన సంప్రదాయాలు ఒకదాని పక్క ఒకటి కనిపిస్తాయి. ఆడయార్ ప్రాంతం చెన్నైలో భాగమే అయినా అడయార్ ప్రాంతానికి దాని చరిత్ర దానికి ఉంది. ఈ ప్రాంతంలోని పర్యావరణం, భౌగోళిక విశేషాలు చెన్నైలోని మిగిలిన ప్రాంతాలకు విభిన్నంగానే కనబడతాయి. అడయార్ నది సముద్రంలో కలిసే ముఖద్వారం వద్ద చాలా విశాలంగా ఉంటుంది. దీనికి ఒకవైపు ఒడ్డున నారిమన్ పాయింట్, అత్యాధునికమైన ఎత్తయిన భవనాలతో కళకళలాడుతోంది. అటువైపు ఒడ్డున థియోసాఫికల్ సొసైటీకి చెందిన దట్టమైన చెట్లతో కూడిన ప్రశాంత వాతావరణం. పాత చెన్నపట్నం, కొత్త చెన్నై రెండింటి కలయికను సూచించే దృశ్యమిది.
చెన్నపట్నంగా తెలుగువారికి సుపరిచితమైన ఈ నగరం అధికారికంగా మద్రాసు నగరంగానే పిలువబడేది. 400 సంవత్సరాల చరిత్ర ఉన్న మద్రాసు నగరం పేరును 1996లో చెన్నైగా మార్చారు.

సబ