Home తాజా వార్తలు నేడు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు

నేడు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు

Water released from Nagarjuna sagar left channel

విడుదల చేయనున్న మంత్రి జగదీశ్‌రెడ్డి
సాగర్ ప్రస్తుత నీటిమట్టం 554  అడుగులు                                                                                                                  పూర్తి మట్టం 590 

మన తెలంగాణ/ మిర్యాలగూడ / హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఎడమకాల్వ నీరు ఆయకట్టుకు ఆయుష్షు పోయనుంది. రైతులు నీటి కోసం ఎదురు చూస్తు న్న సమయంలో ప్రభుత్వం ప్రాజెక్టు అధికారులతో చర్చించి నీటి విడుదలకు ముహుర్తం ఖరారు చేసింది. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సాగర్ నుంచి గురువారం ఎడమకాల్వకు నీటిని విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 15 లోగా వరి నాట్లు వేసుకోవడానికి అనుకూల సమయమని వ్యవసాయాధికారులు ప్రకటిస్తుండటం తో వరినాట్లు వేసుకోవడానికి రైతులు ఆరాటపడుతున్నారు. నల్లగొండ జిల్లా లో ఆయకట్టు పరిధిలో 37 వేల హెక్టార్లలో రైతులు వరిసాగు చేస్తుండగా బోర్లు, బా వుల కింద 14 వేల హెక్టార్లలో రైతులు వరినాట్లు పూర్తి చేశారు. మరో 23 వేల హెక్టార్లలో రైతులు సాగు నీటికోసం ఎదురు చూస్తున్నారు. కొందరు రైతులు నారుమడులను పోసి కాపాడుకోవటానికి ప్రయత్నాలు సాగిస్తుండగా ఏ నీటి ఆదెరువు లేని రైతులు సాగర్ ఎప్పుడెప్పుడు నిండుతుందా అని ఎదురు చూస్తూ వచ్చారు.

వివిధ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు : చాలా కాలం తర్వాత నాగార్జునసాగర్‌కు జలకళ రాగా, శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి మట్టానికి చేరువలో ఉంది. శ్రీరాంసాగర్‌కు స్థానిక వర్షాలు, ఎగువన మహారాష్ట్ర నుంచి వచ్చే నీటితో ఒక్కసారిగా వరద పోటెత్తింది. గత రెండు రోజుల నుంచి ఒక దశలో 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రాగా, క్రమంగా ప్రవాహం తగ్గుతోంది. బుధవారం సాయంత్రానికి 82,250 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. 90.31 టిఎంసిల సామర్థానికి గాను ప్రస్తుతం 72 టిఎంసిల మేర నీరు నిల్వ ఉంది. దీంతో అధికారులుల కాకతీయ కెనాల్‌కు 5850 క్యూసెక్కులు విడుదల చేశారు.

1091 అడుగులకుగాను, 1086 అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. మరో వైపు శ్రీశైలం రిజర్వాయర్‌కు 2.14 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి వచ్చే 1.63 లక్షల క్యూసెక్కుల వరదకు తోడుగా తుంగభద్ర డ్యాం, సుంకేశుల మీదుగా 85,000 క్యూసెక్కుల వరద కలుస్తోంది. ఫలితంగా శ్రీశైలంకు 2.14 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, వచ్చిదంతా అధికారులు దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు రేడియల్ గేట్లను తెరవడంతో పాటు ఎడమ గట్టు, కుడి గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

నాగార్జునసాగర్‌కు 1.83 లక్షల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో నమోదవుతోంది. 17 వేల క్యూసెక్కులను కెనాళ్లకు విడుదల చేశారు. నాగార్జునసాగర్‌లో 590 అడుగుల పూర్తిస్థాయికిగాను 553.20 అడుగుల మేర నీటిమట్టం ఉంది. 312 టిఎంసిల సామర్థానికి గాను 218 టిఎంసిల మేర నీరు నిల్వ ఉంది. ఇంకా 95 టిఎంసిలు వస్తే సాగర్ గరిష్టమట్టానికి చేరి, క్రస్ట్ గేట్లను ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే సాగర్‌కు ఇంకో వారం రోజుల పాటు క్రమంగా వరద కొనసాగే స్థితి ఉందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యాం గేట్లు బంద్ చేసినా, ఇప్పటికే వదిలి, మార్గమధ్యంలో ఉన్న నీరే సుమారుగా 50 నుంచి 60 టిఎంసిలుగా ఉం టుంది. ఇదంతా మళ్లీ శ్రీశైలం మీదుగా, సాగర్‌కు చేరాల్సిందే. మధ్యలో ఏ మా్ర తం వర్షం పడ్డా మళ్లీ ఇన్‌ఫ్లోలు పెరుగుతాయి.

కృష్ణా బేసిన్‌లో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల రిజర్వాయర్లకు 1.62 లక్షల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తుండగా, వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. ఇదేవిధంగా తుంగభద్రకు 67 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 85 వేల క్యూసెక్కులను దిగువకు వదిలారు. గోదావరి బేసిన్‌లో కడెంకు 5406 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 306 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఎల్లంపల్లికి 35252 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, వచ్చింది వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. లోయర్ మానేరుకు 691 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తుండగా, 101 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. సింగూరుకు 414 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 170 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. మిడ్ మానేరు, నిజాంసాగర్‌కు ఇన్‌ప్లో లేదు.