Friday, December 2, 2022

వాంఖడే తల్లికోసం రెండు డెత్ సర్టిఫికెట్లు తీసుకున్నారు

Wankhede took two death certificates for his mother
ఒక దానిలో ముస్లింగా, మరో దానిలో హిందువుగా పేర్కొన్నారు
మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపణ
- Advertisement -

ముంబయి: నార్కోటిక్ కంట్రోల్ బోర్డు (ఎన్‌సిబి)ముంబయి జోనల్ అధికారి సమీర్ వాంఖడే తల్లి మరణించిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు రెండు వేర్వేరు డెత్ సర్టిఫికెట్లు తీసుకున్నారని, వాటిలో ఒకదానిలో ఆమె ముస్లిం అని ఉండగా, మరో దానిలో హిందువుగా పేర్కొన్నారని ఎన్‌సిపి నాయకుడు, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. గురువారం ఉదయం ఇక్కడ ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. 2015 ఏప్రిల్ 16న వాంఖడే తల్లి జహేదా మరణించినప్పుడు ఆమెను ఖననం చేయడం కోసం ఓషివారా స్మశాన వాటికలో ఆమెను ముస్లిం మహిళగా పేర్కొంటూ సర్టిఫికెట్ తీసుకున్నారని మాలిక్ చెప్పారు. అయితే ఆ మర్నాడు ఆమె కుటుంబం మరో డెత్ రిపోర్టు తీసుకుందని, అందులో జహేదాను హిందూ మతానికి చెందిన మహిళగా పేర్కొన్నారని ఆయన తెలిపారు.

మీడియాతో మాట్లాడడానికి ముందు నవాబ్ మాలిక్ ఈ రెండు సర్టిఫికెట్లను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు కూడా.‘ ఒక కుటుంబానికి రెండు గుర్తింపులు ఎలా ఉంటాయి? ముంబయి కార్పొరేషన్‌నుంచి వెరిఫై చేసిన డాక్యుమెంట్లను తీసుకున్న తర్వాత నేను బహిరంగంగా ఈ విషయం మాట్లాడుతున్నాను’ అని కూడా ఆయన చెప్పారు. సమీర్ వాంఖడే ముస్లిం అయినప్పటికీ తాను ఎస్‌సి కేటగిరీకి చెందిన వాడినని చెప్పుకొని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం పొందారని నవాబ్ మాలిక్ ఆరోపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను వాంఖడే ఖండించారు. గత నెల ఒక క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ పార్టీపై ఎన్‌సిబి దాడి చేసి బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సహా 20 మందిని అరెస్టు చేసినప్పటినుంచి వాంఖడేపై నవాబ్ మాలిక్ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్న విషయం తెలిసిందే.

మాలిక్ ఆరోపణలు దురుద్దేశ పూరితమే: హైకోర్టు

ఇదిలా ఉండగా ఎన్‌సిబి అధికారి సమీర్ వాంఖడేపై ఇకపై ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని నవాబ్ మాలిక్ బాంబే హైకోర్టుకు హామీ ఇచ్చారు. వాంఖడేతో పాటు ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా ట్విట్టర్‌లో లేదా బహిరంగంగా ఎటువంటి ప్రకటనలు చేయబోనని హామీ ఇచ్చారు. తన కుటుంబంపై బహిరంగ విమర్శలు చేస్తున్న మాలిక్‌ను నిలువరించాలని కోరుతూ సమీర్ వాంఖడే తండ్రి వేసిన పిటిషన్‌ను గురువారం బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా మాలిక్ తీరును తప్పుబట్టిన న్యాయస్థానం దురుద్దేశంతోనే ఆయన బహిరంగ వ్యాఖ్యలు, ట్వీట్లు చేస్తున్నట్లు స్పష్టమవుతోందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న తదుపరి విచారణ జరిగేంత వరకు వాంఖడేపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని ధర్మాసనం మాలిక్‌ను ఆదేశించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా.. ఇదే విషయంపై అంతకు ముందు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులోని అంశాలను వాంఖడే తరఫు న్యాయవాది బీరేంద్ర సరఫ్ ద్విసభ్య ధర్మాసనం ముందు ప్రస్తావించారు.

సత్యాన్ని అతిక్రమించి నవాబ్ మాలిక్ ఆరోపణలు చేశారని, వాంఖడేపై కోర్టుకు సమర్పించిన పత్రాలు కూడా ధ్రువీకరించినవి కావని గుర్తు చేశారు. కేవలం సమీర్ వాంఖడే, ఆయన తండ్రి ధ్యాన్‌దేవ్ వాంఖడేలనే కాకుండా ఆయన కుటుంబంలో ఎవరినీ నవాబ్ మాలిక్ వదలలేదని అన్నారు. ధ్యాన్‌దేవ్ కుమార్తెతో పాటు చనిపోయిన ఆయన భార్యపై కూడా మంత్రి తీవ్రమైన ఆరోపణలు చేశారని హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు. వాంఖడే తరఫు న్యాయవాది వాదన విన్న ధర్మాసనం ఈ ఆరోపణలకు సంబంధించి మాలిక్ ఫిర్యాదు చేశారా? అని మాలిక్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీంతో ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాధానం వచ్చింది.‘ అటువంటప్పుడు మంత్రి ఇలాంటి బహిరంగ ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు? కేవలం మీడియాలో పబ్లిసిటీ కోసమేనా? ఆయన ఇలా ఎందుకు చేసున్నారో మాకు తెలియాలి. ఇవి దురుద్దేశంతో చేసినవేనని స్పష్టమవుతోంది’ అంటూ హైకోర్టు ధర్మాసనం మాలిక్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Related Articles

- Advertisement -

Latest Articles