Home కలం ‘జలవద్గీత’గా సాగిన ‘జలగీతం’

‘జలవద్గీత’గా సాగిన ‘జలగీతం’

నిప్పులా జ్వలిస్తూ, నీరులా ప్రవహిస్తూ అంతర్గత అగ్నిని నిద్రలేపుతూ జ్ఞాన ప్రవాహమై సాగుతున్న కవి డా॥యన్.గోపి. వీరు జీవితంలో ఒక లక్షాన్ని మార్గాన్ని సుస్థిర పరచుకున్న కవి. తనదైన గొప్ప ధ్యేయాన్ని అధిగమించేందుకు ఎంతో పరిశ్రమించి సృజనాత్మకమైన కవిత్వాన్ని తన మార్గంగా ఎన్నుకున్న కవి ఈయన. వీరు ఏది రాసినా, జాతి ప్రయోజనాన్ని, దేశాభివృద్ధిని, మానవీయతా విలువల్ని, ప్రాపంచిక దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని అంతర్ముఖీనమైన భావాల్ని కవిత్వంగా వెలువరిస్తారు. అందుకే వీరి కవిత్వంలో అనుభవసారం రసప్రవాహమై సాగిపోతూ పాఠకుల అభిలాష దాహాన్ని తీరుస్తుంటుంది. ఏ వస్తువును ముట్టుకున్నా దాని మూల సారాన్ని గ్రహించకుండా, నేటి కాలమాన పరిస్థితుల్లో దాని పరిణామ క్రమాన్ని పరిశీలించకుండా దాని అంతరాత్మను పరిశోధించకుండా, దాని వైజ్ఞానిక భూమికపై మొలచిన తాత్తికతను అవగాహనించుకోకుండా ఆ వస్తువును కవితారూపంలోకి తెచ్చి పాఠకుల ముందు పెట్టడీకవి. అందుకే వీరి కవిత్వం పదునెక్కిన పదచిత్రాలతో లోతైన భావాలతో వస్తు విశ్లేషణతో పఠితల్లో వస్తువు యెడల అవగాహన స్పృహను కలిగిస్తూంటుంది. వీరి దీర్ఘకవిత ‘జలగీతం’ పరిశీలించినట్లయితే ఈ కవి జలాత్మను కవితాత్మకంగా మార్చిన తీరు వీరి కవితా ప్రజ్ఞను పట్టిస్తూంటుంది. పఠితల్లో జలస్పృహను కలిగిస్తూంటుంది.
‘జలగీతం’ దీర్ఘకవితలో భూగోళం మీద సంతులనం సన్నగిల్లడానికి గల కారణాల్ని, వైజ్ఞానిక భూమికను ఆధారంగా చేసుకొని తాత్తిక, మానవీయ దృక్పథంతో ఈ కవితను నడిపారు. నీటి అనంత యాత్రా ప్రక్రియని అద్భుతంగా ఆవిష్కరించిన దీర్ఘకవిత జలగీతం. “నీటి పేరు వింటేనే నిలువునా తడిసిపోతాం!..నీటితనంతో ప్రాణులం/విద్యాతేజో విరాజితులమౌతాం” అంటూ పాఠకుల మనో సాగరం మీద ఓ కవితా తరంగాన్ని సృష్టిస్తాడు కవి. భూమిని జలచర్మ ధారిణిగా మార్చిన వైనాన్ని ఎత్తిచూపుతూ “నువ్వు స్పృశించగానే/వసుంధర నిత్య బాలింతగా మారింది/నువ్వు నిండిన ప్రతి జలాశయం/ఒక గర్భాశయమయ్యింది/ఏ సుదూర గగనాలు పంపిన/ఉపహార ప్రకాశానివి నువ్వు?” అంటూ నీటి విహారంతోనే భూమి జలచర్మధారిణిగా మారింది అంటారు.
