Home దునియా నీటి కోడి- గండు చీమ

నీటి కోడి- గండు చీమ

Waterfowl-Ant Story in Teluguరామాపురమనే పల్లెలో రాముడనే ఒక జులాయి కుర్రాడు ఒకడుండేవాడు. వాడు నిక్కర్లు వేసుకుని తిరుగుతుంటాడు. ఆ నిక్కర్లకు రెండు వైపుల జేబులుంటాయి. ఒక దాంట్లో చిన్నచిన్న రాళ్లు, మరొక దాంట్లో రబ్బరు, గులేరు పెట్టుకొని ఆ గులేరులో చిన్న చిన్న రాళ్లు పెట్టి కోతులను, కుక్కలను, కోళ్లను, పిట్టలను కొడుతూ రాళ్లు తగిలిన పిట్టలు పడిపోగానే వాటిని పట్టి తెచ్చుకొని కూర చేసుకుని తింటుంటాడు. అదే పల్లెకు దగ్గరలో ఎల్లప్పుడు నీటితో ప్రవహించే ఊటవాగు ఒకటుండేది. ఆ వాగులో నీటి కోళ్లు, చెనగ పిట్టలు ఇంకా ఇతర పక్షులు కూడా మేత కోసం నీటి కోసం వచ్చిపోతుండేవి. ఒక రోజున నీటి దరిన నీటి కోడి ఒకటి ఆహారం కోసం తిరుగుతుండగా చెట్టుపైనుండి గాలికి గండు చీమ జారి నీటి కోడిపై పడిపోయింది. తనపై గండు చీమ పడినట్లు గమనించిన నీటి కోడి వొడ్డుకు వచ్చి రెక్కలు దులిపి ఆ చీమను కిందకు విసిరింది.

అప్పుడు నీటి కోడిని చూసింది గండు చీమ. ఆ కోడి నన్ను నీటిలో పడిపోకుండా ప్రాణాలు కాపాడింది. కాని నన్ను అది ఆహారంగా తీసుకుంటుందేమోనని గండుచీమ భయపడింది. కాని ఆ చీమ చేతులెత్తి నీటి కోడితో “మాతా” నన్ను ప్రాణాలతో కాపాడినావు నా పిల్లలు చిన్నవారు నీకు ప్రాణ భిక్ష పెట్టమని కోరుతున్నాను అన్నది. అంతలోనే ఎన్నో చీమలు నీటికోడి చుట్టూరా చేరి నమస్కారం చేశాయి. కొన్ని చీమలు మా అమ్మను కాపాడినందుకు మీకు చేతులెత్తి వందనాలు చేస్తున్నాము మీరు మాకు చేసిన మేలు మరువకుండా మీకెప్పుడైన సహాయం చేస్తామని ప్రార్థించాయి. ఆ చిరు ప్రాణుల విన్నపాలకు జ్ఞానోదయం కలిగిన నీటి కోడి మనసుతో “ఇంతటి చిరు ప్రాణుల విన్నపాలు చూస్తుంటే నాకు ఆనందంగా ఉన్నది” ఒక్క గండు చీమను తినగానే నా ఆకలి తీరిపోదు కదా అని ఓ మిత్రులారా, నేటి నుండి నాతో మీ కెట్టి అపాయము జరుగదు మనమంతా మిత్రులుగానే ఉందామంది నీటి కోడి.

గండు చీమ నీటి కోడి ముచ్చటించుచుండగా కొన్ని చీమలు బిలబిలమని వెళ్లటం జరిగింది. కొద్ది సమయంలోనే నీటి కోడిని పట్టాలని పొదలో పొంచి ఉన్న కుంటి నక్క కుర్రోముర్రోమని పరుగుతీసింది. ఏమో జరుగుతుందని అటు చూడగానే జులాయి రాముడు చీమలను దులుపుకుంటూ పల్లె వైపు దౌడు తీస్తున్నాడు. చీమలన్నీ మళ్లి నీటి కోడి చుట్టూరా చేరి మేము ఆ కుర్రాణ్ణి కండలు పీకాం వాడు గురిపెట్టిన గులేరు గురితప్పి పొదలో నక్కకు తగిలింది. “వాడు నాకు గురిపెట్టినది చీమలు కుట్టగానే గురి తప్పి కాబోలు ” అని వాటితో మీరు చిన్న జీవులైనను చేసిన మేలు మరువకుండా ప్రత్యుపకారం చేసి నా ప్రాణాలు కాపాడినందుకు మీకు నేనే వందనాలు చేస్తున్నాను. ఈ రోజు నుండి నేను మీ చీమలను ఆహారంగా తీసుకోనని ప్రమాణం చేస్తున్నానని రెక్కలు టప టపలాండించగానే చీమలన్నీ సంతోషంతో కేరింతలు కొట్టి నాట్యాలు చేయసాగాయి.

-కన్నెకంటి ఆదినారాయణా చారి, 9966384610