Thursday, March 28, 2024

లాభాల బాటలో మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

Weekly stock market Review

 

గత వారం 1,731 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
(మార్కెట్ సమీక్ష)

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల బాటపట్టాయి. అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ కొనుగోళ్లు పెరగడంతో దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. గతవారం మొత్తంగా చూస్తే సెన్సెక్స్ 1,731 పాయింట్లు లాభపడింది. శుక్రవారం ఎఫ్‌పిఐ (విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు) స్వల్పంగా రూ.109 కోట్ల విక్రయాలు జరిపారు. అలాగే దేశీయ ఇన్వెస్టర్లు (డిఐఐ) రూ.34 కోట్ల కొనుగోళ్లు జరిపారు. వరుసగా మూడో రోజులు మార్కెట్లు పెరిగాయి. వారాంతం శుక్రవారం జపాన్ ప్రధాని షింజె అబె హత్య సంఘటన తర్వాత ఆసియా మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. దేశీయ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు గురయ్యాయి. అయినప్పటికీ ఆఖరికి లాభపడ్డాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 303 పాయింట్లు పెరిగి 54,481 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 88 పాయింట్లు లాభపడి 16,220 పాయింట్ల వద్ద స్థిరపడింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. క్యూ1(ఏప్రిల్‌జూన్) ఫలితాలు ప్రారంభమయ్యాయి. మొదటగా దేశంలో అతిపెద్ద ఐటి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) ఫలితాలను ప్రకటించింది.

కంపెనీ నికర లాభం రూ.9,478 కోట్లతో 5.2 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో రూ.9,008 కోట్ల లాభం వచ్చింది. ఐటి దిగ్గజం ఆదాయం రూ.52,758 కోట్లతో 16.2 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ.45,411 కోట్లుగా ఉంది. ఇక గురువారం కూడా మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీ 16,000 మార్కును దాటగా, సెన్సెక్స్ 54,000 పాయింట్ల మార్క్ పైకి చేరుకుంది. మెటల్, కన్జూమర్ డ్యూరబుల్స్, బ్యాంక్ స్టాక్స్‌లో కొనుగోళ్లతో మార్కెట్ లాభాల దిశగా పయనించింది. అయితే రూపాయి విలువ రోజు రోజుకీ క్షీణిస్తూనే ఉంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ అత్యంత కనిష్ఠ స్థాయి 79.28కు పడిపోయింది. జూన్‌లో భారత్ ఎగుమతులు 37.94 బిలియన్ డాలర్లతో 16.78 శాతం పెరిగాయి. వీటిలో బంగారం, క్రూడ్ ఆయిల్ దిగుమతులు 25.63 బిలియన్ డాలర్లతో గణనీయంగా పెరిగాయి. అమెరికా డాలర్ బలపడడం, చమురు ధరలు పెరగడం, బలహీన గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ వెరసి రూపాయి విలువ మరింతగా క్షీణిస్తోందని నిపుణులు అంటున్నారు. ఫెడరల్ రిజర్వు దూకుడుగా వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాల వల్ల కూడా డాలర్ మరింత పటిష్ఠం అవుతోందని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News