Home ఎడిటోరియల్ బిజెపి ఎత్తుగడల వేగం

బిజెపి ఎత్తుగడల వేగం

BJP--logo-image

మొత్తానికి 2019 క్రీడలు మొదలయ్యాయి. పైన అనుకున్నట్లు ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల చట్టాన్ని మోదీ ప్రభుత్వం యథాతథంగా ఉంచుతూ ఈ వారంలో పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేయటం అందులో భాగం. ఆ వర్గాల ఆగ్రహం దృష్టా బిజెపి విధిలేని పరిస్థితిలో ఆ పని చేసిందన్నది స్పష్టం. కాని ఇతరత్రా వారిపై హిందూత్వ పేరిట, ఆహారపు అలవాట్లు, గోరక్ష, మత విశ్వాసాల పేరిట, కుల వ్యవస్థ రూపంలో బిజెపి, ఆ పార్టీ  వెనుక గల సంఘ్ పరివార్ శక్తులు నిరంతరం, నిరవధికంగా సాగిస్తున్న రకరకాల దురంతాలు ఆగిపోగలవని హామీ ఇవ్వగలరా? ఇవ్వలేరు. 

బడుగు బలహీన వర్గాలు నెమ్మదిగా తనకు దూరమవుతున్నాయని, అది జరిగితే 2019 ఎన్నికలలో అంతకు ముందుగానే జరిగే పలు రాష్ట్రాల ఎన్నికలలో గెలవలేనని బిజెపి జంకుతున్నట్లున్నది. అందువల్లనే కావచ్చు ఈ వర్గాలను సంతోషపెట్టేందుకు ఈ నెలలో ఇప్పటికే వేగంగా కొన్ని చర్యలు తీసుకుంది. ఎస్‌సి, ఎస్‌టి చట్టాన్ని యథాతథంగా ఉంచుతుండటం, బిసి కమిషన్ చట్టబద్ధత కల్పిస్తుండటం, ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రమోషన్లలోనూ రిజర్వేషన్ల ఆలోచన ఇటువంటివే. ఎన్నికలలోగా ఇంకా ఏమేమి జరగగలవో వేచి చూడాలి. ఈలోగా, ఈ నెల 15 నుంచి 30 వరకు సామాజిక న్యాయ పక్షోత్సవాన్ని, తర్వాత ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 9 వ తేదీ వరకు సామాజిక న్యాయ వారోత్సవాన్ని నిర్వహించాలని ప్రధాని మోడీ తమ ఎంపిలను కోరారు.

ఈ తరహా చర్యలు బడుగు బలహీన వర్గాలకు ఎంతవరకు మెప్పించగలవు, చివరకు ఎన్నికలలో బిజెపి గెలవగలదా లేదా అనేవి ఇపుడే జోస్యం చెప్పలేము.ఈ వర్గాలకు బిజెపిపట్ల అసంతృప్తి కలగటానికి వేర్వేరు కారణాలున్నాయి. ఎస్‌సి, ఎస్‌టిలపై అత్యాచారాల నిరోధక చట్టం సుప్రీంకోర్టు తీర్పు వల్ల బలహీనపడనున్నదని తాము ఎంత ఆందోళన చెందినా ప్రభుత్వం పరిస్థితి చక్కదిద్దేందుకు జాప్యం చేసిందన్నది వాటిలో ఒకటి. అంతేతప్ప అదొక్కటే కారణం కాదు. తమ జీవన స్థితిగతులు బిజెపి పాలనలో మెరుగుపడటం లేదనే సాధారణ రూప అసంతృప్తి ఒకటి ఉంది. 2014 ఎన్నికల సమయంలో ఈ వర్గాలకు కాంగ్రెస్ పాలన పట్ల ఇటువంటి అసంతృప్తి ఉండేది. అందుకు కాంగ్రెస్ కాలపు తీవ్ర అవినీతి తోడైంది. అటువంటి పరిస్థితులలో బిజెపి మెరుగైన పాలన కోసం హామీ ఇస్తూ ముందుకు రావటంతో ఈ వర్గాలు నరేంద్ర మోదీని చూసి బిజెపికి ఓటు చేశాయి. ఇతర సాధారణ వర్గాలవలెనే వీరు కూడా ఆ పార్టీని విశ్వసించారు.

