Home ఖమ్మం భద్రాచలం వద్ద గోదావరికి వరద తాకిడి

భద్రాచలం వద్ద గోదావరికి వరద తాకిడి

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు
భద్రాచలం వద్ద 37 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
మునిగిన చీకుపల్లి కాజ్‌వే
25 గ్రామాలకు రాకపోకలు బంద్
నీటమునిగిన మిర్చి చేలు

2525భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరదనీరు వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి భద్రాచలం వద్ద 37 అడుగుల నీటి మట్టం నమోదైంది. గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతంలో ఉన్న వాగులు వంకలు పొంగి ప్రవహించి గోదావరిలో కలపడంతో నదికి వరద తాకిడి పెరుగుతోంది. గోదావరి ఉపనదులైన తాలిపేరు, ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. రానున్న ఒకటి, రెండు రోజుల్లో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడితే గోదావరికి మరింత వరద పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నీటి మునిగిన చీకుపల్లి: గోదావరికి వరద పెరగడంతో వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి వద్ద కాజ్‌వే నీటిలో మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 25 గ్రామాల ప్రజలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ప్రతి చిన్న అవసరానికి నాటు పడవల సహాయంతో మండల కేంద్రానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ లైన్లు సైతం నీటిలో ఉండిపోవడంతో ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేసే అవకాశం ఉంది