Thursday, April 25, 2024

వేయి పడగలు-మరపురాని చిన్ని పాత్రలు

- Advertisement -
- Advertisement -

Viswanatha Satyanarayana Navalas

 

కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు వ్రాసిన ఏభై ఎనిమిది నవలలలో వేయి పడగల నుంచి కుక్క గొడుగులు వరకుగల ముప్ఫై నాలుగు నవలలు ఒక విభాగం. దిండు క్రింద పోకచెక్క నుంచి దూత మేఘం వరకుగల ఆరు నవలలు నేపాళరాజవంశానికి చెందిన కథలు గలవి. కవలలు నుంచి భ్రమరవాసిని వరకుగల ఆరును కాశ్మీరరాజవంశానికి చెందిన ఇతి వృత్తాలుగలవి. ధూమరేఖ నుంచి నివేదిత వరకుగల పండ్రెండును పురాణవైర గ్రంథమాలకు చెందినవి. వీటి అన్నింటిలో ఏకవీర, తెరచిరాజు, చెలియలికట్ట, బద్దన్న సేనాని, చందవోలురాణి మున్నగువాటిలో వేయి పడలు అగ్రగణ్యం. వాసిలోను రాశిలోను సర్వోత్తమం. అది ఒకనాటి తెలుగువారి సమగ్ర చరిత్ర. ప్రాతక్రొత్తల మేలికలయికకు ప్రతిబింబం. విశ్వనాథవారు ప్రాతను సమర్థించి క్రొత్తను అందుగల అనౌచిత్యాన్ని ఎత్తిచూపి ఆ సంధికాలాన్ని కన్నులకు కట్టినట్లు చూపారు.

ఇందులో రామేశ్వర శాస్త్రి, ధర్మారావు, జమీందార్ కృష్ణమనాయుడు, వారి కుమారుడు రంగారావు, ఆయన దివాన్ నాగేశ్వరరావు, దొరసానులు రుక్మిణమ్మారావు, సరోజినీదేవులు, ధర్మారావు తల్లి సావిత్రమ్మ, భార్య అరుంధతి, ఆయన స్నేహితులు కిరీటి, రాఘవరావు, సూర్యపతి, పశుపతి, వారి భార్యలు, దేవదాసి గిరిక, ఆమె తల్లి రత్నగిరి, మేనమామ కబీరు, గణాచారి, పసిరిక, రామేశ్వరశాస్త్రి పెద్ద భార్య క్షత్రియ కాంత రంగాజమ్మ, రాణిగారి బంధువు రామేశ్వరం, ఉపాధ్యాయుడు జ్యోస్యులు, ఆతడి భార్య మంగమ్మ, మున్సిపల్ ఛైర్మన్ చంద్రారెడ్డి మొదలైనవారు ఎందరో పెద్దలు, పిన్నలు పాత్రలు. కొందరు ఉన్నతులు. కొందరు అధములు. వీరందరిలో చిన్నవారైన ముగ్గురు వ్యక్తుల్ని గూర్చి, ఒక జంతువుగూర్చి ప్రస్తుతం చెబుతాను. వారు చిన్నవారేకాదు చిన్నివారు కూడా. వారే వీరు. గోపన్న, నాయర్, అసిరి, లక్ష్మణస్వామి.

