Home తాజా వార్తలు చరిత్ర సృష్టించిన లియోనల్ మెస్సీ

చరిత్ర సృష్టించిన లియోనల్ మెస్సీ

Lionel-Messi

పారిస్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ అత్యుత్తమ ప్రదర్శనకు గుర్తింపుగా ఇచ్చే ప్రతిష్టాత్మకమైన బ్యాలన్ డి ఓర్ అవార్డును మెస్సీ సొంతం చేసుకున్నాడు. ఈ పురస్కారాన్ని అందుకోవడం మెస్సీకు ఇది ఆరోసారి కావడం విశేషం. మరోవైపు మెస్సీ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారాన్ని ఆరు సార్లు గెలిచిన తొలి ఫుట్‌బాలర్‌గా మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఇదే క్రమంలో పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉన్న రికార్డును మెస్సీ తిరగ రాశాడు. రొనాల్డో ఐదు సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు. కాగా, ఈ ఏడాది బ్యాలన్ డి ఓర్ అవార్డు కోసం రొనాల్డో, డచ్ స్టార్ వాన్ దిజ్క్‌లు పోటీ పడ్డారు. వీరితో గట్టి పోటీ ఎదురైనా తట్టుకుని నిలబడిన మెస్సీ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. ఫుట్‌బాల్‌లో నిలకడైన ప్రదర్శన కనబరిచే ఆటగాడికి ఈ అవార్డు ఇవ్వడం అనవాయితీ.

సమకాలీన సాకర్‌లో మెస్సీ, రొనాల్డోల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రపంచ సాకర్‌లో ఇద్దరు మేటి ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే సాకర్ లీగ్‌లకు ఇద్దరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో వీరిని సొంతం చేసుకునేందుకు ఆయా ఫుట్‌బాల్ జట్లు కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటాయి. అంతేగాక పోర్చుగల్‌కు రొనాల్డో, అర్జెంటీనాకు మెస్సీ స్టార్ ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ప్రపంచకప్‌తో పాటు వివిధ టోర్నమెంట్‌లలో వీరిద్దరూ తమతమ జట్లకు ప్రధాన అస్త్రాలుగా ఉంటారు. ఇదిలావుండగా ప్రతిష్టాత్మకమైన బ్యాలన్ డి ఓర్ అవార్డు కూడా వీరిద్దరిలో ఎవరో ఒకరూ సొంతం చేసుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. ఇప్పటి వరకు రొనాల్డో ఐదు సార్లు ఈ అవార్డును దక్కించుకున్నాడు. 2008, 2013, 2014, 2016, 2017లలో రొనాల్డో ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక, మెస్సీ 2009, 2010, 2011, 2012, 2015, 2019లలో బ్యాలన్ డి ఓర్ అవార్డును సాధించాడు. ఇదిలావుండగా మహిళల కేటగిరిలో అమెరికా స్టార్ మెగాన్ రాపినో ఈ అవార్డును దక్కించుకుంది.

ఇక, ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని సాధించి చరిత్ర సృష్టించి మెస్సీపై అభినందనల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్‌హోమ్, మాజీ దిగ్గజాలు, రొనాల్డిన్హో, జిదానే, మారడోనా తదితరులు మెస్సీపై ప్రశంసలు కురిపించారు. ఇక, రొనాల్డో కూడా సోషల్ మీడియా వేదికగా మెస్సీని అభినందించాడు. ప్రపంచ సాకర్‌లో మెస్సీ ఓ అరుదైన ఆటగాడని రొనాల్డో ప్రశంసించాడు.

Watch the moment Lionel Messi makes history