Home తాజా వార్తలు పర్యావరణహితమే షైన్ లక్ష్యం

పర్యావరణహితమే షైన్ లక్ష్యం

Sanitary Pads

 

ప్లాస్టిక్ భూతం వల్ల ప్రకృతి ఎంత ధ్వంసం అవుతోందో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ప్లాస్టిక్‌ను వాడొద్దంటూ ప్రతిఒక్కరూ నిర్ణయం తీసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. కనీసం రోజువారీ వస్తువుల్లో ప్లాస్టిక్ లేకుండా చూసుకుంటే పర్యావరణానికి తమ వంతు సాయం చేసినవారవుతారు. ప్లాస్టిక్ తో తయారయ్యే శానిటరీ ప్యాడ్ మట్టిలో కలవడానికి కనీసం 500-800 ఏళ్లు పడుతుందని అంచనా! తెలిసో తెలియకో ఎంతో ఇలాంటివన్నీ వాడి ప్రకృతికి ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నాం. మరి వీటికి ప్రత్యామ్నాయం కూడా ఆలోచించాలి కదా..అలాంటి ఆలోచనే వచ్చింది ఓ సాధారణ మహిళకు.. ఆమే చదురుపల్లి పరమేశ్వరి. పర్యావరణహితమైన ప్యాడ్‌లను ఉత్పత్తి చేస్తోంది.

మార్కెట్‌లో దొరికే శానిటరీ ప్యాడ్‌లు సాధారణంగా సింథటిక్, ప్లాస్టిక్‌తో తయారు చేసినవే. ఖరీదు కూడా ఎక్కువే. వీటిని నాలుగు గంటలకొకసారి మార్చుకోవాలి. లేకపోతే వ్యాధులు సోకే అవకాశం ఉంది. వాడి పడేసిన ఈ ప్యాడ్‌లు పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తాయి. అదే కలపగుజ్జుతో తయారు చేసే ప్యాడ్‌లు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటమే కాకుండా తొందరగా భూమిలో కలిసిపోతాయని చెబుతోంది పరమేశ్వరి. ఈ సమస్యలకు పరిష్కారంగా ‘షైన్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి, ఆ సంస్థ ద్వారా ఎకోఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్‌ల తయారీ, వాటి వినియోగంపై మహిళలకు అవగాహన కల్పిస్తోంది. దీంతోపాటు పది మందికి ఉపాధి కూడా కలిగించడం అభినందనీయం.

మంచి పని చేయాలంటే డబ్బు ఉండగానే సరిపోదు. ముందు సంకల్పం ఉండాలంటోంది పరమేశ్వరి. చిన్నతనం నుంచీ తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించానంటోంది. కూలి పనులు చేసుకుంటూ చదువుకుంది. పలు వృత్తి విద్యా కోర్సులూ నేర్చుకుంది. 2009లో పెళ్లయ్యాక భర్త ప్రోత్సాహంతో పీజీ చేసింది. కొన్నేళ్ల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అవస్థలు పడింది. అప్పుడు ఆమె గర్భిణి. ఎముకలు బలహీనంగా ఉన్నాయి, ఇక బతకటం కష్టమని వైద్యులు కూడా తేల్చేశారు. కానీ సరైన సమయంలో చికిత్స అందడంతో బతికింది. అదే సమయంలో తండ్రికి పక్షవాతం రావడంతో వ్యవసాయం కూలీగా పని చేస్తూ తల్లి కష్టాన్ని చూసింది. మహిళలకుఆర్థిక స్వాతంత్య్రం అవసరాన్ని గుర్తించి ఆ క్రమంలోనే నాలుగేళ్ల క్రితం ‘సొసైటీ ఫర్ హెల్పింగ్ ఇంటిగ్రిటీ నెట్‌వర్క్ ఫర్ ఎంపవర్‌మెంట్’(షైన్) సంస్థను ప్రారంభించింది.