గోపన్న : ఇతడు కోటలోని పనివాడు. అరువదేండ్ల వయసువాడు. ముప్పదేండ్లకు పూర్వమొకసారి రాణిగారి హారం సంగ్రహించాడు. రాణిగారు స్నానం చేస్తూ మెడలోని హారాన్ని తీసి స్నానాల గదిలోని వంకెకు తగిలించి మర్చిపోయినారు. అది యీతని కంటబడింది. ఆశ పుట్టింది. బుద్ధి ఓడి మనసు గెలిచి తీసుకున్నాడు. తర్వాత విచారణలో దొంగ దొరికాడు. ప్రభువు కృష్ణమనాయుడు కోటనుంచి వెడలగొట్టాడు. వాడు దివాను రామేశ్వరశాస్త్రిగార్ని ఆశ్రయించాడు. ఆయన మందలించి మరల కోటలో చేర్చాడు. పశ్చాత్తాపం ఆ నేరాన్ని తుడిచివైచింది. మహోదారుడైన కృష్ణమనాయుడును చేరదీశాడు. అప్పటి నుంచి శాస్త్రిగారి యెడల, ప్రభువు ఎడల ఎంతో గౌరవం. భక్తి. కృతజ్ఞత. శాస్త్రిగారివలన మంచి మాటలు విన్నాడు. ==కృష్ణమనాయుడు పెద్దవాడైన తర్వాత గోపన్నమీద అనురాగం అధికమయ్యింది. పురాణకథలు, భక్తిమాటలు ఆయనకు కూడా చెప్పుతుండేవాడు. అది తాత్కాలికమే అయినది. రాజు, దివాను ప్రాజ్ఞులవ్వడంచేత వాడు చెడలేదు. మరల కోట చేరకుంటే దొంగగా కొనసాగెడివాడేమో! అనంతరం రామేశ్వరశాస్త్రికి జమీందారుకు ఎందుకో దూరం పెరిగింది. తర్వాత శాస్త్రి కూడా మరణించాడు. ధర్మారావు కడు బీదవాడయ్యాడు. అప్పులు బాధింపదొడిగాయి.

జమీందారు గారి పనులన్నియు ఆతడే చేసేవాడు. “ఒకనాడు ధర్మారావు, శాస్త్రిగారి కుమారుడు తనదగ్గరకు వచ్చాడని, ఒక ఉత్తరం మీకివ్వమని చెప్పి ఇచ్చాడని, మరల మసటిరోజు తెల్లవారగానే వచ్చి ఉత్తరాన్ని తీసుకుని చించివేశాడని, కారణమడుగగా అభిమానగాథ విన్పించాడని గోపన్న నాయుడు గార్కి చెప్పాడు. అదీ ఆయన స్నానం చేసిన తర్వాత తిలకం దిద్దుతూ. “ఎంతవారికెంత ఇక్కట్టు వచ్చినది. ఇంగువకట్టిన గుడ్డవాసన ఎక్కడికి పోవును. పులికడుపున లేడి పుట్టునా? వారి వంశంలో తక్కువవాడేల పుట్టునని” బాధపడ్డాడు. శాస్త్రి అవసానకాలంలో నిర్ధనుడై మిక్కిలి క్రుంగిపోయాడు. ఆయన మరణం తర్వాత ధర్మారావు చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పుల బాధ అధికమయ్యింది. ఆశ్రితులే వేధింపజొచ్చారు. “అవును. పాపము శాస్త్రిగారేమియు దుర్వయము చేసిరా. అడుగనివానిది పాపము. అట్లిచ్చిరి. ఆయన సొమ్ము తిన్నవారే ఆయనకు చేదైరి. త్రాగిన రొమ్ము గ్రుద్దుట ఇదియే గదా! నాగన్నసెట్టి శాస్త్రిగారి సొమ్మెరుగడు.

శ్రీరాములు అసలే ఎరుగడు. అందరూ కలిసి వారిని బాధించుచున్నారు”. భోజనం తినడం పూర్తి అయింది. “తమరు ధర్మారావుగారికేదో దారి చూపింపకపోయినచో ఆ కుఱ్ఱాయన ఏమగునో! ఆయన చెడిపోవుట మనకు మాత్రము క్షేమమా? మీరు, వారు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, గణాచారి మీరందరూ ఒకటేనని జనము చెప్పుకొందురు. మీలో ఒకరు చెడినచో మరొకరికి క్షేమమా? మీరు సహాయం చేయడం భగవంతుడికి కూడ ఇష్టం” ఇంతవరకూ ప్రభువు వింటున్నాడేగాని మాట్లాడలేదు. తర్వాత ఆయన తూగుటుయ్యాల మీద పండుకున్నాడు. గోపన్న ఊపుతున్నాడు. అపుడు ప్రభువుకు మనసు ఊగి “గోపా! ధర్మయ్య చాల అందమైనవాడురా” అన్నాడు. “అందమేమిటి బాబుగారు! ఆయన మొగముచూచినచో నిత్య మల్లెలు రెక్కలు విరిసినట్లుండును. నాకు మాత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ఈయనగా అవతరించెననిపించును. ఆ బక్కపలుచని మనిషి. నిగనిగలాడు శరీరము. కోసలైన కన్నులు. తెలివికొట్టవచ్చినట్లుండు మొగము. అందమనగా ఆయనదే అందము. ఏమయిననేమి? సముద్రాలెండిపోయి చెరువులయినట్లు నేటికి పరిస్థితి యిట్లు వచ్చినది. ఒకరికి పెట్టినవారేగాని లేదన్నవారుగా దు” గోపన్న గీతోపదేశం ప్రభువును కార్యోన్ముఖుడిని చేసింది.

