Home తాజా వార్తలు ఓటరు నమోదు షురూ

ఓటరు నమోదు షురూ

Voter registration

 

సెప్టెంబర్ 30 వరకు ఓటరు నమోదు
ఇంటింటి సర్వే ప్రారంభించిన అధికారులు

రంగారెడ్డి : 18 సంవత్సరాలు నిండి ఓటరుగా నమోదు చేసుకోలేదా…గతంలో ఓటు హక్కు ఉన్న ఓటరు జాబితాలో మీ పేరు మిస్ అయిందా…ఓటరు జాబితాలో మీ పేరు, అడ్రస్‌లో ఏమైనా తప్పులు నమోదు అయ్యాయా అయితే తక్షణం కొత్త వారు ఓటు నమోదు చేసుకోవడంతో పాటు పాత ఓటర్లు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆదివారం నాడు ప్రక్రియ ప్రారంభమైంది.

వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ఆయేషామీనన్ తో పాటు అధికారుల వికారాబాద్ మండలం కొటాలగూడలో ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించారు. 2001 డిసెంబర్ 31 లోపు పుట్టిన వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటికి తిరిగి కొత్త ఓటరు నమోదుతో పాటు రెండు సార్లు నమోదు అయిన వాటిని గుర్తించి తీసివేయడానికి చర్యలు చేపట్టడంతో పాటు మరణించిన వారి ఓట్లను సైతం జాబితాలో నుంచి తొలగించే ప్రక్రియ నిర్వహించనున్నారు.

ఆన్‌లైన్‌లో సేవలు…
ఓటర్లు ఆన్‌లైన్‌లో ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. డబ్లూడబ్లూడబ్లూ. సిఇఓతెలంగాణ.ఎన్‌ఐసి, ఇఆర్‌ఒ.నెట్, ఎన్‌విఎస్‌పి.ఇన్ సైట్‌లలో లాగిన్ అయి నమోదు చేసుకోవడంతో పాటు 1950 టోల్ ప్రీ నెంబర్‌కి కాల్ చేసి తమ ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. గతంలో ఓటు హక్కు ఉన్న ఓటరు సైతం తప్పనిసరిగా తమ ఓటును పరిశీలించుకోవలసిన అవసరం ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన తమ ఓట్లు గల్లంతయ్యాయని గగ్గొలు పెట్టడం ప్రతి సారి కామన్‌గా మారిందని ప్రస్తుతం జరుగుతున్న నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరు సమయం వెచ్చించి మరో మారు ఓటును పరిశీలించుకోవలసిన అవసరం చాలా వరకు ఉంది.

పార్లమెంట్ ఎన్నికల సమయానికి జిల్లాలో 2983324 మంది ఓటర్లు ఉండగా తాజాగా నిర్వహించే సవరణ అనంతరం పెద్ద సంఖ్యలో కొత్త ఓటర్లు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో617169 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో సైతం శేరిలింగంపల్లి మొదటి స్థానంలో ఉండగా షాద్‌నగర్ చివరిస్థానంలో ఉంది.

నియోజకవర్గం                                              ఓటర్లు
శేరిలింగంపల్లి                                                617169
ఎల్.బి.నగర్                                                516383
రాజేంద్రనగర్                                                463081
మహేశ్వరం                                                 449968
ఇబ్రహింపట్నం                                              276549
చెవెళ్ల                                                       235052
కల్వకుర్తి                                                    219255
షాద్‌నగర్                                                   205867
మొత్తం                                                     2983324

Voter registration process has begun