కాని తర్వాత నాలుగేళ్ల మోదీ పాలనలో జీవితాలు మెరుగుపడింది లేదు. గ్రామీణులలో అత్యధిక శాతం అయిన బిసి, ఎస్‌సి, ఎస్‌టిల వ్యవసాయాలు, వృత్తులు, చదువులు, ఉపాధులు, ధరవరల పరిస్థితిలో సంతోషించదగిన మార్పు లేదు. ఇదే ప్రభావం ఆయా వర్గాలకు చెందిన పట్టణ వాసులపై కూడా కన్పించటం మొదలైంది. దాని అర్థం 2014 నాటి పరిస్థితి పూర్తిగా తలకిందులైందని, ఇక బిజెపి ఓటమి ఖాయమైపోయిందని కాదు. ఆ విధంగా భావించి ప్రతిపక్షాలు తొందరపడుతున్నాయి. అదే సమయంలో బిజెపికి ఒకప్పటివలె భరోసా ఉందని కూడా అనలేము. అది స్వయంగా వారి మాటలు, చేతలలోనే కన్పిస్తున్నది. అనగా ఇది ఒకప్పటి భరోసాల నుంచి అపనమ్మకాల వైపు పరివర్తనా దశ అన్నమాట. ఎపుడైనా ఏ విషయంలోనైనా పరివర్తనా దశలు కీలకమైనవని వేరే చెప్పనక్కరలేదు. అవి ప్రమాదకరమైనవి కూడా.
ప్రస్తుతం అటు బిజెపి, ఇటు ప్రతిపక్షాలు కూడా సరిగా ఈ పరివర్తనా దశలోనే ఉన్నాయి. ఈ దశలో ఎవరే చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా వ్యవహరిస్తారనే దానిని బట్టి బిజెపి మరింత బలహీనపడుతుందా లేక నష్టాలను భర్తీ చేసుకుంటుందా? ప్రతిపక్షాలకు బిజెపి వైఫల్యాల వల్ల అంది వచ్చినట్లు కన్పిస్తున్న అవకాశాలు నికరంగా మారుతాయా లేక చేజారుతాయా అనేది ఆధారపడి ఉంటుంది. ఇద్దరి చదరంగపు క్రీడలు ఈ దశలో సరిగా ఈ అంశం చుట్టూ, వ్యూహం చుట్టూ తిరుగుతాయి.

ప్రస్తుతం జరుగుతున్నది అదే. పైన పేర్కొన్న అంశాలు అందులో భాగమే. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల చట్టాన్ని పురస్కరించుకుని ఆ వర్గాలు ఆందోళన జరుపుతుండగా, తాము అంతకు మించి ఆందోళన చెందుతున్నట్లు ప్రతిపక్షాలు హంగామా చేస్తున్నాయి. వాస్తవానికి ఈ వర్గాలకు అన్యాయాలు, వారిపై అత్యాచారాలు, వారి ఆక్రందనలపట్ల నిర్లక్షం, వారిని ఓట్ల కోసం ఉపయోగించుకుని దగా చేయటం, అవసరమైనపుడు కపట ప్రేమలు చూపటంలో ఉభయులలో ఎవరికి ఎవరూ తీసిపోరు. వివిధ పార్టీల పాలనల్లో ఒకవైపు అభివృద్ధి లెక్కల నుంచి మరొక వైపు అన్యాయాలు, అత్యాచారాలు, వెనుక బాటుతనాల లెక్కల వరకు పోల్చి చూసినట్లయితే ఇది స్పష్టమవుతుంది. కనుక ఎవరి హామీలనుగాని, అవి అమలు కాలేదనే మరొకరి మొసలి కన్నీళ్లనుగాని నమ్మవలసిన అవసరం లేదు.

మొత్తానికి 2019 క్రీడలు మొదలయ్యాయి. పైన అనుకున్నట్లు ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల చట్టాన్ని మోదీ ప్రభుత్వం యథాతథంగా ఉంచుతూ ఈ వారంలో పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేయటం అందులో భాగం. ఆ వర్గాల ఆగ్రహం దృష్టా బిజెపి విధిలేని పరిస్థితిలో ఆ పని చేసిందన్నది స్పష్టం. కాని ఇతరత్రా వారిపై హిందూత్వ పేరిట, ఆహారపు అలవాట్లు, గోరక్ష, మత విశ్వాసాల పేరిట, కుల వ్యవస్థ రూపంలో బిజెపి, ఆ పార్టీ వెనుక గల సంఘ్ పరివార్ శక్తులు నిరంతరం, నిరవధికంగా సాగిస్తున్న రకరకాల దురంతాలు ఆగిపోగలవని హామీ ఇవ్వగలరా? ఇవ్వలేరు. చట్టాలు చేయటం, పునరుద్ధరించటం ఎన్నికల ఎత్తుగడలలో భాగం. కాని ఆ విధంగా వ్యవహరించి ఈ వర్గాలను అణచివేయటం సంఘ్ పరివార్ సామాజిక వ్యూహం. అది దీర్ఘకాలికమైనది. నిరంతరమైనది.