ఋణదాతలందరిని పిలిపించి ఉన్న ఆస్తినంతయు అందరకు పంచి రిజిష్టరు చేయించ నిర్ణయించాడు. ఇది ప్రభువు పూనుకొనకున్న కాదు. ధర్మారావు ఇది అంతా గోపన్నపని అని గ్రహించాడు. మనసు కృతజ్ఞతాభరితమయ్యింది. తన ఉత్తరం ఇంతపని చేయదని భావించాడు. గోపన్న ఇంటికి వెళ్లి కృతజ్ఞత ప్రకటించాడు. “అయ్యా! మీరు గొప్ప యింటి బిడ్డలు. నన్ను గురించి యట్లనరాదు. నేను మీకేమైనను చేసినచో మీ నాయనగారు నాకు చేసినదానిలో నిదియేమూల” అన్నాడు. ధర్మారావు అప్పులు తీరాయి. ఇల్లుకూడ మరల కొని నిలిపాడు ప్రభువు. ప్రభువు ఆయనను అధికముగా అభిమానింపదొడగాడు. నెలబెత్తెం కోటనుంచి వెళ్లుతున్నది. ఇద్దరు కలిసి దేవాలయానికి వెళ్లడం, తోటకు వెళ్లడం పెరిగింది. ప్రభువు ధర్మారావుల ఆనుకుల్యానికి పొంగిన హృదయం కేరింతలవి. ఇంతలో పాఠశాలలు తెరవడం ధర్మారావు బందరుపోవడం, సెలవలకు రావడం ప్రభువుతో పురాణ కాలక్షేపంతో గడపడం జరుగుతున్నది. నాల్గు సంవత్సరాలు గడిచాయి. అప్పటికి ధర్మారావు బి.ఏ. మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కృష్ణమనాయుడిగారి మరణం ఆయన్ని మిక్కిలి బాధించింది. ప్రభువు మరణానికి విచలించి గోపన్న పిచ్చివాడై ఎక్కడికో వెళ్లిపోయాడు. అంతటి అనుబంధమ ది. విధికి కన్నుగుట్టింది. తన ప్రభువులేనిచోట ఉండలేకపోయాడు.

గోపన్న ఉత్తరభారతానికి పోయి గోసాయులలో కలిసిపోయాడు. ఇరవై సంవత్సరాలు తిరిగాయి. జబ్బు ముదిరింది. త్వరలో చనిపోగలనని భావించాడు. పుట్టినగడ్డపై, తన ప్రభువు మృతి చెందిన గడ్డపై చావడానికి తిరిగి వచ్చాడు. ధర్మారావు గుర్తించాడు. సంతోషించా డు. జమీందారు రంగారావు ఆదరించాడు. చిన్న జమీందారు హరప్పనాయుడు తమ తాతగారి సేవకుడని గుర్తించి కోటలోనే ఉండమన్నాడు. కోట అంతా తిరిగి చూశాడు. ఎంతో మారింది. శిథిలావస్థలో ఉంది. ఊరంతా మారింది. పెరిగింది. అయితే జీవంలేని మార్పది. పెరుగుదలది. ఊరును గుర్తింపలేకపోయాడు. “నల్లనివాడు… పద్యాన్ని ధర్మారావుతో చదివి విన్పించుకున్నాడు. స్వామిని దర్శించుకున్నాడు. ఆ రాత్రికే ఆ మట్టిలో ఆ కోటలోనే కలిసిపోయాడు. అది పురిటిగడ్డపైగల మమకారం. ఆదరించినవారిపై అభిమానం. రామేశ్వరశాస్త్రిగారెందర్ని ఆదుకోలేదు. వారే చివరకు వేధించారు. దాసీవాడికున్నంత కృతజ్ఞతవారికి లేదు. గోపన్నలాంటివాడు నూటికి ఒక్కడున్నా దూరమైన మనసులు దగ్గరై సుఖిస్తాయి.

