Home ఎడిటోరియల్ కోటాకు గట్టి శాసన కవచం

కోటాకు గట్టి శాసన కవచం

Cartoon

 

దళిత, గిరిజన సామాజిక తరగతుల సంక్షేమానికి సంబంధించిన రిజర్వేషన్లపై తరచుగా వివాదాలు, వాదోపవాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రజా ప్రాతినిధ్య పదవుల్లోని రిజర్వేషన్ల కంటే ఉద్యోగాల్లో రిజర్వేషన్లపైనే ఆందోళనకర, ప్రమాదకర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నవి. రాజకీయ పదవుల్లో కొందరు దళిత, గిరిజన నాయకులు ఉండడం వలన లభిస్తున్న మేలు కంటే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వల్లనే ఎంతో కొంత సామాజిక న్యాయం నెరవేరుతోంది. అందువలనే ఉద్యోగాల్లో రిజర్వేషన్లపైనే అసహనం, కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తున్నవి. రిజర్వేషన్ల వలన విద్య, ఉద్యోగాల్లో ఎదిగొచ్చిన వారిలో అంబేడ్కరిస్టులు, సామాజిక న్యాయం సిద్ధాంతంతో పని చేసే కమ్యూనిస్టులే రిజర్వేషన్ల సంరక్షణకు నిజాయితీగా పోరాడుతున్న విషయం తెలిసిందే. పాలకవర్గాలు ఓట్లు కోసమైనా స్పందించక తప్పడం లేదు. న్యాయాన్ని అన్యాయం వెంటాడుతున్నట్లే రిజర్వేషన్లను అవరోధాలు, ప్రమాదాలు వెంటాడుతున్నవి.

రాజ్యాంగం అమల్లోకొచ్చిన ఏడాదిలోపే ఎస్‌సి, ఎస్‌టిలకు లభిస్తున్న విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషనుపై హైకోర్టు, సుప్రీంకోర్లు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులిచ్చాయి. ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా వున్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చొరవతో రాజ్యాంగం ఆర్టికిల్ 15కి చేసిన సవరణతో మొదటి ప్రమాదం తప్పింది. గడిచిన ఏడు దశాబ్దాల కాలంలో కూడా వివిధ సందర్భాల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల వలన మరికొన్ని సార్లు రాజ్యాంగానికి స్వల్పమైన సవరణలు చేయాల్సివచ్చింది. కాగా జార్ఖండ్ ప్రభుత్వం 2012లో కొన్ని ఉద్యోగ ఖాళీలను రిజర్వేషన్లు పాటించకుండా ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధుస్తూ ఈనెల ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రిజర్వేషన్లు మరోసారి ప్రమాదంలో పడే పరిస్థితి దాపురించింది.

ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపనుల శాఖలోని అసిస్టెంట్ ఇంజినీర్ల ప్రమోషన్లలో ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం లేదని 2012 సెప్టెంబర్ 5న ఇచ్చిన ఉత్తర్వులను వినోద్ కుమార్ మరో ఇద్దరు ఎస్‌సి తరగతికి చెందిన ఉద్యోగులు ఆ రాష్ట్ర హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. దానిపైన తీర్పు చెప్పిన హైకోర్టు ‘పదోన్నతుల్లో రిజర్వేషన్లు పాటించాలా అక్కర్లేదా అనేది నిర్ణయించడానికి సదరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆయా సామాజిక తరగతుల ప్రాతినిధ్యం ఏ మేరకు ఉన్నదనే విషయమై నాలుగు నెలల్లో సమాచారం సేకరించాలని, దాని ఆధారంగా ప్రాతినిధ్యం తక్కువగా వున్న సామాజిక తరగతుల వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని‘ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆ తీర్పులో ఒక ముఖ్యమైన విషయం యిమిడివుంది. రిజర్వేషన్లు యింకా ఎంతకాలం అనే ప్రశ్నలకు కూడా అది సమాధానం కావచ్చు. ఏ కేడర్ పోస్టుల్లో అయినా ఎస్‌సి వారికి 15% వరకు, ఎస్‌టి వారికి 8% వరకు అంటే (అడిక్వాసి) తగినంత మేరకు రిజర్వేషన్లు అమలు చేయాల్సి వుంటుందనే అర్ధం అందులో వుంది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ కేసును విచారించిన జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హేమంత్ గుప్తాల సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదు అంటూ ఇచ్చిన తీర్పుతో ఆందోళనకర పరిస్థితి తలెత్తింది.

ఇరువురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన తీర్పు సారాంశం ఇలా వుంది: ‘పబ్లిక్ సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడాల్సిన అవసరం లేదు. ప్రమోషన్లలో రిజర్వేషన్ ఎవరికీ ప్రాథమిక హక్కేమీ కాదు. రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాలను ఆదేశించే అధికారం సుప్రీంకోర్టుకు కూడా లేదు. రిజర్వేషన్లు ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణాధికారం. ఏ నిర్ణయమైనా సంబంధిత పబ్లిక్ సర్వీసుల్లో షెడ్యూల్డు కులాలు, తరగతుల ప్రాతినిథ్యానికి సంబంధించిన డేటా సమాచారం ప్రాతిపదికన ఉండాలి’. రాజ్యాంగం ఆర్టికిల్ 16(4), ఆర్టికిల్ 16(4ఎ) ఆధారంగా ఈ తీర్పు చెప్పాల్సి వస్తుందని న్యాయమూర్తులు చెప్పారు. న్యాయమూర్తుల అవగాహన మేరకు వ్యాఖ్యానాలు పరిపరి విధాలుగా వుండవచ్చు, కానీ రాజ్యాంగంలో వున్నదే నికరంగా నిలిచే అవకాశం ఎక్కువగా వుంటుంది.

