Home ఎడిటోరియల్ ప్రతిజ్ఞా పాటవం

ప్రతిజ్ఞా పాటవం

కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి,
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత, నల్లగొండ జిల్లా
సెల్ : 9441561655

Subbarao1“భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరు నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను… నా ప్రజల పట్ల సేవా నిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.” అన్న ప్రతిజ్ఞ గీతం ప్రతి రోజు కోట్లాది మంది విద్యార్థుల గొంతుల్లో ప్రతిధ్వనిస్తుంటుంది. జాతీయ భావం ప్రేరేపించే ప్రతిజ్ఞ గీతం యాభై ఏండ్ల నుండి సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోని పాఠ్యపుస్తకాలలో ముద్రించినప్పటికీ దాన్ని రాసిన రచయిత పేరును వెలుగులోకి రాకుండా దాచిపెట్టారన్న కుట్ర విషయం మనకు తెలిసిందే. రోజూ వేలాది పాఠశాలల్లో ప్రార్థన సమయంలో కోట్లాది విద్యార్థుల గొంతుల్లో మారు మ్రోగుతుంది. ‘ప్రతిజ్ఞ’ అనే ఈ గీతం రాసిందెవరు సార్? అని పిల్లలు ప్రశ్నించినప్పుడల్లా… సమాధానంగా మౌనమే వహించాల్సిన ఆగత్యం పంతుళ్ళకు ఉండేది. ఇటువంటి ప్రతిజ్ఞ రాసింది ఎవరంటే తెలిసింది పట్టుమని పది మంది లేరంటే నమ్మశక్యం కాదేమో! కాని నిజంగా నమ్మిదీరాల్సిందే. అదే పాఠ్యపుస్తకాలలో ప్రక్కప్రక్కనే “వందేమాతరం” రాసింది బంకించంద్ర చటర్జీ అని, ‘జనగణ మన’ రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ అని ముద్రించబడి ఉండేది. కాని ప్రతిజ్ఞ రాసిన పైడిమర్రి వెంకటసుబ్బారావు పేరు మాత్రం చేర్చకుండ ఉద్దేశపూర్వక కుట్ర చేశారన్న విషయం యావత్ తెలంగాణ గమనించింది. కొద్దిగా లోతుగా పరిశీలిస్తే నాటి సీమాంధ్ర పాలకుల పక్షపాత బుద్ధి డొల్లతనం అవగతమవుతుంది. రచయిత తెలంగాణలోని నల్లగొండ సమీపంలోని అన్నెపర్తిలో పుట్టడమే చేసుకున్న పాపంగా భావించాల్సి వచ్చింది. అదే సీమాంధ్రలో పుట్టి ఉంటే గురజాడ లాగా లేదా పింగళి వెంకయ్య లాగా కీర్తించబడి ఉండేవారు. ఇటువంటి వివక్ష తెలంగాణ ప్రాంతానికి కొత్తేం కాదనుకోండి. అయినా 60 సం॥రాల నుండి కొనసాగిన వివక్ష పై అలుపెరుగని పోరుసల్పి వలస పాలనకు చరమగీతం పాడి స్వరాష్ట్రం సాధించుకున్నం.

ఇంతకీ ఈ పైడిమర్రి ఎవరు?
ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి వెంకటసుబ్బారావు జూన్ 10,1916న నల్లగొండ జిల్లా కేంద్రం సమీపాన గల అన్నెపర్తి అనే గ్రామంలో పుట్టిండు. ఇతని పూర్వీకుల మూలాలు కొంత ఆంధ్ర ప్రాంతానికి చెందినట్లుగా తెలుస్తుంది. ఇతని తండ్రి వెంకట్రామయ్య నల్లగొండలోనే నివసించేవాడు. ఆయన ఇద్దరు భార్యలు చనిపోయినంక, ప్రకాశం జిల్లాలోని డోర్నాల మండలం చింతల ఆగ్రహారానికి చెందిన రాంబాయమ్మతో మూడో వివాహం జరిగింది. వారికి పుట్టిన బిడ్డే ఈ వెంకటసుబ్బారావు. నల్లగొండలో విద్యాభ్యాసానంతరం ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరిండు. అనంతరం 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినంక బదిలీపై రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో పని చేసిండు. అట్లా 1962-63 సం॥లో విశాఖపట్నంలో పని చేస్తున్న సందర్భములో చైనా యుద్ధం జరిగింది. యుద్ధానంతరం దేశభక్తిని విద్యార్థులలో పెంపొందింపజేసేందుకు నాటి చైనా ప్రభుత్వం దేశభక్తి గేయాలను పాఠశాల విద్యార్థులతో రాయించి పాడించే విధంగా మహత్తర కార్యక్రమం చేపట్టింది. ఈ వార్తాంశమే మన పైడిమర్రికి ప్రేరణ కలిగించింది. తాను కూడా ఏదో ఒక దేశభక్తి గీతం రాయాలన్న ఆలోచనతోనే నేటి ప్రతిజ్ఞ రచనకు రూపకల్పన చేసిండు. ఈ విధంగా పైడిమర్రి వంశానికి సంబంధించి కొన్ని మూలాలు తల్లి వైపు నుండి గానీ, ఉద్యోగ రీత్యా ఆంధ్ర ప్రాంతంలో పనిచేయడం వల్ల ఆయనపై సీమాంధ్ర ప్రభావం కొంతవరకు కనిపించడం సహజమే. అయినప్పటికీ తాను నల్లగొండలో పుట్టి తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడు కావడం వల్లే ప్రతిజ్ఞ రూపకర్త పైడిమర్రి పేరును పాఠ్యపుస్తకాలలో ముద్రించకపోవడంగానీ, ఆయనకు తగిన గుర్తింపు లభించకపోవడంగాని జరిగిందన్న విషయం రూడి అయింది. ఒకప్పుడు విజయవాడలో జరిగిన కవుల, రచయితల సమావేశం కూడా ప్రతిజ్ఞ రచయితను పాఠ్యపుస్తకాలలో ముద్రించాలని తీర్మానించడం సమైక్య రాష్ట్రంలోనే జరిగింది. ఇటువంటి డిమాండ్ రావడం ఆహ్వానించదగ్గ హర్షించే పరిణామంగా పేర్కొనవచ్చు. అంటే కవులకు, రచయితలకు నాయకులకున్నంత స్వార్థముండదని, అన్యాయం, వివక్షతలపై పెన్నులు గన్నులు చేసి ప్రజల్ని చైతన్యం చేసే రచనలు చేస్తారని నిరూపించబడ్డ సంఘటనలు కోకొల్లలు.
స్వతహాగా రచయిత : ఇతను తెలుగు భాషతో పాటు సంస్కృతం, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో మంచి ప్రావీణ్యం పొందాడు. పైడిమర్రి అనేక రచనలు చేశాడు. 1945లో ‘ఉషస్సు’ అనే కథల సంకలనాన్ని తీసుకొచ్చిండు. ‘కాలభైరవుడు’ అనే నవల రాసిండు. 1936లో మీమాంసత్రయం, బాల రామాయణం, గీత మీమాంసతో పాటు దైవభక్తి మొదలైన రచనలతో పాటు అనేక అనువాద పుస్తకాలు కూడా రాశాడు. అనేక సాహిత్య సభలలో చురుకుగా పాల్గొనేవాడు. పైడిమర్రి రాసిన రెండు పద్యాలను సురవరం ప్రతాపరెడ్డి తన గోల్కొండ కవుల సంచికలో వేసిండు. దీన్ని బట్టి పైడిమర్రి గొప్ప రచయిత, సాహితీ వేత్త అని చెప్పక తప్పదు.