నాయర్ : కృష్ణమనాయుడు చనిపోయిన తర్వాత ఆయన భార్య రుక్మిణమ్మారావు ధర్మారావును అభిమానింపజొచ్చారు. ఆమె ధన సహాయంతోనే ధర్మారావు గుంటూరులో బి.ఏ. చదువుతున్నాడు. అకస్మాత్తుగా ధనం రావడం ఆగిపోయింది. ఇంతలో కలరా వచ్చింది. అది ఉపశమించిన తర్వాత ధర్మారావు సుబ్బన్నపేటకు పోయి రావాలనుకున్నాడు. రెండు రూపాయలు కావాలి. నాయర్ని అడగడానికి ప్రయత్నించి అడగలేక ఇంటికి తిరిగి వచ్చాడు.

నాయర్ కిళ్లీకొట్టు యజమాని. ముఫైయేండ్ల వయసువాడు. మళయాళీ జాతివాడు. సోడాలు, సిగరెట్లు, పొగాకు చుట్టలు అమ్ముతాడు. అవివాహితుడు. ఆంజనేయస్వామి భక్తుడు. విభూతి ధరిస్తాడు. దుకాణం తీయగానే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వస్తాడు. ఆతడికి ఒక కాణి డబ్బిచ్చిగాని అమ్మకం ప్రారంభించడు. అదో నమ్మకం. రాత్రి పదిగంటలవరకూ అమ్ముతాడు. ఎక్కువగా విద్యార్థులు వస్తారు. కాతా పుస్తకం ఉంటుంది. పదుగురు డబ్బు ఎగ్గొట్తారు. ఎవ్వరిని ఏమీ అనడు. ఇచ్చినవారి దగ్గర తీసుకుంటాడు. అప్పు పెరిగిన తర్వాత కొందరు అక్కడికి రానేరారు. అది వారి భయం. వచ్చినా వారిని అడగడు. కొందరు విద్యార్థులు చేబదుళ్లు తీసుకుంటారు. కొందరు తిరిగి ఇస్తారు. కొందరివ్వరు. ఉత్తములు కొందరు ఈ విధమైతే నీకెలాగని అడిగితే ఇలా బదులిస్తాడు. “నాదొక పొట్ట. నాకు నెలకు అయిదు రూపాయలు చాలు. ప్రొద్దున ఇంత అన్నము. రాత్రికొక గోధుమరొట్టె. ప్రొద్దున ఒక గిన్నెడు కాఫీ” చాలామంది పిచ్చివాడంటారు. మరి చాలమంది పరమయోగ్యుడంటారు. ఎవ్వరేమన్నా ఆతడు సుస్థిరుడు. ఒక చిన్నకవి ఇరవై రూపాయలివ్వాలి. సిగరెట్ల కర్చు. ఇంతలో పెండ్లి జరిగింది. భారం పెరిగింది. డబ్బీయలేదు. సంసారం చల్లగుండి ఒక కొడుకు ఆయనకు పుట్టిన చాలన్నాడట. అంతటి ఔదార్యం.

సాయంకాలం ఆంజనేయస్వామి గుడికి వెళతాడుగదా! అపుడు దుకాణం మూయడు. ఎవరో కూర్చుని అమ్ముతారు. గల్లాలో పడిందే దక్కుదల. బాకీవారు నీకెంత ఇవ్వాలో చెప్పమంటారు. నాకు గుర్తులేదు. మీకు గుర్తున్నంతవరకు ఇవ్వమంటాడు. చాల వరకు తక్కువే ముట్టుతుంది. ఎప్పుడైనా అరుదుగా ఎక్కువ వస్తుంది. కొందరు అతడిని యోగాభ్యాసి అంటారు. రాత్రి రెండు గంటల వరకూ ఏదో జపం చేస్తాడంటారు. ఎవరికి నిజం మాత్రం తెలియదు. వస్తాదులాగా ఉంటాడు. ముక్కు చీదిందిలేదు. పెండ్లి అంటే భయమట. సంసారం దాటరాని సాగరమేనట. ఇపుడు హాయిగా ఉన్నాను ఆ గుదిబండి పడితే దురాశ పుట్టుతుంది. దొంగవేషాలు కలుగుతాయి. ఇపుడు రూపాయికి పావలా లాభం చాలు. అపుడు రూపాయికి రూపాయి కావాలి. పొగత్రాగడు. సోడా త్రాగడు. తమలపాకు నమలడు. ఎంత చలిలోనూ చొక్కా తొడగడు. నిజముగా ఆతడో యోగి. ప్రతిదినం రాత్రిపూట ఎనిమిది గంటలకు ఇద్దరు ముసలివారు వస్తారు. ఒకడు యాదవుడు. మరొకడు కాపువాడు. ఇద్దరూ బీదవారే. ఇద్దరూ నాయరుతో వేదాంతం మాట్లాడి చుట్టలు త్రాగి, సోడాలు త్రాగి వక్కపొడి నమిలి వెళతారు.

