Home దునియా మంచి నీళ్ళ కోసం మరచెంబు, తాబేలుబుర్ర, ఆనిగెపుకాయ

మంచి నీళ్ళ కోసం మరచెంబు, తాబేలుబుర్ర, ఆనిగెపుకాయ

Water-Store-in-Bottle-Gourd

ఎన్కట ప్రయాణాలు చేస్తే ఇప్పటిలెక్క ప్లాస్టిక్ బాటిల్ల లెక్క మంచినీళ్ళు పట్టుకపోవుడుగానీ కొనుక్కువచ్చుడుగానీ ఉండేది కాదు. ప్రయాణాలు అంటే ఊర్ల పొంటిపోవుడు అంటే అమ్మగారిల్లు అత్తగారిల్లు సడ్డకుని ఊరు చెల్లెనిచ్చిన ఊరు గివ్వే ఉంటమిదే. అక్కడికైనా సావులు పుట్టుకలు పెండ్లిల్లు ఏదన్న పెద్ద పబోజనాలు అయితే పోయి వస్తుండిరి. అయితే కొందరు నడిచిపోవుడు ఎవుసం చేసికునేటోల్లు అయితే ఎడ్లబండి మీద పోవుడు జర ఉన్నట్లు అయితె సవారి కచ్చం మీద పోవుడు ఉండే రానురానూ సైకిల్లు వచ్చినై అప్పుడు దూరం పోయేటోల్లకు మంచినీళ్ళ అవసరం ఉంటే ఎడ్లబండ్లమీద పోయేటోల్లకైతే దారి ఏదన్న ఊరిల ధర్మబాయికాడ ఆపి ఎడ్లను కట్టేసి సద్దితినుడు ఆ బాయిల నీళ్ళు చేదుకొని తాగుడు ఉంటుండే. లేకుంటే ఎవల ఇంటిముందు వాకిట్ల ఆగి వాల్ల శాద బాయిల నీళ్ళు చేదుకొని కాల్రెక్కలు కడుక్కొని తెచ్చుకున్న సద్దితింటుంటిరి.

ప్రయాణంల ఇవన్ని మామూలే తర్వాత బస్సు ప్రయాణాలు.ఇప్పటిలెక్క అటుపోయి ఇటు వచ్చుడు కాదు పోతె రెండు మూడు రోజులు ఉండివచ్చుడు ఉండేది. మరి పోయినప్పుడు మరచెంబుల నీళ్ళు పట్టుకపోయేది. మరచెంబు కూడ ఇప్పటి పెద్ద చెంబులెక్కనే ఉంటది కాని దాని కి మరల మూత ఉంటది. చేతిల పట్టుకునేది ఉంటది. తొలికినా నీళ్ళు కారకుండా ఉంటది. మర చెంబు ఇత్తడితో చేసినది ఉంటది. అప్పుడు ఆ కాలంల దానిని కంచరోల్లు చేస్తరా లేక కొనుక్కవచ్చిండ్రా తెల్వది గాని కల్గినోల్లకైతే ఇంటింటికీ మరచెంబు ఉండేది. మరచెంబు అంటె విశ్వామిత్రుని పాత్రలో ఆయన చేతుల పట్టుకునే చెంబు మర చెంబే.ఇంట్ల కుటుంబసభ్యులు కల్సిపోతె రెండు చెంబులల్ల నీళ్ళు తీసికపోయేవాల్లు ఇప్పటికి లెక్క ప్లాస్టిక్ బాటిల్లు వాడకపోతుంటిరి. అసలు నీళ్ళు ఆ కాలం ఎవలు అమ్మక పోతుంటిరి.

నీళ్ళ వ్యాపారం ఇప్పుడు వచ్చింది గాని అప్పుడు నీళ్ళంటే ఎవల ఇంటికి పోయినా చెంబెడు తెచ్చి ఇచ్చేది మరచెంబులంటే జర ఉన్నోల తాన ఉంటే తాబేలు బుర్రలుకొందరి దగ్గర ఉంటయి. తాబేలు ఆకారం కుమ్మరోల్లు చేసిన దాన్ని తాబేలు బుర్రలు అంటరు. ఈ తాబేలు బుర్రకు మంచి జనుం తాడు కట్టి జబ్బకు ఏసుకుంటరు. ఇండ్ల నీళ్లు పోసుకుంటే సల్లగా ఉంటయి. మన్నుతో చేసింది కాబట్టి జర జాగ్రత్తగా వాడుకోవాలె. దీన్ని ఎక్కువగా గొర్లు మ్యాకలు కాసేవాల్లు ఎడ్ల మేపేవాల్లు కొంచపోతరు. ఇందు లో నీళ్ళు పోసుకోవచ్చు లేదా గడ్క సల్ల కలిపి ఇందుట్ల పోసుకుంటే మంచిగ ఉంటది. ఏదన్న ఊరికి సుత పట్టుకపోవచ్చుగాని కుమ్మరి మన్నుతో చేసినందున పల్గుతదని పట్టుకపోరు.

తాబేలు బుర్ర చేసుడు అందరితో కాదు కొంతమంది నిపుణులైన కుమ్మరోల్లు మాత్రమే చేస్తరు. దీన్ని సున్నితంగా వాడాలె. ఇవి రెండు గాకుండా మంచినీళ్ళకు ఆన్వెకాయ బుర్రనుకూడా వాడుతరు. ఆన్వెకాయ పెద్దది. ఎండిపోయినంక దానిమీద రంధ్రం చేసి అందులోని లొట్టపీసు తీసివేస్తరు. మంచిగ కడిగి అందుల నీళ్ళు పోసికొని జబ్బకు ఏసుకొని ఎంత దూరమైనా పోవచ్చు. నీళ్ళు సుత సల్లగ ఉంటయి.ఇవి ఎక్కువగా బుడిగ జంగాలు, బాల సంతుల వాల్లు వాడుకుంటరు. వాల్లు ఇంటి ముంగటికి అన్నం కోసం వచ్చినప్పుడు సూస్తే వాల్ల జబ్బలకు నీళ్లకోసం ఆన్వెకాయ బుర్ర కన్పిస్తది. ఆ రోజుల్ల నీళ్లను మర చెంబెలల్ల, కుమరిమన్నుతో చేసిన తాబేలు బుర్రలల్ల, ఆన్వెకాయ బుర్రలల్ల తీసిక పోతుంటిరి. ఎవల అయిషత్ తీరుగ వాల్లు పట్టుక పోతుంటిరి.

ఈ కాలంలో మినరల్ వాటర్ అని నీళ్లు కొనుక్కొని తాగుడు లేదంటే ప్లాస్టిక్ సీసలల్ల నిల్వ చేసి తీసకపోతుడు అయితంది. దీంతో రానురాను రోగాలు వస్తయి. ఎన్కట ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగినా రోగాలు రాలేదు అంటరు కాని అప్పుడు రోగాలు ఎక్కువ వైద్యం తక్కువ గాని ఈ రోజులల్ల వ్యాపారం కాని వస్తువు లేదు. పైసలు సంపాదనే లక్షంగా మారింది. మంచినీళ్ళు కావాలంటే మోట బాయల కాడ తాగేది. శాద బాయిల కాడ తాగేది. ఇంకా నదుల పర్లల్ల నీళ్ళు తాగేది చేలిమలు చేసుకొని చెలిమల నీళ్ళు తాగేది. ఇప్పుడు అంతటా నీళ్ళు కలుషితం అయినయి గనుక కొనుక్కొని తాగడమే మేలైంది.

Annavaram-Devendar

అన్నవరం దేవేందర్ 94407 63479