‘ఆర్టికిల్ 16(4):- ప్రభుత్వ సర్వీసుల్లో వెనకబడిన తరగతుల ప్రాతినిధ్యం తగినంత లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే సంబంధిత తరగతుల వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఆర్టికిల్ 16 (4ఎ):- ప్రభుత్వ సర్వీసుల్లోని ఏ తరగతి పోస్టులకైనా షెడ్యూల్ట్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి ప్రమోషన్లలో తగినంత ప్రాతినిధ్యం లేదని భావిస్తే వారికి ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించవచ్చు.’ గడిచిన 70 ఏళ్ల కాలంలో ఉద్యోగాలు, ప్రమోషన్లపై వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పులు వచ్చినా ‘రిజర్వేషన్లు పాటించడం లేదా పాటించకపోవడం అనేది రాష్ట్రాల ఇష్టం’ అనే తీర్పు రావడం ఇదే. ఇది చాలా అన్యాయమైంది. దేశంలో, ముఖ్యంగా కేంద్రంలో రాజకీయ వాతావరణం, పాలకుల స్వభావం ఆ విధంగా వుంది మరి. బిజెపి ప్రభుత్వాలను నడిపిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ రిజర్వేషన్ల విషయాన్ని సమీక్షించాలి అని తరచుగా ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే.

అన్ని పార్టీలకన్నా ముందుగా స్పందించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు) ‘సుప్రీంకోర్టు తీర్పు దళిత, గిరిజన, ఒబిసిల ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా వుంది. ఇలాంటి తీర్పు రావడానికి కారణమైన రాజ్యాంగంలోని 16(4), 16(4ఎ) అధికరణల్లోని లోపాన్ని సరిదిద్దాలి. రిజర్వేషన్లను ప్రాథమిక హక్కుగా నిర్ధారిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో తీర్మానం ఆమోదించి, రిజర్వేషన్లను విధిగా సార్వత్రికంగా అమలు చేయడానికి అనువుగా చట్టం చేయాలి’ అని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ‘బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ డిఎన్‌ఎలోనే రిజర్వేషన్ల పట్ల అసహనం వుంది, రిజర్వేషన్లను రాజ్యాంగంలో గ్యారంటీ చేయకపోతే ఈ ప్రభుత్వం వాటిని తొలగించే ప్రమాదం వుంది’ అని అన్నారు. బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి ‘ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిల హక్కులను నెమ్మదిగా చంపడానికే బిజెపి ప్రభుత్వం పని చేస్తుంది’ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ ఈనెల 11న లోక్‌సభలో జరిగిన చర్చలో జోక్యం చేసుకుంటూ సున్నితమైన రిజర్వేషన్ల విషయాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని నిందించారు.

సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ ‘సమస్యకు సరైన పరిష్కారం కొరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేస్తుంది’ అని ప్రకటించారు. కాగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర ఆజాద్ ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ ఫిబ్రవరి 11న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిసింది. మరి కొంత మంది పెద్దలు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రివ్యూ పిటిషన్ వేయాలని కోరుతున్నారు. రాజ్యాంగం ఆర్టికిల్స్ 16(4), 16(4ఎ) లోని పదాలు అలాగే వున్నంత కాలం ధర్మాసనాలు మారినా రిజర్వేషన్లకు గ్యారెంటీ వుంటుందని ఆశించలేము.

సిపిఐ(ఎమ్) సూచించినట్లు ఆ ‘పదాల్లోని లోపాలను సరిదిద్దితేనే సరైన పరిష్కారం కాగలదు. రేపు ఒక విస్తృత ధర్మాసనం సానుభూతితో రిజర్వేషన్లకు సానుకూలమైన తీర్పు చెప్పినా దాన్ని కూడా ఛాలెంజ్ చేసే అవకాశం వుంటుంది. జ్యుడీషియరీ ఉన్నత స్థానాల్లో ఎస్‌సి, ఎస్‌టి తరగతుల ప్రాతినిథ్యం వుంటే మంచిదే, కానీ ఒకరో ఇద్దరో ఉన్నంత మాత్రాన సానుకూల తీర్పులు వస్తాయని ఆశించలేము. ఒకవేళ వచ్చినా పక్షపాతంగా ఇచ్చారని ఆక్షేపించే అవకాశమూ వుంటుంది. సామాజిక రిజర్వేషన్లను సామాజిక వివక్ష వున్నంత కాలం నిరాటంకంగా కొనసాగించకతప్పదు. కనుక ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి తరగతుల సామాజిక రిజర్వేషన్ల రక్షణకు పటిష్టమైన చట్టం అనివార్యం, అత్యవసరం.

Welfare of Dalit and Tribal Social Classes