ఎవ్వరైనా చనిపోతే పాడి పట్టడానికి సిద్ధంగా ఉంటాడు. అది పుణ్యమట. తాను రేపు చచ్చిపోతే పడవేసే వారుండాలిగదా అంటాడు. ఆరోజంతా ఉపవాసముండి రాత్రి నక్షత్రదర్శనం చేసి భుజిస్తాడు. మొన్న కలరా వ్యాపించినపుడు నాయర్ శివమెత్తి పనిచేశాడు. విద్యార్థులకు స్కూలు ఫీజులు కూడా కడతాడని చెప్పడం ఉంది. ఇంతటి యోగ్యుడుని కూడా ధర్మారావు అప్పు అడగలేక తిరిగి వచ్చాడు. “యచ్ఞా మోఘా వరమధిగుణే నాధమే లబ్ధకామా” అని కాళిదాసుమాటకదా!

అర్ధరాత్రానికి ఇల్లు వెతుక్కుని నాయరువచ్చి ధర్మారావు తలుపు తట్టాడు. రెండు రూపాయలిచ్చి వెళ్లాడు. ఆరోజుకు గల్లాలో అవే మిగిలాయట. చాలునా అన్నాడు. ధర్మారావు వినయవినమ్రుడైనాడు. ఇచ్చుట ఉచ్చైశ్శ్రవం. పుచ్చుకొనుట ఊరగాడిద. అడుగవలసి, చేయిసాచవలసివచ్చి శ్రీహరి వామనుడైనాడట. ధర్మారావు సుబ్బన్నపేటకు పోయి తిరిగివచ్చి వెంటనే నాయర్ దుకాణానికి వెళ్లాడు. అది మూసి ఉన్నది. ప్రక్కషాపువాడిని అడిగాడు. ఆతడు, నాయర్ రామేశ్వరం తీర్థయాత్రకు వెళ్లాడని చెప్పాడు. రెండు నెలలలో రావచ్చునట. ఎపుడు రెండువందల రూపాయలు చేతిలో మిగులుతాయో అపుడల్లా యాత్రలకు వెళతాడట. కేరళరాజ్యంలో ముందుగానే సామ్యవాదం ప్రబలింది. అట్టి సామ్యవాదానికి నిలువెత్తు నిదర్శనం మన నాయర్. రూపాయికి నాలుగు రూపాయలు సంపాదించే నేటి అక్రమ వ్యాపారులకు కనువిప్పు నాయర్ వ్యక్తిత్వం.

లక్ష్మణస్వామి : ఇతడు మానవుడు కాడు. ఒక గజరాజు. కృతజ్ఞతగల జంతువు. స్వామిభక్తిగల జంతువు. అది కృష్ణమనాయకుడి పట్టపుటేనుగు. నాయుడు దానినెక్కి దేవేంద్ర వైభవుడయి తిరిగాడు. అదియు తాను ఐరావతమనుకొన్నది. అంత ఠీవిగా బ్రతికింది. ఎనభైయేండ్లు బ్రతికింది. అంతకాలం బ్రతికిన ఏనుగులు లేవట. కృష్ణమనాయుడుగారు ఏభైవేల రూపాయలతో ఒక కాశ్మీరి ఏనుగును కొన్నారు. అది పదిమంది మావటీండ్రను లెక్కచేయక తప్పించుకుని అరణ్యంలోనికి వెళ్లింది. ప్రభువు లక్ష్మణస్వామినెక్కి అరణ్యానికి వెళ్లి, లక్ష్మణస్వామి సహాయంతో దానిని లొంగదీసుకుని తీసుకువచ్చాడు.
నాయుడుగారు చనిపోయిన దగ్గరనుంచి రంగారావుగారి పట్టాభిషేకవార్త విన్నంతవరకూ నీరు త్రాగలేదు. రావి ఆకు తినలేదు. నల్లమందు తినలేదు. రావిచెట్టుక్రింద నిలచి తపస్సు చేసింది. పట్టాభిషేకానికై తన చిన్నదొర మద్రాసు నుంచి వస్తున్నాడన్న రోజున నీరు త్రాగింది. మేత మేసింది. దొడ్డి అంతా పరవళ్లు త్రొక్కింది. మావటివాడు దాని హృదయమెరిగినవాడు. ఏభైయేండ్ల సహవాసం మరి. లక్ష్మణస్వామి తన చిన్నదొరను ఎక్కించుకోవడానికై ఎదురుచూస్తున్నది.