సముద్రాన్ని చూస్తూ/పర్వతాలు దిగులు మొగం పెట్టాయి/అచలంగా పడివున్న/ మా సంగతేమిట’నీ గీపెట్టాయి” అప్పుడు జలమాత హృదయం ద్రవించి “మేఘాలను పైకి విసిరేసింది/కదలని రాతి శిఖరాలకు/తలపాగాల్లా అమిరాయి మేఘాలు”. అంటే నీటి విహారం నేల నింగిమీదే కాదు, కొండ కోనల్లమీద కూడా వాయు రూపంలో వుంది అనేది కవి భావన.
నీరుని నిత్య చైతన్యశీలిగా అభివర్ణిస్తూ “నీటి మార్పులు నిరుపమానాలు../ఆకాశం కాన్వాసు మీద/ అందమైన చిత్రాలన్నీ/నీటి చిత్రాలే/నీటికి మరణం లేదు/ స్వేచ్ఛగా కదిలే జలం/మంచు పలకల్లో బందీ అయ్యింది/విముక్తి ఎప్పుడో?/కాని ఇది నీటికి నిర్బంధం కాదు/ పరుల ఉపకారం కోసమే/ ఈ అవతారం” నీరు ఎన్ని విధాలుగా రూపాంతరం చెందుతుందో వివరిస్తాడు కవి.
పంచ భూతాల నిర్మితమైన సమన్వితమైన ఈ ప్రపంచం సృష్టికి మాతృకగా భావిస్తూ “నీరంటే నీరా/ఈ ధాతువు/మిగతా మిత్రుల మధ్య సేతువు/మేఘాల కళ్ళనుండి రాలే/ద్రవీభూత భాష్పాలే/నీటి పుష్పాలు/విద్యుత్ కాంతల విన్యాసాల సందుల్లోంచి/జారిపడే తేజఃపుంజాలు/నీటిలో నిప్పు నిక్షిప్తమంటే యిదే!” అగ్ని కూడా నీటి రూపంలో వున్న తీరు వివరిస్తాడు కవి. భూమికి పురుడు పోసేది నీరు. నింగికి వాయు రూపంలో వలసబోయిన నీరు వర్షం రూపంలో ఇంటికిఅంటే భూమిని తాకి ఆనందపడుతుంది. పంటలు పండడానికి కారణభూతమవుతుంది.
“భూమి పొరల్లో/నీళ్లు చచ్చినట్లు పడివుండవు/ఎక్కడైనా/ప్రవాహం దానికి నైసర్గికం/నదీనదాలై/అడ్డంకుల్ని చీల్చుకొని పరుగెడతాయి/నిలువనీయనితనం నీటి గమ్మత్తు” అంటూ నీటికి వున్న ప్రవాహ శీలతను వ్యక్తీకరిస్తాడు కవి.
మనిషి చేసే కాలుష్యం వలన “ఈనాడు/నీరు కలత కలతగా రోదిస్తుంది/దళదళపరీత లేదనగా నినదిస్తుంది” అంటారు. సకల సృష్టి సంగీతానికి/అపశ్రుతులు సమకూర్చుటేనా? ప్రగతి అంటారు. నింగి మనసు ఎడారిగా మారడం, మబ్బులు వాగ్దానాలు చేసి మాట తప్పడం, రైతు వర్షం కోసం ఆకాశానికి కళ్లతికించి కూర్చోవడం వర్ణిస్తూ కరువు కాటకాలకు నీటి యెద్దడే కారణంగా విశదీకరిస్తాడు కవి.
గాలి నీటి సఖ్యత వల్ల ఒక్కోసారి అనర్థాలు జరిగిపోతుంటాయి. తుఫాను పైశాచిక కృత్యానికి హద్దులు చెరిగిపోతుంటాయి. సముద్ర కెరటాలు తోకతొక్కిన త్రాచుల్లాగా బుసలు కొడుతూ ఊళ్లమీద విరుచుకుపడతాయి. చెలరేగిన తుఫాను శవాలకుప్పలకు కారణమవుతుంది. ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహిస్తాయి. నేరం ఎవరిది అయినా జీవజలం నిర్జీవజలంగా మారడాన్ని వివరిస్తాడు కవి. మనిషి చేస్తున్న అకృత్యాల వల్లే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి అనేది కవిభావన. మనుషులు కలహాలతో విడిపోకముందే నదులను అనుసంధానం చేయడమే మంచిది అంటాడు కవి.
