ఎన్‌డిఎ సమావేశంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు జరిగిన నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్‌డిఎ) సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రసంగంలో మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం పరిణామాలు ప్రతిధ్వనించాయి. చిన్నచిన్న విభేదాలు కూటమి ప్రయోజనాలకు అడ్డుపడకూడదని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఎన్డిఏ ఒక పెద్ద కుటుంబమని పేర్కొంటూ ఆయన ‘ప్రజలకోసం కలిసి పనిచేద్దాం. మనకు ప్రజలు పెద్ద మెజారిటీ కట్టబెడుతూ తీర్పిచ్చారు. దాన్ని గౌరవిద్దాం. ఒకే సిద్ధాంతం లేకపోయినా భావసారూప్యం ఉన్న పార్టీల కూటమి మనది. చిన్న చిన్న విభేదాలు మనల్ని అస్థిరపరచకూడదు’ అని చెప్పారు.
పార్టీల మధ్య మెరుగైన సమన్వయానికి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు కావాలని మోడీ సూచించారు. ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజలకు తెలిపేందుకు మనం కలిసి పనిచేయాలని మోడీ కోరారు. విదేశాల్లో నివసించే భారతీయులను సంప్రదించి, దేశంపట్ల మారిన వారి అభిప్రాయాన్ని తెలుసుకోవాలని సమావేశానికి హాజరైన నాయకులకు చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరిగినన్ని రోజులూ ప్రతిరోజూ అందరు ఎంపీలూ హాజరు కావాలని ప్రధాని స్పష్టంగా చెప్పారు.
శివసేన లేకపోవడం లోటే: చిరాగ్ పాశ్వాన్
ఎన్‌డిఏలో ఎంతోకాలంగా భాగస్వామ్యపక్షంగా ఉన్న శివసేన ఈ సమావేశానికి రాని లోటు స్పష్టంగా కనిపిస్తోందని లోక్‌జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యానించారని సమాచారం. ‘మిత్రపక్షాల్లో మరింత సమన్వయం అవసరం. ఎన్‌డిఎ కన్వీనర్‌ను నియమించాలి. సమన్వయ కమిటీనే ఉండి ఉంటే, ఎన్‌డిఎ ప్రభుత్వం నుంచి శివసేన వైదొలిగేది కాదు’ అని చిరాగ్ అభిప్రాయపడ్డారు.