ప్రభువుకారు రావడం కన్పించింది. కూత విన్పించింది. లక్ష్మణస్వామి దారిదొలగలేదు. కారుదిగి తనను అధిరోహించమని దాని భావం. రంగారావు మావటీని మందలించాడు. నాల్గు నెలల నుండి నీరు ముట్టని మేత తినని స్వామి ఈనాడు ఈ వార్త విని లేచి పరవళ్లు త్రొక్కినది. అంబారి వేయనిచో పిచ్చెక్కిపోతుంది. అందుకే అంబారి వేసి తీసుకువచ్చానన్నాడు. రాజు కారును దారి తప్పించి ముందకు సాగాడు. తనను అధిరోహించలేదన్న తీవ్ర ఆవేదనతో స్వామి ఘీంకరించి మెలికలు తిరిగి క్రిందబడి మరణించింది. గరుత్మంతుడు పట్టిన గజకచ్ఛపాలలోని గజములాగా బాధను అనుభవించింది. మావటీడు దానిపైబడి దుఃఖించాడు. ప్రొద్దుకూకిన పిదప హౌదా త్రాళ్లు పీకి, అంకుశం చేతబూని మావటీడుకోటకు చేరాడు. పెద్దకుమారుని దహన సంస్కారం చేసి వచ్చే తండ్రిలాగున్నాడట. దారికి ప్రక్కనగల భూమిలో స్వామిని మరుసటి రోజు పాతిపెట్టారు. పెద్దలు ఏనుగు చావు అపశకునమన్నారట. పిన్నలు పిచ్చిమాటలన్నారట. మావటీడు మాత్రం మంచమెక్కి విపరీతమైన జ్వరంతో మూడో రోజున మృతి చెందాడు. స్వామి తన తొం డంతో మావటీని లాగి పట్టి తనతో తీసుకుపోయింది. అనుబం ధం పెరిగితే యజమానులకు, పోషకులకు జంతువు లు బిడ్డ లే. వాటికై వీరు, వారికై అవి ప్రాణాలు వదలడం చూ స్తూనే ఉన్నాం. వేణుగోపాస్వామివారి కల్యాణోత్సవానికి హరప్పనాయుడు రాజబంధువులు అద్దె ఏనుగుమీద, గుఱ్ఱాలమీద వస్తూ ఉంటే లక్ష్మణస్వామి సమాధి అయిన దగ్గర విఘ్నమొచ్చింది. అపుడు ధర్మారావు ఆ అద్దె ఏనుగుకు లక్ష్మణస్వామి అని పేరుపెట్టి, దాని ఆత్మను శాంతింపజేసి ముందుకు సాగాడు.