ఆ విషయం అట్లుంచితే, సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కన్పించిన ఊగిసలాటలు ఎస్ ఎస్‌టి వర్గాలను ఏ విధంగా ఆగ్రహపరచాయో ఇప్పటికే అఖిల భారత బంద్ సమయంలో కన్పించింది. వారు ఇదే నెలలో మరొక బంద్‌కు పిలుపును ఇవ్వగా, స్వయంగా బిజెపి పార్టీలో, దాని మిత్రపక్షాలుగా ఉన్న దళిత పార్టీలలో నిరసనలు గత నాలుగేళ్లలో ఎప్పుడూ లేనంతగా బయటపడ్డాయి. కనుక, ఆ చట్టాన్ని యథాతథంగా ఉంచే బిల్లుకు పార్లమెంటు ఆ మోదం ఆ వర్గాలు సాధించుకున్నది తప్ప, మోదీ ప్రభుత్వపు ఉదారత్వం కాదు.

ఇదే సమయంలో ఈ వర్గాలను ఎన్నికల కోసం అనుకూలంగా మార్చుకునేందుకు బిజెపి ప్రభుత్వం పనిలో పనిగా మరి రెండు చర్యలు తీసుకుంది. చదువులు, ఉద్యోగాలలో రిజర్వేషన్లుగాక ప్రమోషన్లలోనూ రిజర్వేషన్లు ఉండాలని వారు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇందులో రెండు స్పష్టమైన తర్కాలున్నాయి. యథాతథంగా రిజర్వేషన్ల సీట్లు మొదటి నుంచి ఇప్పటి వరకు పూర్తిగా నిండటం లేదు. బ్యాక్ లాగ్ రూపంలో అవి పేరుకుపోవటం చివరకు జనరల్ పూల్‌కు మారటం ఒక రొటీన్ విషయం అయింది. రిజర్వేషన్ కోటాలో నిండగల విధంగా వారికి విస్తృత స్థాయిలో చదువులు, శిక్షణల కోసం ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవటం ఇన్ని దశాబ్దాలు గడిచినా తర్వాత కూడా జరగటం లేదు. తగిన ప్రణాళికలు, చిత్తశుద్ధి లేకపోవటమే అందుకు కారణమని ఎన్నో నివేదికలు, స్వతంత్ర అధ్యయనాలు ఎత్తి చూపినా పరిస్థితిని ఏ పార్టీ ప్రభుత్వం కూడా మార్చటం లేదు.

పోతే, యథాతథంగా రిజర్వేషన్ల భర్తీ జరిగిన లెక్కలను తీసుకుంటే ఎస్‌సిలకు రిజర్వ్ చేసిన 15 శాతంగాని, ఎస్‌టిలకు చేసిన 7 1/2శాతం గాని నిండటం లేదు. ప్రమోషన్లలో అవకాశాలు లభించక ఉన్నత స్థాయి ఉద్యోగాలలో వారి సంఖ్య నామమాత్రంగా మిగులుతున్నది. పరిస్థితి ఎంత హీనంగా ఉందంటే, ఒకవేళ ప్రమోషన్లలోనూ రిజర్వేషన్లు కల్పించినా ఈ రెండు వర్గాల రిజర్వేషన్ శాతాలు పూర్తిగా భర్తీ కాగలవా అన్నది అనుమానాస్పదమే. కనుక పరిస్థితి కొద్దిగానైనా మెరుగుపడాలన్నా వారికి ఒక మేరకైనా ఉన్నత పదవుల అవకాశాలు లభించాలనుకున్నా ప్రమోషన్లలో రిజర్వేషన్లు తప్పనిసరి. కారణాలు ఏవైతేనేం అందుకు ఇంత కాలానికి అవకాశం లభిస్తున్నందుకు సంతోషించాలి. అయితే దీనిపై ఎవరైనా కోర్టుకు వెళతారా, అక్కడ ఏ తీర్పు రాగలదన్నది వేచి చూడవలసిన విషయం.

ఇక జాతీయ బిసి కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించటం మరొక విషయం. మోదీ తాను బిసినని ప్రకటించుకుని మద్దతులు బాగానే పొందుతూ వచ్చారుగాని, ఇటువంటి నికరమైన చర్యలకు గత నాలుగు సంవత్సరాలలో పూనుకోలేదన్నది గుర్తించవలసిన విషయం. బిజెపియేగాక సంఘ్ పరివార్ సంస్థలు కూడా హిందూత్వ పేరిట బిసిలను రెచ్చగొట్టి తమ అజెండా కోసం బాగానే ఉపయోగించుకుంటున్నాయి. వారి ‘సైనికులు’గా పని చేస్తున్న హింసాకారులు ఎక్కువగా ఈ వర్గాల నుంచి వస్తున్న వారే. దానినట్లుంచి, సాధారణ పరిపాలన, అభివృద్ధి లేమిపట్ల ఈ వర్గాలలోనూ అసంతృప్తి క్రమంగా తలెత్తుతున్నది. కనుక ఎన్నికల కోసం వారిని సంతృప్తి పరచవలసిన అగత్యం మోదీకి ఏర్పడింది. అందుకోసం తీసుకొన్ని ఒక చర్య బిసి కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి.