Home తాజా వార్తలు వొడాఫోన్ ఐడియానే నంబర్ 1

వొడాఫోన్ ఐడియానే నంబర్ 1

Vodafone

 

రెండో స్థానంలో జియో

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టెలికామ్ సంస్థగా వొడాఫోన్ ఐడియా తన అగ్రస్థానాన్ని నిలెబెట్టుకుంది. వొడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా 32.53 శాతం ఉండగా, రిలయన్స్ జియో 29.08 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో ఉంది. 28.12 శాతం వాటాతో భారతీ ఎయిర్‌టెల్ మూడో స్థానంలో నిలిచింది. 38 కోట్లకు పైగా వినియోగదారులతో భారతీయ టెలికాం పరిశ్రమలో వోడాఫోన్ ఐడియా అతిపెద్ద కంపెనీగా అవతరించింది. జులై మాసానికి సంబంధించి గణాంకాలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజాగా విడుదల చేసింది. 38 కోట్ల మంది సభ్యులతో వొడాఫోన్ ఐడియా దిగ్గజం కంపెనీగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

కాగా రిలయన్స్ జియో 33.97 కోట్ల వినియోగదారులతో రెండవ స్థానంలో, 32.85 కోట్ల మంది వినియోగదారులతో ఎయిర్‌టెల్ మూడవ స్థానంలోనూ నిలిచాయి. దీంతో ఇవాల్టి బేర్ మార్కెట్‌లో కూడా వోడాఫోన్ ఇండియా కౌంటర్ ఏకంగా 12 శాతం పెరగడం విశేషం. జూలై చివరి నాటికి మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 118.9 కోట్లకు పెరిగిందని ట్రాయ్ తెలిపింది. జూలై 31 నాటికి వైర్‌లెస్ చందాదారుల మార్కెట్ వాటాను 89.73 శాతం కలిగి ఉండగా, ప్రభుత్వ రంగ సంస్థలు బిఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టిఎన్‌ఎల్ మార్కెట్ వాటాను కేవలం 10.27 శాతం మాత్రమే కలిగి ఉన్నాయని ట్రాయ్ తన నివేదికలో పేర్కొంది. వినియోగదారులను కోల్పోతున్న సంఖ్య కూడా వోడాఫోన్ ఐడియాలో ఎక్కువగా ఉంది. గత కొన్ని నెలలుగా ఇదే ధోరణి కొనసాగుతోంది.

Vodafone Idea merger closes to take first place in India