అసిరి : అతడొక దొంగ. పండ్రెండేండ్ల బాలుడు. బెజవాడ రైలు స్టేషనులో ధర్మారావు కంటబడ్డాడు. పోలీసువాడు కొడుతున్నాడు. నేను చేసిన దొంగతనం చూపించి కొట్టమంటున్నాడు ఆతడు. పేరు అసిరి. నీవు ఎక్కడో దాచి ఉంచి ఉంటావు, నీవు ఇంద్రజాలపు దొంగవని రక్షకభటుడు బాదుతున్నాడు. ధర్మారావు వాడిదగ్గర ఏమి దొరకనప్పుడు కొట్టడం ఎందుకు వదలమన్నాడు. వీడు జగజ్జంత్రి ముండకొడుకండి వదలరాదన్నాడు. పోనిండు పిల్లవాడు, వాడూ బ్రతకాలిగదా అన్నాడు మహాకవి ధర్మారావు. అపుడు అసిరికి నోరు పెరిగింది. బాబుగారూ! నామాట వినండి. నేను దొంగనే. నాకు కావలసినదానికన్నా ఎక్కువ తీసికోను ఆ సంగతి ఈయనకు తెలుసు. మొన్న ఒకాయన సంచి దొంగిలించాను. అందులో పది రూపాయలున్నవి. ఒక రూపాయి మాత్రం తీసుకుని మీ సంచి క్రింద పడిందని ఆయనకు ఇచ్చాను. ఆయన డబ్బు లెక్కించుకుని ఒక రూపాయి తగ్గినదని అటు ఇటు వెదకి ఎక్కడో పోయిందనుకుని వెళ్లాడు. ఆనాడు మా యింటిలో బియ్యం లేవు. రెండు రోజుల నుంచి నాకు మా అమ్మకు పస్తులే.

ఈ పోలీసువారు నన్ను జైలులోనూ వేయరు. సంపాదించుకోనీయరు. నీవు జయిలుకు పోతే మీ అమ్మకు తిండి ఎలాగన్నాడు ధర్మారావు. అది ఏమి చావు చస్తుందో! చూస్తున్నంతవరకే నా బాధ్యత అన్నాడు అసిరి. గొప్ప వేదాంతమే అన్నాడు ధర్మారావు. పోలీసువాడు విడిచిపెట్టాడు. అసిరి ఆయన్ని వెంబడించాడు. ఎందుకంటే, మీ యిల్లు చూచిపోతానన్నాడు. ఎందుకు దొంగతనానికా? మీకంత అనుమానమైతే రానన్నాడు. ధర్మారావు రమ్మన్నాడు. అందరూ సూర్యపతి ఇంటికి వెళ్లారు. సూర్యపతి ధర్మారావు స్నేహితుడు. బెజవాడవాసి. అసిరిని గుర్తించాడు. అన్నం కూడా పెట్టారు. సాయంత్రం ధర్మారావు కుటుంబం, సూర్యపతి కుటుంబం పశుపతి కుటుంబం దుర్గమ్మ అమ్మవారిని చూడడానికి వెళుతున్నారు. అసిరి వెంబడించాడు. ఇంతకుముందే సూర్యపతి దగ్గర అర్ధరూపాయి కొట్టివేసినాడట. ఏమైనా కావలసి వస్తే తీసుకో. జేబులు మాత్రం కొట్టకన్నాడు. అయినా తెలీయకుండా ఎలా కొట్టగలవురా? మీరే చూడండి. ఆపొట్టి ఆయన జేబులో డబ్బులున్నవి గదా? లాగి చూపమన్నాడు ధర్మారావు. పశుపతి జేబు ఖాళీ అయ్యింది. కొబ్బరికాయలు, పండ్లు, పూలు కొన్నారు. పశుపతి జేబులో చేయి పెట్టాడు. డబ్బు సంచి లేదు. సూర్యపతి అసిరిని చూచి సంచి ఏదిరా అన్నాడు.

ధర్మారావు కన్నుగొట్టినా అసిరి సంచి యిచ్చాడు. అంతటి నైపుణ్యంగల పశ్యతోహరుడు. నీకెంత కావాలో అంత తీసుకుని ఇవ్వమన్నాడు పశుపతి. బీడీలకు అర్ధణామాత్రం తీసుకున్నానన్నాడు. నేటికి బియ్యమున్నవి. రేపటిమాట రేపు. ఈయనలాంటివారు దొరకరా! వాడి మాటలకు మువ్వురూ విరగబడి నవ్వారు. నేనొక రూపాయి ఇస్తాను తీసుకో. రెండు రోజులు దొంగతనం మానవచ్చుకదా! అన్నాడు పశుపతి. దొంగతనం చేయకపోతే తోచదన్నాడు. ఆనాడు కూడు సహించదు. మీరు ఊరకే ఇస్తే అది భిక్షం అవుతుంది. నేను సంపాదించుకునే తింటాను. దొంగతనం సంపాదన అవుతుందా? చిత్తం చిత్తం అది నా వృత్తి. పెద్దవారంతా చేసేది అదే. నేను ఎవ్వరిని నొప్పించక వృత్తినైపుణ్యంతో నాకు కావలసినంత కష్టపడి సంపాదిస్తున్నాను. వారు అలాకాదుగదా? అన్నాడు.

