Home మంచిర్యాల కాన్కూర్‌లో ఉద్రిక్తత

కాన్కూర్‌లో ఉద్రిక్తత

Water tank climb villagers protests
భారీగా అటవీ, సిఆర్‌పిఎఫ్ బలగాల మోహరింపు
గ్రామస్థులకు పోలీస్‌లకు మధ్య తీవ్ర వాగ్వాదం
రైతుల భూములను నిర్బంధంగా చదును చేస్తున్న వైనం
వాటర్ ట్యాంక్ ఎక్కి గ్రామస్థుల నిరసన
15 మందిని అరెస్టు చేసిన పోలీసులు
22 ఏళ్లుగా కొనసాగుతున్న భూముల పోరాటం
మంత్రి హామీతో పనుల నిలిపివేత

మంచిర్యాల : జైపూర్ మండలంలోని కాన్కూర్ గ్రామంలో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంది. రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో ఒక్కసారిగా అటవీ అధికారులతో పాటు భారీగా సిఆర్‌పిఎఫ్ బలగాలు, పోలీసులు మోహరించారు. తెల్లవారు జాముననే దాదాపు 72 వాహనాల్లో పోలీసులు బలగాలు రావడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వారి వెంట తీసుకువచ్చిన ట్రాక్టర్లతో భూముల్లోకి ప్రవేశించి చదువును చేస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు.  రైతులు సాగు చేసుకుంటున్న భూములు తమవే అంటూ అటవీశాఖ అధికారులు సోమవారం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను తీసుకెళ్లి భూములను చదును చేస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. అంతే కాకుండా కొందరు గ్రామస్థులు వాటర్ ట్యాంక్ ఎక్కి పనులు ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కిందికి దూకే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. కొందరు మహిళలను బలవంతంగా కిందికి దింపారు. గ్రామస్థులు దాదాపు 8 గంటల పాటు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. కాన్కూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్‌లు 154,185,106,107,132లలో 2400 ఎకరాలు గత 22 సంవత్సరాలుగా రెవెన్యూ, అటవీశాఖల మధ్య వివాదస్పదంగా మారాయి. పలు సార్లు అటవీ, రెవెన్యూ అధికారులు జాయింట్ జర్వే చేసినప్పటికీ ఎటు తేల్చలేకపోయారు. కాన్కూర్ గ్రామంలో 150 ఎకరాలకు పైగా రైతులకు పట్టాలు ఉండగా మరో 1000 ఎకరాల భూములను రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల్లో చెరువులు, కుంటలు చేసుకోవడమే కాకుండా గుడిని కూడా నిర్మించుకున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కాన్కూర్ భూములను పరిశీలించి భూములు అటవీ శాఖకు చెందినవేనని ఎవరు కూడా అడ్డంకులు కల్పించవద్దని సూచించారు. దీంతో అక్కడి గ్రామస్థుడు కిరోసిన్ చల్లుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్ 4 ప్రకారం ఈ భూములు అటవీశాఖ పరిధిలోకి వస్తాయని, రెవెన్యూ అధికారులు సైతం తేల్చి చెప్పడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2400 ఎకరాల్లో కేవలం 790 ఎకరాలు మాత్రమే అటవీశాఖకు చెందిన భూములుగా అప్పట్లో రెవెన్యూ అధికారులు సర్వేల ద్వారా తెలిపినప్పటికి ప్రస్తుతం భూములన్ని అటవీశాఖకు చెందినవేనని చెప్పడం అన్యాయమన్నారు. గత 22 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పంట భూములను పోలీసుల అధ్వర్యంలో అటవీ అధికారులు చదును చేయడం సమంజసం కాదని గ్రామస్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

మంత్రి హామీతో వాటర్ ట్యాంక్ దిగిన గ్రామస్థులు……
రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న గ్రామస్థులకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో కాన్కూర్ గ్రామస్థులు వాటర్ ట్యాంక్ పైకి ఎక్కిన వారు, వారి నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నారు. పోలీసుల అధ్వర్యంలో అటవీ అధికారులు భూములను చదును చేయించడం సమంజసం కాదని వెంటనే పనులను నిలిపి వేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేయడంతో అటవీ అధికారులు తాత్కాలికంగా పనులను నిలిపి వేశారు. ఏది ఏమైనా కాన్కూర్ భూముల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.