“గంగా”నది చారిత్రక జలాల్లో సాంస్కృతిక సౌధాలు ప్రతిఫలిస్తాయి/దాని అలల పొత్తిళ్లలో/జనించిన వీరగాథలు/ఉత్తేజాల వెలుగు వాదాలు” అంటూ గంగానదిని వర్ణిస్తాడు కవి. మానవుని స్వార్థ తాడిత మయిన గంగ నిలువునా ఎండిపోతున్న తీరును వివరిస్తాడు కవి. “ఇసుక బొంతలు కప్పుకొని/నిస్సత్తువతో మూల్గుతున్న గంగను గుర్తు చేస్తాడు కవి.
నేడు చెరువులు బాల్య స్మృతులుగా మారిపోతున్నాయి. చెరువులు నీళ్లు లేక కళేబరాలై పడివున్నాయి. చెరువంటే “వర్షాధారలతో వేసిన/లక్షతానుల దుప్పటి కదా చెరువు” అంటారు కవి.
నీటి పాటల్లో అపశ్రుతులు దొర్లబట్టే, నీటి గుండె కోతకు గురికావడం వల్లే పల్లెలు వలసబాట పట్టాయి. “అనగనగా ఒక పల్లె/దశాబ్దాల తర్వాత వెళ్లి చూస్తే/అదిప్పుడు అక్కడ లేదు/లేదంటే లేదనికాదు/ ఊరుంది జనం లేరు/ఇళ్లకు తాళాలు/నిర్మానుష్య వీధులు/కూలిపోతున గోడలు/ ఈ నిశ్శబ్దం విషమంత భయానకమైంది” అంటారు. “దుర్భిక్షానికి సుభిక్షానికి మధ్యనున్న వ్యత్యాసమే నీటి విలువ కనుక నీటిని ధనంతో లెక్కించడం అమానుషం” అంటారు కవి.
ప్రాణికోటి సొత్తయిన జలాలమీద స్వార్థం నీడలు పడుతున్నాయి. గుత్తాధిపతులకు నీటిని ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వవైఖరిని ఖండిస్తాడు కవి. “జలానికి గోడలు కడితే/జనం వేడెక్కుతుంది జాగ్రత్త!” అంటూ హెచ్చరిస్తాడు కవి.
జలాన్ని కలుషితం చేయడం, అంగడి సరుకుగా మార్చడం చూస్తున్నాం. మనిషి ఇకనైనా మేల్కోవాలి, జలాదర్శాన్ని చాటిచెప్పే స్వచ్ఛ భాగస్వాంతులు కావాలి. జలశక్తిని వెలిగించాలి. అంతటా జలజీవకళలు వెల్లివిరియాలి. జలం విలువ తెలుసుకోవాలి. ప్రతిక్షణం జలక్షణం కావాలి, ప్రతి నిమిషం జలోన్మేషం కావాలి, ప్రతిక్రతువూ జలరుతువుగా జలభేరి మ్రోగించాలి. అదే మనిషి భవితకు దారిగా భావించాలి. భగవద్గీతలా జలవద్గీతతో జలరక్షణకు పూనుకున్న కవి యన్.గోపి. వీరి జలగీతం సుదీర్ఘకవితగా వైజ్ఞానిక భూమికగా తాత్తిక చింతనతో మానవీయ కోణంతో సాహిత్యరంగంలో మొలిచిన అద్భుతమైన హరిత కవితా ప్రవాహంగా భావించవచ్చును.

కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
9948774243

(నేడు ఎన్.గోపి “జైనీ ఇంటర్‌నేషనల్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి జైనీ లక్ష్మీనారాయణ అవార్డు అందుకుంటున్న సందర్భంగా..)