Home తాజా వార్తలు పంట దిగుబడులపై వాతావ‘రణం’

పంట దిగుబడులపై వాతావ‘రణం’

Agricultureపెరుగుతున్న ఉష్ణోగ్రతలో పడిపోతున్న ఉత్పాదకత
గతి తప్పిన వర్షాలతోనూ నష్టాలు
రానున్న కాలంలో మరింతగా పెరిగే ప్రమాదం
మేనేజ్, కేంద్ర ఆర్థిక సర్వేల్లో స్పష్టం

హైదరాబాద్: వాతావరణంలో చోటు చేసుకుంటున్న పెను మార్పల కారణంగా రానున్న కాలంలో వ్యవసాయం మరింత కష్టం కానుందా? దేశానికే అన్నం పెడుతున్న అన్నదాత ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బతీయనుందా? అంటే & అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే వాతావరణ మార్పుల ప్రభావంతో మన దేశంలో ప్రస్తుతం ఏటా రూ. 64,122 కోట్లు వ్యవసాయోత్పత్తులు నష్టపోతున్నట్లు అంచనా. మేనేజ్ (జాతీయ వ్యవసాయ విస్తరణ, నిర్వహణ) సంస్థ నిర్వహించిన సర్వేల్లో ఇదే విషయం స్పష్టమైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతోనూ పంట దిగుబడులు తగ్గుతున్నట్లు మేనేజ్ అధ్యయనం తేలింది. రాష్ట్రంలో మొక్కజొన్న, వరి లాంటి పంటల్లో 25 శాతం వరకు దిగుబడులు తగ్గినట్లు, గోధుమలో 7 శాతం తగ్గుతుందని పరిశీలనాత్మకంగా కూడా నిరూపితమైంది.

ఇందుకోసం రైతులను, గ్రామీణ సమాజాన్ని వీటిని అధిగమించేలా ఎప్పటికప్పుడు ఏర్పడే నూతన పరిస్థితులకు అనుగుణంగా సన్నద్ధం చేయాలని మేనేజ్ తన అధ్యయనంలో సూచించింది. అలాగే వాతావరణంలో వస్తున్న తీవ్రమైన మార్పులు వ్యవసాయ ఆదాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఇటీవల కేంద్ర ఆర్థిక సర్వే పేర్కొంది. దీని ప్రకారం వాతావరణ మార్పులు సగటున 15 నుంచి 18 శాతం, వర్షాధార సాగు ప్రాంతాల్లో 20 నుంచి 25 శాతం వరకు రైతుల ఆదాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. 2020, 2021 నాటికి ఇది మరింత వికృత రూపం దాల్చనుందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. దీనిపై రైతాంగంతో పాటు ప్రభుత్వాలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. వ్యవసాయోత్పత్తులను దారుణంగా దెబ్బతీస్తున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు పద్ధతులు మారితేనే ఉత్పాదకత కూడా పెరుగుతుందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. వాతావరణ మార్పులు దేశవ్యాప్తంగా పలు విధాలుగా రూపు తీసుకుంటున్నాయి.

ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన తేడా ఉన్నా దేశవ్యాప్తంగా పలుచోట్ల వేసవిలో అకాల వర్షాలు రావడం, మొత్తంగా వర్షం కురిసిన రోజుల సంఖ్య తగ్గడం కనిపిస్తోంది. మన రాష్ట్రంలో గత 8 సంవత్సరాల వర్షాకాలాన్ని పరిశీలిస్తే వాతావరణం పంటలపై ఎలాంటి ప్రభావం చూపిందో స్పష్టమౌతోంది. 2009-10 నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2018-19 వరకు నైరుతి రుతుపవనాలు సకాలంలో రాక, వర్షాలు సరైన సమయంలో పడక పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ మొత్తం వ్యవధిలో 6 సార్లు లోటు వర్షపాతమే నమోదైంది. వాస్తవానికి జూన్, జూలై, ఆగస్టు మాసాలలో వర్షాలు తగినంతగా కురవడం లేదు.

అయితే వాతావరణంలో మార్పుల కారణంగా వర్షకాలం ముగిసిన తరువాత పంట చేతికొచ్చే సమయానికి అక్టోబర్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వానకాలంలో వర్షాలు సమయానికి పడకపోగా, యాసంగిలో పంట తీసే సమయానికి అకాల వర్షాలు, వడగండ్లు కురవడం ఇందుకు ఉదాహరణ. వాతావరణంలో వస్తున్న మార్పులు మార్పుల మూలంగా హానికరమైన, మేలుచేసే క్రిమికీటకాల మధ్య సహజమైన సమతూకం దెబ్బతింటోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇవి చీడపీడలు పెరగడానికి దోహదం చేయనున్నాయి. ఇప్పటివరకు వాతావరణ మార్పులు – వ్యవసాయం అనే అంశంపై ఎన్నో సమావేశాలను, సదస్సులను అంతర్జాతీయంగా, జాతీయంగా ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు నిర్వహించినప్పటికీ సరైన పరిష్కార మార్గాన్ని కనుగొని, ఆ దిశగా సాగే ప్రయత్నాలను అమలు చేయకపోవడం గమనార్హం.

Weather impacts on crop yields