Home తాజా వార్తలు పోతన నరకయాతన..

పోతన నరకయాతన..

Pothana Open Air Theater డంపింగ్ యార్డుగా మారిన ఆడిటోరియం..
ఎగిరిపోయిన పైకప్పు రేకులు
పట్టించుకోని బల్దియా అధికారులు

 వరంగల్: సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాల్సిన ప్రాంగణం నేడు చెత్త డంపింగ్ యార్డుగా మారింది. సాహితీ గోస్టులు, కవి సమ్మేళనాలు జరగాల్సిన ప్రదేశంలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. పౌరాణిక నటులు గొంతెత్తి పద్యం పాటే వేదిక నేడు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. వరంగల్ పోతన నగర్‌లోని పోతన ఓపెన్ ఎయిర్ థియేటర్ దుస్థితి ఇది. పోతన పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఆడిటోరియంను ఎంతో పవిత్రంగా ఉంచాల్సిన వరంగల్ నగరపాలక సంస్థ అధికారులు డంపింగ్‌యార్డుగా మార్చివేశారు. నగరంలోని సేకరించిన చెత్తను అంతా తీసుకువచ్చి ఆడిటోరియం ప్రాంగణంలో గుట్టలుగుట్టలుగా పోస్తున్నారు. గ్రేటర్ అధికారులు పోతన ఆడిటోరియం నిర్వహణను పూర్తిగా విస్మరించడంతో శిధిలావస్థకు చేరింది.

పోతన పంచశతి ఉత్సవాలు..

పోతన తన కావ్యాన్ని రాజులకు అంకితం ఇవ్వనని నాడే ధిక్కార స్వరాన్ని వినిపించిన సహజకవి పోతనమాత్యులు జన్మించిన నేల ఇది.. బమ్మెరలో పుట్టి 500ల సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని పంచశతి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు వీలుగా అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దాతలు సమకూర్చిన నిధులతో వరంగల్‌లోని జెమిని థియేటర్ సమీపంలో సుమారు 30 గుంటలు విస్తీర్ణంలో ఈ ఓపెన్ థియేటర్ నిర్మించారు. 1982 మార్చిలో ఐదురోజుల పాటు నవ్వుతో నాభవిష్యత్తు అన్న రీతిలో ఈ ఉత్సవాలను నిర్వహించారు. అప్పటి ఉపరాష్ట్రపతి హిదాయితుల్లా ముఖ్యఅతిథిగా హాజరుకాగా కేంద్ర మంత్రిగా ఉన్న పివి నర్సింహరావు ప్రోద్బలంతో నిర్వహించిన ఉత్సవాలు సందర్భంగా ఏర్పాటైన పోతన విజ్ఞాన పీఠం ట్రస్ట్ ఆధీనంలోనే ఉండేది. నిర్వహణ కూడా ట్రస్టు చూసుకునేది. ఈ పోతన ఆడిటోరియం ఎదురుగా ఉత్సవాల సందర్భంగా కేటాయించిన స్థలాల్లో పోతన విజ్ఞాన పీఠానికి శాశ్వతంగా భవనం నిర్మించారు. ఆడిటోరియం బాగా నడుస్తుందన్న కాలంలో దాని నిర్వహణ విషయంలో వరంగల్ నగర పాలక సంస్థ మెలకపెట్టింది. ఈ స్థలం తమదే కనుక దాని నిర్వహణ తామే చూసుకుంటామని మొండికేసింది. దీంతో ఆడిటోరియం నిర్వహణపై ట్రస్టుకు కార్పొరేషన్ మధ్య వివాదం తలెత్తింది. పోతన విజ్ఞాన పీఠం బాధ్యతలను అప్పగించాలంటే కార్పొరేషన్‌కు రూ.50 లక్షలు చెల్లించాలని అధికారులు మెలిక పెట్టారు. దీంతో ట్రస్టు కోర్టును ఆశ్రయించింది. చాలా కాలంగా కేసు కోర్టులో నడుస్తుంది.

నిర్వహణ విస్మరించారు..

కార్పొరేషన్ అధికారులు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాని దాని నిర్వహణ మాత్రం విస్మరించారు. చాలా కాలంగా మరమ్మత్తులు లేకపోవడంతో థియేటర్ పైకప్పులు లేచిపోయాయి. మేకప్, డ్రెస్సింగ్ రూంలు, గోడలు బీటలు వారాయి. వేదిక ధ్వంసమైంది. ప్రాంగణంలోని రాళ్లు పగిలిపోయాయి. ఫ్యాన్లను దొంగలు ఎత్తుకుపోయారు. కరెంటు సరఫరా ఎప్పుడు నిలిచిపోయింది. ఆడిటోరియం ఆలనపాలన చూడకపోగా కనీసం అక్కడ వాచ్‌మెన్ సైతం నియమించలేదు. దీంతో రాత్రిళ్లు థియేటర్ ప్రాంగణంలో అసాంఘీక కార్యకలాపాలకు నిలయంగా మారిపోయింది. ఆడిటోరియం గేటు లేకపోవడంతో పందులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడ స్థలం లేనట్లు కార్పొరేషన్ అధికారులు చెత్తనంతా సేకరించి ఆడిటోరియం ప్రాంగణంలో పోసి చెత్తను వేరు చేస్తున్నారు. ఆడిటోరియం కాస్త ఇప్పుడు డంపింగ్ యార్డుగా మారిపోయింది. ఆడిటోరియం ఆధ్వాన్నంగా మారడంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా కార్పొరేసన్ అధికారులు చెత్త డంపింగ్ యార్డు తరలించి పోతన స్మారక మందిరాన్ని నిర్మించి ప్రజలకు అందించాలని కళాకారులు, ప్రజలు కోరుతున్నారు.

Warangal Pothana Open Air Theater As dumping yard