స్నేహితులతో కలిసి పేద మహిళలకు టైలరింగ్, బ్యూటీ కోర్సులూ, కంప్యూటర్ బేసిక్స్ నేర్పించింది. దేశంలో పది రాష్ట్రాల్లో శానిటరీ ప్యాడ్‌ల తయారీ ప్రారంభించాం. మా నిర్వహణ, అవగాహన కార్యక్రమాల విషయంలో మా సెంటర్‌కు మొదటి స్థానం దక్కింది. కేంద్ర ప్రభుత్వం నుండి నాకు ‘స్త్రీ స్వాభిమాన్ ఎక్స్‌లెన్స్ అవార్డు’ గెలుచుకుంది. భవిష్యత్తులో మహిళలకు నైపుణ్య శిక్షణలతో పాటు ఆరోగ్యం-పరిశుభ్రతలపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నట్లు తన లక్షాన్ని చెబుతోంది. ఇప్పుడీ ‘షైన్’.. నేషనల్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో భాగస్వామ్యం అయింది.

షైన్‌కు సంకల్పం
ఈ సంస్థ స్థాపించడానికి ముందు కొన్ని పల్లెటూళ్లకి వెళ్లి రుతుస్రావ సమయంలో మహిళల అలవాట్లను పరిశీలించాను. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని తండాల్లో మహిళలు నెలసరి సమయంలో బట్టలో ఇసుక చుట్టి వాడడం గమనించాను. కొంతమంది జనపనారను వాడుతున్నారు. దేవరకొండలో కట్టెల పొయ్యి బూడిదను పాతబట్టలో చుట్టి వాడుతున్నారు. దీని వల్ల వాళ్లకు ఇన్‌ఫెక్షన్లు వచ్చి, రోగాల బారిన పడుతున్నారు. నెలసరి సమయంలో ఒక మహిళకు ఏడు శానిటరీ ప్యాడ్‌ల అవసరం ఉంటుంది. అయితే, ప్రతినెల వాటిని కొనే స్థోమత లేని వారు మోటు పద్ధతులను పాటిస్తున్నారు. ఇదంతా చూసి ఆశ్యర్యంతోపాటు బాధ కలిగింది. వెంటనే ఇలాంటి చర్యలను నివారించేందుకు చెట్టుబెరడుతో తయారైన పర్యావరణహిత శానిటరీ ప్యాడ్‌ల తయారీ చేపట్టాం. ఇవి పర్యావరణంతోపాటు మహిళల ఆరోగ్యాన్నీ కాపాడతాయని అంటోంది సంస్థ స్థాపకురాలు.

కేంద్ర ఐటీ శాఖ మహిళల ఆరోగ్య రక్షణ, పర్యావరణహితం అనే రెండు లక్ష్యాలతో చేపట్టిన ‘స్త్రీ స్వాభిమాన్’ పథకంలో భాగంగా 2017 సెప్టెంబర్‌లో షైన్ పర్యావరణ హిత ప్యాడ్స్ తయారీని ప్రారంభించింది. అది విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలకు ఈ పథకాన్ని విస్తరించింది. అమెరికా నుండి దిగుమతి చేసుకున్న చెట్ల గుజ్జు రంగారెడ్డిజిల్లా, తుర్కయాంజల్‌లోని షైన్ సంస్థకు తరలిస్తారు. అక్కడ ఎనిమిది దశల్లో గుజ్జును ప్యాడ్‌గా రూపొందిస్తారు. వీటిని పూర్తిగా చేతితో తయారు చేస్తున్నారు. ప్రస్తుతం పది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. నెలకు 40 నుండి 50 వేల ప్యాడ్‌లను ఉత్పత్తి చేసి గ్రామాలకు పంపుతున్నారు. అంతేకాకుండా ఈ ప్యాడ్‌లను చుట్టుపక్కల గ్రామాల్లోని విద్యార్థినులకు, మహిళలకు ఉచితంగా అందజేస్తుందీ సంస్థ.

Waterproof Cotton Fabric Sanitary Pads to Woman