నీవింత జాగ్రత్తగా లాగుతుంటివే పోలీసువారు ఎలా పట్టుకొంటున్నారన్నాడు ధర్మారావు. ఇపుడు పట్టుకోలేరు. చిన్నప్పుడు రెండుసార్లు దొరికాను. అప్పటినుంచి నామీద కన్ను. పట్టుకుంటే సరకారువారి భోజనం దొరుకుతుంది. నాకే లాభం. దొంగతనంతో అన్ని మెలకువలు నాకు తెలుసు. అయితే నేను పెద్ద దొంగనుకాదు. మా పెద్దవారూ పెద్ద దొంగతనాలు చేయరు. ఎవరో ధనవంతులు, ఉద్యోగస్థులు చేయిస్తారు. పేదవాడికి పూటగడిస్తే చాలు. దాచుకోడు. లోకంలో బాగుపడిన దొంగ ఉన్నాడా? ధనమంతా చేయించినవాడికి చేరుతుంది. కల్లు దుకాణానికి కావలసినంత దొంగ చేతికి చిక్కుతుంది. పైగా అప్పుడప్పుడు కారాగారవాసం. లండనులో పరికరాలు చేతబట్టి దొంగతనానికి వెళతారట. హస్తలాఘవంవారికి లేదట. ఈ విషయాలన్నీ మా పెద్దలు పేపరు చదివి చెబుతారు. పెద్ద దొంగలు, చేయించిన అసలు దొంగల పేర్లు చెప్పరా? అన్నాడు ధర్మారావు. చెప్పరండి అది వృత్తి ధర్మం. ప్రమాణం చేసి ఉంటారు. అట్టివారిని కొందర్ని చెప్పు చూద్దామన్నాడు రావు. పేర్లు చెప్పరాదు. ఆరోజు వస్తే గాలికూడా సాక్ష్యం వస్తుంది. దానికీ చెవులుంటాయి. గోడకేకాదు. బలవంతంమీద చెవిలో ఏదో చెప్పినాడు. ఓహో ఇదియా విషయం అన్నాడు ధర్మారావు. నేను పోలీసులకు ఈ విషయాలన్నీ చెబితే నిన్ను బంధించరా? నాదగ్గర సొమ్ము దొరకదుగదా? మా అందరికి ‘లా’ తెలుసన్నాడు అసిరి.

నెమ్మదిగా అందరూ కొండదిగారు. పశుపతి వాడి మాటలకు ఆకర్షితుడై రెండు రూపాయలు ఇవ్వబోయాడు. వాడు ఊరకే తీసుకోనన్నాడు. అపుడు ధర్మారావు ఇంతటి చోరవిద్యను చెప్పావుగదా దానికోసం తీసుకోమన్నాడు. చదువమ్మరాదు. డబ్బు తీసుకోరాదన్నాడు అసిరి. నేనూ చదువమ్మని వాడినే నా దగ్గర గ్రహించవచ్చునని చెప్పి రెండు రూకలిచ్చి పంపాడు. వాడి తెలివికి, నీతికి, వృత్తి నిబద్ధతకు ముగ్గురు మిత్రులు సంతోషపడ్డారు. అసిరి వంటి దొంగలు కోటికొక్కరుందురేమో! తరతరాలకు కూడబెట్టే దొరకైనా దొంగకైనా బుద్ధి చెప్పే పాత్ర.

ఈ వేయి పడగలలో రెండు మూడు పాత్రలు తప్ప అన్నీ మంచి పాత్రలే (పడగలే) చెడిన రంగారావు మారినాడు. మంగమ్మకూడా మారింది. అయినా గోపన్న, నాయర్, లక్ష్మణస్వామి, అసిరి మరుపురాని ఆణిముత్యాలు. ఇలాంటి చిన్న పాత్రల ప్రవర్తనవల్ల కూడా పెద్ద పాత్రల విలువపెరిగి పుష్టిమంతాలవుతాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News