“ప్రతిజ్ఞ” పాఠ్యపుస్తకంలో చేర్చిన తీరు : పైడిమర్రి విశాఖపట్నంలో డిటిఒ గా పని చేసే కాలంలోనే ప్రతిజ్ఞ రాసి, దాన్ని తన స్థానిక మిత్రుడైన తెన్నేటి విశ్వనాథం ద్వారా నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో విద్యాశాఖమంత్రిగా ఉన్న పి.వి.జి.రాజుకి అందించడం జరిగింది. 1963లో పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కించినట్లు తెలుస్తుంది. ఈలోగా పైడిమర్రి బదిలీపై విశాఖపట్నం వదిలిపోయిండు. ఆ తర్వాత ఇతను బోధనేతర ఉద్యోగి అయినందున తాను రాసిన ప్రతిజ్ఞ సంగతి మర్చిపోయిండు. తదుపరి ఖమ్మం, నెల్లూరు, నిజామాబాద్ జిల్లాలలో పని చేసిన పిమ్మట తదనంతరం నల్లగొండలో పని చేసి ఉద్యోగ విరమణ చేసిండు. అటు పిమ్మట విశ్రాంతి సమయంలో హోమియోపతి వైద్యం ఉచితంగా అందించాడు. ఇట్లా గడుపుతుండగా ఓ రోజున తన ఇంట్లో మనుమరాలు పాఠ్యపుస్తకంలోని ప్రతిజ్ఞను బట్టిపట్టి పలుమార్లు చదువుచుండగా తన చెవిన విన్నాడు. అది గమనించిన ఆయన కొన్ని క్షణాలు ఆగి మళ్ళీ చదివించుకుని తాను రాసిందే ఈ ప్రతిజ్ఞ అని జ్ఞాపకం తెచ్చుకుని తన డైరీ తీసి చూసుకుండు. అప్పుడు గానీ అది తాను రాసిందే అని అనుకున్నడు. ఈ విషయాలన్నింటినీ డైరీలో పొందుపర్చినాడు. వృద్ధాప్యభారంతో 13 ఆగస్టు 1988న కాలం చేసిండు. ఈ విషయాలన్నీ ఇటీవల కాలంలో వెలుగు జూశాయి.
ప్రతిజ్ఞలో ఏ ముంది?… ఈ గీతంలో జాతీయ భావం నిక్షిప్తమై ఉంది. దేశం పట్ల, ప్రజల పట్ల అభిమానాన్ని, భక్తిని, ఆరాధన భావాన్ని తెలియజెపుతుంది. ఈ దేశం నా మాతృభూమి అని, ఇక్కడ నివసించే ప్రజలందరు నా అన్నాదమ్ములు అక్కాచెల్లెండ్లని, దేశ సంపద, సంస్కృతి, పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఇటువంటి భావాన్ని బాల్యం నుండే ఎక్కించే విధంగా ఉంది. ప్రతినిత్యం పాఠశాల ప్రారంభ సమయాన ఢమరుకమై మ్రోగుతుంది. పైడిమర్రి తన ప్రతిజ్ఞలో ప్రతి పదం విద్యార్థులు సులువుగా అర్థం చేసుకునే విధంగా రాశాడు. ఇంతటి విశిష్టత కల్గిన ప్రతిజ్ఞ రచయితను లోకానికి తెలియకుండ జేయడం నాటి పాలకుల వివక్షకు తార్కాణం.
స్వరాష్ట్రంలో గుర్తింపు లభించింది : ఎంతో కాలం మరుగునపడిన విషయాని స్వరాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞ రచయిత పేరును ముద్రించి గౌరవించింది. అరవై ఏండ్ల వివక్షకు తెరపడింది. అయితే ప్రతియేటా పైడిమర్రి వర్ధంతి, జయంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ ఏర్పడింది. పాఠశాలల్లో, కళాశాలల్లో ఆయన చిత్రపటాలు ఏర్పాటు చేసి వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తే గౌరవంగా నివాళులర్పించాలని తెలంగాణ కవులు, రచయితలు కోరుతున్నారు. ప్రతిజ్ఞ సుస్వరాలను ప్రపంచానికి తెలిసేటట్టు రాష్ట్ర ప్రభుత్వం ఎలుగెత్తి చాటుతుందని ఆశిద్దాం.